ప్రారంభంతోనే సరి
ABN , First Publish Date - 2020-09-03T06:26:41+05:30 IST
పల్నాడు ప్రాంతంలో రోజురోజుకు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నరసరావుపేటలో లింగంగుంట్లలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్ చికిత్సా

వినియోగంలోకి రాని కొవిడ్ ఆస్పత్రి
బాధితులకు అందుబాటులోకి రాని వైద్యం
నరసరావుపేట వైద్యశాలలో పనులు పూర్తి చేయడంలో జాప్యం
నరసరావుపేట, సెప్టెంబరు 2: పల్నాడు ప్రాంతంలో రోజురోజుకు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నరసరావుపేటలో లింగంగుంట్లలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్ చికిత్సా విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ ఆస్పత్రిని గత నెల 17న జిల్లా ఇన్‌చార్జి మంత్రి చెరుకువాడ రంగనాఽథరాజు, ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రారంభించారు.
ఇక్కడ ఆస్పత్రిలో 200 పడకలు ఏర్పాటు చేస్తున్నట్లు, ఆక్సిజన్ వసతి కలిగిన 150 బెడ్లు, వెంటిలేటర్లు అందుబాటులో ఉంటాయని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రకటించారు. అయితే వైద్యశాల ప్రారంభించి సుమారు 15 రోజులు అవుతున్నా వినియోగంలోకి రాలేదు. కొవిడ్ విభాగానికి సంబంధించిన పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఆ పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి.
చికిత్స కోసం సామాన్యుల అవస్థలు
ప్రభుత్వ కొవిడ్ ఆస్పత్రులలో బెడ్‌లు లభించక పేదలు, మధ్య తరగతి వర్గాలు ఇక్కట్లు పడుతున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రులలో చికిత్స పొందేందుకు ఆర్థిక స్తోమత లేక ఇటు ప్రభుత్వ వైద్యశాలల్లో బెడ్లు దొరక్క పలువురు అల్లాడుతున్నారు. దీంతో సకాలంలో వైద్యం అందక వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఈ పరిస్థితుల్లో నరసరావుపేటలో ప్రారంభించిన ఆస్పత్రిలో పనులను సత్వరం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా ఉన్నతాధికారుల చర్యలు కానరావడంలేదు. పనులను వేగవంతం చేసి ఆస్పత్రిని బాధితులకు అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.
మారిన శిలాఫలకం
ఆస్పత్రి ప్రారంభోత్సవంలో ప్రొటోకాల్ వివాదం తెరపైకి వచ్చింది. మంత్రి రంగనాథరాజు ఆవిష్కరించిన శిలాఫలకంపై రాజ్యసభ సభ్యుడు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి పేరు మినహా ప్రొటోకాల్ ప్రకారం అందరి పేర్లు ఉన్నాయి. దీనిపై నెలకొన్న వివాదం ఆలస్యంగా వెలుగు చూచింది. దీంతో ప్రాంభోత్సవ శిలాఫలకాన్ని అధికారులు మార్చేశారు. కొత్తగా రూపొందించిన శిలాఫలకంపై ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి పేరును చేర్చారు.
పది రోజుల్లో పూర్తి : డీఈ మురళీకృష్ణ
పది రోజులలో వైద్యశాలలోని పెండింగ్ పనులు పూర్తి అవుతాయని వైద్య ఆరోగ్య శాఖ డీఈ బీ మురళీకృష్ణ తెలిపారు. నిర్మాణ పనులు పూర్తయ్యాయని, ఆక్సిజన్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయన్నారు. ఎమ్యెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన పిలుపుతో దాతలు కొవిడ్ వైద్యశాలలోని అత్యవసర విభాగంలో మల్టీ పారా మానిటర్ల ఏర్పాటు కోసం విరాళాలను అందించారన్నారు.