ప్రభుత్వాస్పత్రిలో ఇక అత్యవసర కేసులే...

ABN , First Publish Date - 2020-03-24T09:29:28+05:30 IST

వేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని అడ్డుకొనేందుకు గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో సాధారణ ఓపీ సేవలను తాత్కాలికంగా...

ప్రభుత్వాస్పత్రిలో ఇక అత్యవసర కేసులే...

  • సాధారణ ఓపీలు ‘షట్‌ డౌన్‌’
  • వైద్యులు, నర్సులకు సెలవులు రద్దు
  • సూపరింటెండెంట్‌ బాబులాల్‌ ప్రకటన


గుంటూరు (మెడికల్‌), మార్చి 23: వేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని అడ్డుకొనేందుకు గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో సాధారణ ఓపీ సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. అత్యవసర కేసులు మాత్రమే ప్రభుత్వాస్పత్రికి రావాలని, కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎస్‌ బాబులాల్‌ ప్రకటించారు. సోమవారం తన ఛాంబర్‌లో ఆయన వివిధ వైద్య విభాగాధిపతులతో  అత్యవసర సమావేశం నిర్వహించారు. కోవిడ్‌-19 కట్టడి చర్యలపై సమీక్షించారు. ఆయా విభాగాధిపతుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. కరోనా పాజిటివ్‌ రోగి సాధారణ ఓపీకి వస్తే అతడి నుంచి అనారోగ్యవంతులైన ఇతర రోగులకు కరోనా వైరస్‌ సులువుగా వ్యాపించే అవకాశం ఉందని, ఈ కారణంగా సాధారణ ఓపీ సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలని పలువురు ప్రొఫెసర్లు సూచించారు.


ఈ సూచనతో డాక్టర్‌ బాబులాల్‌ ఏకీభవించారు. కరోనా వైరస్‌ అనుమానితులు జీజీహెచ్‌కు వస్తే వారికి సత్వరం తగిన చికిత్సలు అందించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు ఆయన ప్రకటించారు. మందులు, వెంటిలేటర్లు, ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నట్లు చెప్పారు. అనుమానిత రోగుల కోసం ఐసోలేషన్‌ వార్డులను కూడా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్‌ ఉధృతంగా మారే అవకాశం ఉండటంతో వైద్య సిబ్బంది సెలవులు రద్దు చేస్తున్నట్లు సూపరింటెండెంట్‌ ప్రకటించారు. ప్రజలు ఈ విషయం గమనించి సాధారణ, స్వల్ప అనారోగ్యాలకు గుంటూరు ప్రభుత్వాస్పత్రికి రావద్దని కోరారు. ఈ కార్యక్రమంలో గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర గుంటుపల్లి సుబ్బారావు, ఆర్‌ఎంవో డాక్టర్‌ సతీష్‌కుమార్‌, హెచ్‌వోడీలు పాల్గొన్నారు. 


అదే బాటలో ప్రైవేటు వైద్యశాలలు

కోవిడ్‌-19ను కట్టడి చేసే క్రమంలో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి మార్చి 31వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ప్రైవేటు వైద్యశాలల్లో సాధారణ ఔట్‌ పేషెంట్‌ (ఓపీ) విభాగాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఓపీల్లో అనారోగ్యంతో వచ్చే వారిలో కరోనా అనుమానితులు ఉంటే వ్యాధి మరింత ప్రబలే అవకాశం ఉన్న దృష్ట్యా ఐఎంఏ జాతీయ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.


ప్రైవేటు వైద్యశాలల ఓపీలు కరోనా రిజర్వాయర్లుగా మారే ప్రమాదం పొంచి ఉండటంతో తాత్కాలికంగా వీటిని షట్‌డౌన్‌ చేయడమే మార్గంగా వైద్య సంఘం భావించింది. మార్చి 31 వరకు జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యసేవలకు మాత్రమే చికిత్సలు లభిస్తాయని, ప్రజలు ఈ విషయం గమనించి స్వల్ప అనారోగ్యాలకు ప్రైవేటు వైద్యశాలలకు రావద్దని ఐఎంఏ గుంటూరు అధ్యక్షుడు డాక్టర్‌ గార్లపాటి నందకిశోర్‌ తెలిపారు. ఆస్పత్రుల్లో అత్యవసర శస్త్రచికిత్సలు మాత్రమే అందిస్తామన్నారు. దేశవ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ నెల 31 వరకు ఓపీలు బంద్‌ చేయాలని ఐఎంఏ జాతీయ శాఖ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.

Read more