రాజకీయాలు సరదా కాదు.. బాధ్యత

ABN , First Publish Date - 2020-11-19T05:32:54+05:30 IST

తనకు రాజకీయాలు సరదా కాదని, బాధ్యతని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

రాజకీయాలు సరదా కాదు.. బాధ్యత
పవన్‌ కల్యాణ్‌కు వినతి పత్రం ఇస్తున్న రాజధాని జేఏసీ నాయకులు

ఇదే స్ఫూర్తితో అందరూ పని చేయాలి

సమస్యలపై చిత్తశుద్ధితో స్పందించేది జనసేనే 

క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో పవన్‌కల్యాణ్‌  

గుంటూరు(మెడికల్‌), నవంబరు 18: తనకు రాజకీయాలు సరదా కాదని, బాధ్యతని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన 32 నియోజక వర్గాల పార్టీ క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. తనలాగే  ప్రతి ఒక్కరూ ఇదే స్ఫూర్తితో పని చేయాలన్నారు. ఒక్క జనసైనికులు మాత్రమే ఎన్ని బెదిరింపులు, ఒత్తిళ్లు వచ్చినా ధైర్యంగా నిలబడి పోరాటాలు చేస్తున్నారని, అలాంటి వారిని క్రియాశీల సభ్యులుగా తీసుకోవాలని సూచించారు. అన్ని రాజకీయ పార్టీలు సార్వత్రిక ఎన్నికల తర్వాత కార్యకర్తలను పెద్దగా పట్టించుకోవని జనసేన మాత్రం అలా ఎప్పటికీ చేయదన్నారు.  వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తామని తెలిపారు. రాష్ట్ర విభజనతో ఏపీకి అన్యాయం జరగబోతుందని దూరదృష్టితో తాను ఆనాడే చెప్పానన్నారు. 2014లో తాను ప్రశ్నించేందుకు పార్టీ పెట్టానని, ఇతర రాజకీయ పార్టీల మాదిరిగా అధికారం అనుభవించడం కోసం పెట్టలేదన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా, సమస్య ఉన్నా చిత్తశుద్ధితో స్పందించేది జనసేన పార్టీయేనని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో అధికారం అందుకోవాలంటే క్రియాశీల సభ్యుడు కనీసం 50 మందిని ప్రభావితం చేసేలా ఉండాలని సూచించారు. పార్టీకి ఉన్న జన బలాన్ని ఓట్లుగా మలుచుకోవడంలో గత ఎన్నికల్లో విఫలమయ్యామని, మరలా అలాంటి తప్పులు జరగకుండా పార్టీని క్షేత్రస్థాయి నుంచే బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. కొందరు పార్టీలోనే ఉంటూ సోషల్‌ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్నారన్నారు. అది అనైతికమని, ఇష్టం లేని వారు పార్టీని విడిచి పెట్టి వెళ్ళిపోవాలన్నారు. వంద మంది పార్టీ నుంచి వెళ్లిపోతే బలహీనపడే వ్యక్తి పవన్‌ కల్యాణ్‌ కాదన్నారు. వంద మంది పోతే వెయ్యి మందిని తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ప్రసంగించారు. అనంతరం రాజధాని రైతులతో పవన్‌ సమావేశం నిర్వహించారు. 

Updated Date - 2020-11-19T05:32:54+05:30 IST