-
-
Home » Andhra Pradesh » Guntur » panja
-
రెండో సారి.. పంజా
ABN , First Publish Date - 2020-11-22T04:51:45+05:30 IST
కొన్ని రోజులుగా జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు అతి తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. అంతా కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా సాధారణ జన జీవనానికి అలవాటు పడిపోతున్నారు. కానీ అక్కడ క్కడా రెండోసారి, మూడోసారి కూడా వైరస్ సోకిన కేసులు వెలుగు చూస్తున్నాయి.
ఒకే వ్యక్తికి రెండు మూడు సార్లు కరోనా పాజిటివ్
అలా వచ్చిన వారిలో వ్యాధి లక్షణాలు తీవ్రం
గుర్తించిన గుంటూరు ప్రభుత్వ వైద్యులు
యాంటీ బాడీస్ కేవలం 2 శాతం మందిలోనే..
ప్రస్తుతానికి పాజిటివ్ కేసులు తక్కువే..
మరో రెండు నెలలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక
కరోనా ఒకసారి సోకితే శరీరంలో యాంటీబాడీలు తయారవుతాయి.. అవి మరోసారి కరోనా బారిన పడకుండా, పడినా లక్షణాలు ఉధృతంగా లేకుండా ఉంటాయి.. అని ఇప్పటివరకు అంతా భావిస్తున్నారు. కానీ అటువంటి పరిస్థితి లేదంటున్నారు గుంటూరు ప్రభుత్వాస్పత్రి వైద్యులు...! జిల్లాలో కరోనా రెండోసారి సోకినవారికి లక్షణాలు తీవ్రంగా ఉండడాన్ని కరోనా చికిత్సను అందిస్తున్న వైద్యులు గుర్తించారు. ఇలా రెండోసారి, మూడో సారి కరోనా బారిన పడుతున్నవారిలో వైద్య, మున్సిపల్ సిబ్బంది ఉండటాన్ని గమనించారు. ప్రస్తుతానికి జిల్లాలో కరోనా తీవ్రత చాలా తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ మరో రెండు నెలలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
గుంటూరు(సంగడిగుంట), నవంబరు 21: కొన్ని రోజులుగా జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు అతి తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. అంతా కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా సాధారణ జన జీవనానికి అలవాటు పడిపోతున్నారు. కానీ అక్కడ క్కడా రెండోసారి, మూడోసారి కూడా వైరస్ సోకిన కేసులు వెలుగు చూస్తున్నాయి. అటువంటివి కనీసం రెండునుంచి ఐదు శాతం వరకు ఉన్నాయి. ఒకే నెలలో రెండుసార్లు కరోనా బారినపడిన కొంత మందిని జీజీహెచ్ వైద్యులు పరిశీలించారు. వారి అభిప్రాయం ప్రకారం మొదటిసారి కరోనా వచ్చి నెలరోజుల వ్యవధిలోనే రెండోసారి వచ్చిన వారికి కరోనా లక్షణాలు తీవ్రంగా ఉంటున్నాయి. మొదటి సారి కరోనా వచ్చిన వారిలో వ్యాధినిరోధక శక్తి కొంత తగ్గుతుంది. మరలా వ్యాధినిరోధక శక్తి పూర్వస్థితికి రావడానికి కనీసం 3-6 నెలల సమయం తీసుకుంటుంది. కానీ మూడునెలల లోపే మరోసారి కరోనాకు గురవుతున్నారు. ఇలాంటి వారు మాత్రం దగ్గు, జ్వరంతో పాటు రోజుల వ్యవధిలోనే తీవ్ర ఆయాసానికి గురవడాన్ని వైద్యులు గుర్తించారు. ఇలా రెండోసారి, మూడోసారి కరోనాబారిన పడుతున్నవారిలో వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది ఉండటాన్ని ప్రస్తుతానికి గుర్తించారు.
పొంచి ఉన్న పెను ముప్పు
కరోనా సెకండ్‌వేవ్, థర్డ్ వేవ్ వంటివి ఇంకా మన జిల్లాను తాక లేదు. కానీ ఢిల్లీ, అహ్మదాబాద్ వంటి ఉత్తర భారతదేశ నగరా లతో పాటు మూడు రోజులుగా హైదరాబాద్‌లో కూడా కేసుల తీవ్రత పెరిగింది. కరోనా వైరస్ విజృంభించడానికి మరో రెండు నెలలు అను కూల వాతావరణం ఉంటుం ది. ఇలాంటి పరిస్థితుల్లో సెకండ్‌వేవ్ జిల్లాకు వస్తే దానికి ఇప్పటికే కరోనాకు గురైనవారు గురైతే తీవ్ర లక్షణాలు ఉంటాయ ని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతానికి జిల్లాలో కరోనా తీవ్రత చాలా తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ మరో రెండు నెలలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
యాంటీబాడీలు ఎంతవరకు..?
శరీరంలో ఒకసారి కరోనా ప్రవేశించినపుడు యాంటీబాడీలు తయారై అవి కొన్ని నెలలపాటు మనల్ని మళ్లీ కరోనా బారిన పడకుండా చూస్తాయని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. కానీ మన రాష్ట్రంలో ఆ పరిస్థితి కనపడటం లేదు. వందమందికి కరోనా సోకితే కేవలం ఇద్దరిలో మాత్రమే యాంటీ బాడీలు గుర్తించగలిగారు. కరోనా శరీరంలో కనీసం 20 రోజులుపైగా ఉన్నవారిలో మాత్రమే అంటే వ్యాధి లక్షణాలు తీవ్రమై ఊపిరి అందకుండా, లేదా ఆక్సిజన్ పెట్టవలసిన పరిస్థితి వచ్చినవారికి మాత్ర మే శరీరంలో యాంటీబాడీలు తయారైనట్లు గుర్తించారు. లక్షణాలు తెలియకుండా కరోనా వచ్చి వెళ్లినవారు, కొద్దిపాటి లక్షణా లతో కరోనాను నుంచి బయటపడినవారిలోనూ ఈ యాంటీబాడీలు గుర్తిం చడం లేదు. అందు వలన ఒకసారి కరోనా వచ్చిన వారికి కొన్ని నెలల పాటు కరోనా రాదనే భ్రమల్లో ఉండవద్దని జీజీహెచ్ వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు 40 ఏళ్లు పైబడినవారిలో మొదటిసారి వ్యాధి తీవ్రత ఎక్కువ లేకపోయినా, రెండోసారి మా త్రం దగ్గు, ఆయాసానికి గురవుతున్నట్లు వైద్యులు గుర్తించారు. అందువలన కరోనా తీవ్రత తగ్గలేదని, మన జిల్లాలో ఎక్కువమంది తెలియకుండానే కరోనా బారిన పడి కోలుకున్నట్లు వైద్యులు కూడా ఒక అంచ నాకు వచ్చారు. అయితే ఇలాంటి వారికి రెండోసారి వస్తే మాత్రం లక్షణాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
జిల్లాలో అదుపులోనే కరోనా..
సెకండ్ వేవ్ ఎలా ఉన్నా ప్రస్తుతానికి మన జిల్లా లో కరోనా అదుపులో ఉందనే చెప్పాలి. జ్వరాల ఆసు పత్రి, గుంటూరు ప్రభుత్వాసుపత్రికి కొన్ని రోజులుగా కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్నవారెవరూ వచ్చినట్లు వైద్యులు గుర్తించలేదు. దీంతో బెడ్లు ఖాళీగానే ఉన్నాయి. రెండు నెలల క్రితం వరకు అనేక ప్రైవేటు ఆసుపత్రులలో బెడ్ల కోసం ఎదురు చూసిన పరిస్థితి ఉంది. శనివారం గుంటూరులోని అన్ని కరోనా చికిత్స అందిస్తున్న ఆసుపత్రుల్లోనూ పదిశాతం కూడా కరోనా బాధితులు లేకపోవడం సంతోషించదగ్గ విషయం. కరోనా చికిత్సకు మొదట్లో లక్షల్లో వసూలు చేసిన ఆసుపత్రులు ఫీజులు కూడా గణనీయంగానే తగ్గించాయి. ఆరోగ్యశ్రీ ద్వారా కూడా అన్ని ఆసు పత్రులు కరోనా చికిత్సను చేస్తున్నాయి. అయితే ప్రభుత్వ పరీక్షా కేంద్రంలో పరీక్ష చేయించుకుని కరోనా నిర్ధారణ అయిన వారికే ఆరోగ్యశ్రీ సౌకర్యం అందిస్తున్నారు.
2.29 శాతానికి తగ్గిన పాజిటివ్ కేసులు
గుంటూరు, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ రేటు తగ్గుతోంది. శనివారం ఉదయం వరకు అందిన ల్యాబ్‌ల ఫలితాల్లో కేవలం 2.29 శాతం మందికే పాజిటివ్ వచ్చింది. మొత్తం 5,290 శాంపిల్స్ ఫలితాలు రాగా వాటిల్లో 121 మందికి పాజిటివ్, 5,169 మందికి(97.71 శాతం) నెగెటివ్ వచ్చింది. దీంతో జిల్లాలో ఇప్పటివరకు వైరస్ బారిన పడిన వారి సంఖ్య 73,516 కాగా వారిలో 71,629(97.43 శాతం) మంది కోలుకొన్నారు. 706(0.96 శాతం) మంది చనిపోయారు. శనివారం కొత్తగా 7,652 మంది శాంపిల్స్‌ని పరీక్షించేందుకు సేకరించారు. గుంటూరు నగరంలో 38, మంగళగిరిలో 13, కొల్లూరులో 7, బాపట్లలో 6, పెదకూరపాడులో ఐదుగురికి వైరస్ సోకింది. మిగిలిన మండలాల్లో మరో 57 మందికి వైరస్ సోకినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె.యాస్మిన్ తెలిపారు.