పింఛన్ హాంఫట్
ABN , First Publish Date - 2020-12-02T05:19:37+05:30 IST
పేదల నోటి కాడ కూడుని ప్రభుత్వమే లాగేసుకొంటుంటే వారు తమ గోడు ఎవరికి వెళ్లబోసుకోవాలో తెలియని పరిస్థితి నెలకొన్నది.

మూడు నెలల మొత్తం ఖజానాకే
ఒక్కో పింఛన్‌దారుడికి రూ.6,750 నష్టం
వేలిముద్రలు పడని వారు వలస వెళ్లారని తొలగింపు
ఫిర్యాదులతో పునరుద్ధరణ.. పాతవి అడగొద్దని మెలిక
గుంటూరు, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): పేదల నోటి కాడ కూడుని ప్రభుత్వమే లాగేసుకొంటుంటే వారు తమ గోడు ఎవరికి వెళ్లబోసుకోవాలో తెలియని పరిస్థితి నెలకొన్నది. వేలిముద్రలు పడటం లేదని వరుసగా మూడు నెలలు వృద్ధాప్య/వితంతు పింఛన్లను కొంత మందికి ఇవ్వలేదు. సామాజిక పింఛన్లను ఇంటి వద్దనే పంపిణీ చేసేందుకు వైసీపీ ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థ ని తీసుకొచ్చింది. అయితే పాత విధానంలోని సమస్యలు పరిష్కారం కాక పోగా కొత్తవి వస్తోన్నాయి. గతంలో వేలి ముద్రలు పడకపోతే కనుపాపలు స్కానింగ్ చేసేవారు. అవి కూడా స్కానింగ్ కాక పోతే వీఆర్‌వోలు పింఛన్ దారుని ధ్రువీకరించుకుని తన వేలిముద్ర వేసి పెన్షన్‌ని పంపిణీ చేసేవారు. అయితే వలంటీర్ల వ్యవస్థ వచ్చిన తర్వాత వేలిముద్ర పడకపోతే సచివాలయాలకు రమ్మంటోన్నారు. అక్కడికి వెళితే ఐరిస్ స్కానింగ్/ప్రత్యేక యాప్ ద్వారా అథెంటికేషన్ చేసి పెన్షన్ ఇవ్వాల్సి ఉండగా జిల్లాలో పలుచోట్ల గత మూడు నెలల నుంచి కేవలం వేలిముద్రలు మాత్రమే చూసి పెన్షన్ చెల్లింపు వాయిదా వేస్తూ వచ్చారు. తీరా గత నెలలో పింఛన్ ప్రభుత్వం తొలగించిందని చెప్పడంతో దశాబ్దాలుగా పొందుతున్న లబ్ధిదారులు ఆందోళన చెందారు. వలంటీర్ల వ్యవస్థ వచ్చినా ప్రతీ నెలా జిల్లాలో ఉన్న 5,87,419 మంది పింఛన్‌దారుల్లో 20 వేల నుంచి 25 వేల మంది పెన్షన్ అందుకోలేకపోతున్నారు. దీనికి కారణం వేలి ముద్రలు పడకపోవడం, కనుపాపలు స్కాన్ కాక పోవడం తదితర కారణాలే.
వలస వెళ్లారని తొలగింపు
పెన్షన్ల జాబితా నుంచి పేర్లు తొలగించిన వారిలో కొంతమంది వైఎస్‌ఆర్ పెన్షన్ కానుక వెబ్‌సైట్‌లో పింఛన్ ఐడీ నమోదు చేసి శోధించారు. అందులో సం బంధిత పింఛన్‌దారు శాశ్వతంగా వలస వెళ్లిపోయారని కారణం పేర్కొని స్టేటస్‌లో తొలగించినట్లుగా పేర్కొ న్నారు. అది చూసి చాలామంది డీఆర్‌డీఏ, నగరపాల కసంస్థ, మునిసిపల్ అధికారులను ఆశ్రయించారు. తాము వలస వెళ్లలేదని, తమ పెన్షన్‌ని పునరుద్ధరిం చాలని కోరారు. దాంతో అధికారులు ప్రత్యేకంగా రోల్‌బ్యాక్ లెటర్స్‌ని సెర్ప్ సీఈవో కార్యాలయానికి పం పించారు. ఎవరి పింఛన్‌లు అయితే రోల్‌బ్యాక్ చేయా లని లేఖలు వెళ్లాయో వాటి వరకు పునరుద్ధరించారు. అయితే గతంలో వారికి చెల్లించకుండా ఉన్న మూడు నెలల పెన్షన్‌ని మాత్రం ఇవ్వమని, కొత్తగా రూ.2,250 ఇస్తామని సచివాలయాల సిబ్బంది చెబుతున్నారు. అయితే మూడు నెలల నుంచి చెల్లించకుండా ఉన్న పిం ఛన్‌ని మాత్రం ప్రభుత్వం తన ఖజానాలో జమ వేసే సుకుని ఇప్పటి నుంచి కొత్తగా ఇస్తామని చెబుతున్నది. దీంతో వరుసగా మూడు నెలలు పింఛన్ పొందలేక పోయిన వారు రూ.6,750 కోల్పోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఈ విషయాన్ని జిల్లా ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ మొత్తాన్ని ఇప్పించాలని పింఛన్‌దారులు కోరుతున్నారు.