పల్నాడు.. పట్టాలెక్కేదెప్పుడో

ABN , First Publish Date - 2020-10-30T18:24:39+05:30 IST

కరోనా జనతా కర్ఫ్యూ ముందు రోజు వరకు నిత్యం గుంటూరు మీదగా సికింద్రాబాద్‌కు రాకపోకలు సాగిస్తూ ప్రయాణికులు ఆదరాభిమా నాలు పొందిన పల్నాడు, జన్మభూమి, ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లు ఎప్పుడు తిరిగి పట్టాలెక్కుతాయో తెలియని పరిస్థితి నెలకొన్నది. వాటితో పాటు రద్దు అయిన రైళ్లలో కొన్నింటిని ఇప్పటికే ప్రత్యేక, పండుగ స్పెషల్‌ ట్రైన్స్‌ పేరుతో పట్టాల మీదకు తీసుకొచ్చిన రైల్వేబోర్డు ఈ మూడింటి విషయంలో తటపటాయిస్తోన్నది.

పల్నాడు.. పట్టాలెక్కేదెప్పుడో

జన్మభూమి, ఇంటర్‌సిటీలపైనా తటపటాయింపు

ప్రయాణికుల ఆదరణ పొందిన ఎక్స్‌ప్రెస్‌లపై రైల్వే నిర్లక్ష్యం

ఆర్టీసీతో పాటు సరైన రైళ్ళు లేక ప్రజల ఇబ్బందులు

మూడు ఎక్స్‌ప్రెస్‌లను పునరుద్ధరించాలని ప్రయాణికుల డిమాండ్‌


గుంటూరు (ఆంధ్రజ్యోతి): కరోనా జనతా కర్ఫ్యూ ముందు రోజు వరకు నిత్యం గుంటూరు మీదగా సికింద్రాబాద్‌కు రాకపోకలు సాగిస్తూ ప్రయాణికులు ఆదరాభిమా నాలు పొందిన పల్నాడు, జన్మభూమి, ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లు ఎప్పుడు తిరిగి పట్టాలెక్కుతాయో తెలియని పరిస్థితి నెలకొన్నది. వాటితో పాటు రద్దు అయిన రైళ్లలో కొన్నింటిని ఇప్పటికే ప్రత్యేక, పండుగ స్పెషల్‌ ట్రైన్స్‌ పేరుతో పట్టాల మీదకు తీసుకొచ్చిన రైల్వేబోర్డు ఈ మూడింటి విషయంలో తటపటాయిస్తోన్నది. ఒకపక్క ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సులు లేక మరోవైపు అరకొరగా రైలు సర్వీసులతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రజల రాకపోకలు గణనీయంగా తగ్గిపోయాయి. కార్లు, ప్రైవేటు బస్సుల్లో ప్రయాణం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఈ ఏడాది దసరా పండుగ సెలవులకు కూడా ఏటా వచ్చే వారిలో కనీసం 20 శాతం మంది కూడా జిల్లాకు రాలేకపోయారు. అదే రైళ్లు ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. 


పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ నిత్యం ఉదయం గుంటూరు నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లేది. అలానే అటువైపు నుంచి మధ్యాహ్నం బయలుదేరి రాత్రికి ఇక్కడికి చేరుకునేది. అలానే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ వల్ల ఇటు సికింద్రాబాద్‌కు, అటు విశాఖపట్టణంకు ప్రజలు రాకపోకలు సాగించేందుకు సౌకర్యవంతంగా ఉండేది. ఈ రైలు మధ్యాహ్నం వేళ గుంటూరుకు వచ్చేది. అలానే అమరావతి రాజధాని కారణంగా పట్టాల మీదకు తీసుకొచ్చిన ఇంటర్‌సిటీ(ఉద్యోగుల సౌకర్యార్థం) ఎక్స్‌ప్రెస్‌ అనతికాలంలో ప్రయాణికుల ఆదరాభిమానాలు పొందింది. ఇందుకు కారణం ఈ రైలు గుంటూరు - సికింద్రాబాద్‌ మధ్యన నాన్‌స్టాప్‌ కావడమే. ఈ మూడు రైళ్ల వల్ల ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సికింద్రాబాద్‌కు వెళ్లడానికి అవకాశం ఉండేది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టే క్రమంలో సరిగ్గా జనతా కర్ఫ్యూ రోజున వీటిని నిలుపుదల చేశారు. లాక్‌డౌన్‌ తర్వాత సెకండ్‌ సిట్టింగ్‌, ఏసీ బోగీలతో గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ని ప్రత్యేక రైలుగా పునరుద్ధరించినప్పటికీ ఆ రైలుకు ఆదరణ లభించడం లేదు. దీనికి కారణం అది ఉదయం బయలుదేరి సికింద్రాబాద్‌కు చేరుకోవాలంటే మధ్యాహ్నం అవుతుంది. అదే పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ అయితే ఉదయం 10.35 గంటలకే సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. అలానే మధ్యాహ్నం జన్మభూమి, సాయంత్రం ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌లు అందుబాటులో ఉండటం వల్ల ఎంతో సౌకర్యవంతంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు ఆ మూడు రైళ్లు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధ్యమైనంత త్వరగా వాటిల్లో కనీసం పల్నాడు, ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లని అయినా పునరుద్ధరించాలని ప్రయాణికులు డిమాండ్‌ చేస్తున్నారు. 

Updated Date - 2020-10-30T18:24:39+05:30 IST