నెట్టింట్లోనే.. పిల్లలు

ABN , First Publish Date - 2020-03-24T10:12:41+05:30 IST

కోవిడ్‌-19 కారణంగా పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇవ్వడంతో ఎక్కువ మంది పిల్లలు ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌లో...

నెట్టింట్లోనే.. పిల్లలు

  • చదువుకు  రెండు గంటలే
  • కళాశాలల యాజమాన్యాల వాకబు
  • ఆన్‌లైన్‌లో జేఈఈ మాక్‌ టెస్టులు


గుంటూరు, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): కోవిడ్‌-19 కారణంగా పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇవ్వడంతో ఎక్కువ మంది పిల్లలు ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌లో సమయం గడుపుతోన్నారు. ఉదయం అల్పాహారం పూర్తి కాగానే స్మార్ట్‌ఫోన్‌/ల్యాప్‌టాప్‌/డెస్కుటాప్‌ల్లో ఏదో ఒకటి తెరిచి ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌ ప్రారంభిస్తోన్నారు. పిల్లలు గాడి తప్పకుండా ఉండేందుకు నిత్యం స్కూళ్లు, కళాశాలల ఉపాధ్యాయులు/అధ్యాపకులు ఫోన్లు చేసి తల్లిదండ్రులను వాకబు చేస్తోన్నారు. తాము స్కూల్‌ యాప్‌ ద్వారా హోం వర్కు పంపించామని, అవి కచ్ఛితంగా ఏ రోజుకు ఆ రోజు పూర్తి చేసేలా చూడాలని స్పష్టం చేస్తోన్నారు.


ఇంటర్మీడియట్‌ పరీక్షలు రాసి ఎంసెట్‌కు ప్రిపరేషన్‌ అవుతోన్న విద్యార్థులకు కళాశాలల ఆన్‌లైన్‌ మాక్‌ జేఈఈ మెయిన్స్‌ పరీక్షని నిర్వహిస్తోన్నారు. నిత్యం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్యన ఈ మాక్‌ పరీక్షకు విద్యార్థులు హాజరయ్యేలా చూడాలని కోరుతోన్నాయి. ఇందుకు కారణం మధ్యాహ్నం వేళ విశ్రాంతి తీసుకోకుండా చదువుపై దృష్టి పెడతారని ఆయా కళాశాలల యాజమాన్యల భావన. ఈ విధంగా ఏడాది అంతా కష్టపడి నేర్చుకొన్న చదువు విద్యా సంవత్సరం చివరలో వృథా కానీయకుండా చేసేందుకు ఈ విధానాన్ని అవలంభిస్తోన్నారు.  ఇదిలావుంటే పిల్లలు మాత్రం ఒక విధంగా సెలవుదినాలు వలే భావిస్తోన్నారు. రోజులో గంట నుంచి రెండు గంటలు మాత్రమే చదువుకు కేటాయిస్తోన్నారు. మిగతా సమయం అంతా ఇంటర్నెట్‌లో బ్రౌజింగ్‌ చేస్తోన్నారు. నెట్‌ఫ్లిక్స్‌, యూట్యూబ్‌, ఆన్‌లైన్‌లో చదరంగం, కార్డ్స్‌, అడ్వెంచర్‌ గేమ్స్‌ వంటివి ఆడుకొంటూ కాలక్షేపం చేస్తోన్నారు. అలానే టీవీ ఛానెళ్లకు అతుక్కుపోతోన్నారు. దీంతో వారిని తల్లిదండ్రులు వారిస్తోన్నారు. అయితే టీవీ చూడనీయకపోతే తాము బయటికి వెళ్లి ఆడుకొంటామని మారం చేస్తోన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటి బయటకు వెళితే కరోన వైరస్‌ వ్యాప్తి రిస్కు అవకాశం ఉండటంతో మీరు ఎక్కడికి వెళ్లద్దులే ఇంట్లోనే ఉండి టీవీ చూసుకోమని పెద్దవాళ్లు చెప్పక తప్పని పరిస్థితి. 


పదో తరగతి విద్యార్థుల టెన్షన్‌... టెన్షన్‌

ఇప్పటికే ఒక దఫా పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నెల 31వ తేదీన జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. పరీక్షలు వాయిదా వేయబోమని సీఎం జగన్‌ కూడా చెప్పారు. అందుకు అనుగుణంగానే ప్రశ్నాపత్రాల తరలింపులో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశాలు వెలువడ్డాయి. అయితే 31వ తేదీకి ప్రస్తుత పరిస్థితి మరింత దిగజారితే పరీక్షలు నిర్వహిస్తారా, లేదానన్న అనుమానాలు కలుగుతోన్నాయి. పదో తరగతి పరీక్షకు వేల మంది విద్యార్థులు హాజరౌతారు. వారి వెంట తల్లిదండ్రులు కూడా వెళుతుంటారు. ఆ పరిస్థితుల్లో రిస్కు ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పరీక్షలు జరుగుతాయా... మళ్లీ వాయిదా పడతాయానన్న సందేహాలు వ్యక్తం అవుతోండటంతో విద్యార్థులు టెన్షన్‌కి గురౌతోన్నారు.

Updated Date - 2020-03-24T10:12:41+05:30 IST