అయ్యో పాపం ప్రజాస్వామ్యం చచ్చిపోయింది...!

ABN , First Publish Date - 2020-03-15T10:01:45+05:30 IST

పల్నాడులో ప్రజా స్వామ్యం చచ్చిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికలవేళ ఈ ఘోరం

అయ్యో పాపం ప్రజాస్వామ్యం చచ్చిపోయింది...!

 బలవంతంగా ఎంపీటీసీల నామినేషన్లు విత్‌డ్రా

 పల్నాట అన్ని మండలాల్లో  ఏకగ్రీవమే..

 అభ్యర్థులను ఇళ్లకు వెళ్లి బెదిరించిన ఖాకీలు, నేతలు 

గుంటూరు, మార్చి 14: పల్నాడులో ప్రజా స్వామ్యం చచ్చిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికలవేళ ఈ ఘోరం చోటుచేసుకుంది. పేరుకు ఎన్నికలు జరుగుతున్నప్పటికీ పోటీ చేసే అభ్యర్థులకు కనీస రక్షణ కరువుకావ టంతో దురాగతం చోటు చేసుకుంది. పార్టీల సాక్షిగా, అధికార పార్టీనేతల సాక్షిగా చోటు చేసుకున్న బెదిరింపు పర్వాలు ఓట్ల పండు గను చంపేశాయి.


గురజాల నియోజకవర్గం లోని నాలుగుమండలాలకుగాను మూడు మండలాలు అసలు ఎన్నికలు జరుగకుండా వైసీపీ ఖాతాలో జమయ్యాయంటే బెదిరింపు లు ఏ స్థాయికి వెళ్లాయో చెప్పనవసరం లేదు. ఈ బెదిరింపుల అడ్డాలో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు చివరిదాకా పోరాడినా అర్ధరాత్రు ల్లో.. పోలీసుస్టేషన్లో జరిగిన పరిణామాలతో చేతుల్తేశారు. ఫలితంగా నామినేషన్ల ఉపసం హరణకు శనివారం ప్రతిపక్ష పార్టీల అభ్యర్థు లు మండల పరిషత్‌ కార్యాలయాల వద్ద క్యూ కట్టాల్సివచ్చింది.


వాస్తవానికి స్థానిక సంస్థల పోలింగ్‌ ప్రక్రియ ఆరంభమైన తర్వాత గురజాల నియోజకవర్గంలో అన్ని పార్టీల అభ్యర్థులు పోటీలో నిలిచేందుకు ఆసక్తిగా ముందుకు వచ్చారు. ప్రతిపక్షం కొన్నిచోట్ల వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడటంతో నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నారు.

మాచర్ల నియోజకవర్గంలో అన్ని మండలా లు వైసీపీకీ ఏకగ్రీవమయ్యాయనే వాస్తవం కన్నా... ఇక్కడ కూడా ప్రతిపక్షపార్టీల అభ్యర్థులపై ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. అభ్యర్థులను దారిలో తెచ్చుకొనేందుకు అనేక మార్గాలను అన్వేషించారు. కొందర్ని అధికార పార్టీ నేతలే ఇళ్లకు గుంపులుగా వెళ్లి బెదిరిస్తూ వచ్చారు. మరికొందర్ని పోలీసులతో బెదిరించినట్లు తెలుస్తోంది.


పిడుగురాళ్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన ప్రతిపక్ష పార్టీ నేతలను పిలిపించి మరీ అధికారులు బెదిరించినట్లు తెలుస్తోంది. కొన్ని గ్రామాలకు ఎస్‌ఐ స్థాయి అధికారి వెళ్లి అభ్యర్థులను బెదిరించి, నామినేషన్‌ విత్‌డ్రాకు ప్రేరేపించి నట్లు ఆరోపణలున్నాయి. తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న గురజాలలోనూ మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావటం గమనార్హం! దాచేపల్లి మండలంలో 12 ఎంపీ టీసీ స్థానాలకు గాను 11 స్థానాలు వైసీపీ ఏకగ్రీవం చేసింది. పిడుగురాళ్ల మండలంలో మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవంగా వైసీపీ ఖాతాలోకే వెళ్లాయి. ఒక్క మాచవరం మండంలో మాత్రమే మొత్తం 15ఎంపీటీసీ స్థానాలుండగా 8 స్థానాలు వైసీపీ ఏకగ్రీవం చేసుకోగా, మిగిలిన స్థానాలకు పోటీ జరిగే అవకాశం ఉంది.

ఇదే మొదటిసారి

దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు పాలనలో మండలాల వ్యవస్థ వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలా పట్టాలెక్కిన మండలాలు ఏకగ్రీవం కావటం ఇదే మొదటిసారి. గతంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ స్వేచ్ఛగా ఎన్నికలు జరిగినందున పోటీ తీవ్రస్థాయిలో ఉండేది. అధికార పార్టీకి వ్యతిరేకంగానూ ఫలితాలు రావటం వలన మండలాలు ప్రతిపక్ష పార్టీల చేతుల్లో ఉండేవి. అయితే ప్రస్తుతం పల్నా డులో ఆ పరిస్థితి వేరు. యంత్రాంగ మంతా అధికార పార్టీకి అండగా నిలవటంతో అసలు ఎన్నిక ప్రక్రియ అపహస్యంగా మారింది.

బొతిగ్గా అధికారాలు లేని ఎంపీటీసీ స్థానాలను దక్కించుకొనేందుకు అధికారపార్టీ ఎంతగానో అక్రమాలకు పాల్పడుతుంటే 17న మొదలుకానున్న సర్పంచ్‌ ఎన్నికల వ్యవహ రం ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. సాధారణంగా సర్పంచ్‌ అంటే గ్రామస్థాయిలో అన్ని విషయాలను ప్రభావితం చేసే సామర్థ్యం ఉంటుంది.


ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతల కళ్లు కొత్త స్థానాల మీద కూడాపడ్డాయి. అసలే పోటీ లేకుండా ఏకగ్రీవం చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. పోటీలో నిలబడతారనే వారికి బలంగా బెదిరింపులకు పోవటంతో చాలామంది ఊరు వదిలిపెట్టిపోయారు. దాచేపల్లి మండలంలో ఓ గ్రామానికి చెందిన యువనేత ఊరు వదిలివెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది. పరిస్థితి ఇదేవిధంగా కొనసాగితే సర్పంచ్‌ ఎన్నిక కూడా తూతూమంత్రమే అవుతుంది.


Updated Date - 2020-03-15T10:01:45+05:30 IST