తుపాకీతో బెదిరించి పెట్రోల్‌బంకులో నగదు చోరీ

ABN , First Publish Date - 2020-12-07T04:57:04+05:30 IST

పెట్రోలు బంకులో అర్ధరాత్రి దుండగులు తుపాకీతో బెదిరించి నగదు చోరీ చేసిన ఘటన గుత్తికొండ సమీపంలో చోటు చేసుకుంది.

తుపాకీతో బెదిరించి పెట్రోల్‌బంకులో నగదు చోరీ

పిడుగురాళ్ల, డిసెంబరు6: పెట్రోలు బంకులో అర్ధరాత్రి దుండగులు తుపాకీతో బెదిరించి నగదు చోరీ చేసిన ఘటన గుత్తికొండ సమీపంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గుత్తికొండ సమీపంలో ఉన్న భారత్‌ పెట్రోలియం బంకులోకి శనివారం అర్థరాత్రి దాటిన తరువాత గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ప్రవేశించారు. ఒకరు బయట కాపలా ఉండగా, ఇద్దరు లోపలికి వచ్చి తమ వద్ద ఉన్న తుపాకీతో అక్కడి సిబ్బందిని బెదిరించారు. సీసీ కెమెరా, కంప్యూటర్‌, మరికొన్ని వస్తువులను పగలగొట్టి.. బీరువాలో ఉన్న రూ.35వేల నగదును తీసుకెళ్లినట్లు సిబ్బంది తెలిపారు. బంకులో పనిచేస్తున్న జొన్నలగడ్డ కిరణ్‌తేజ, ఇనుముక్కల ఆనంద్‌బాబు అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిద్దరిని గాయపరిచారు. వీరిద్దరు పిడుగురాళ్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. డీఎస్పీ విజయ్‌భాస్కర్‌రెడ్డి, సీఐ ప్రభాకరరావు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

Read more