ఎన్నారై ఆస్పత్రిలో పేలిన గ్యాస్ కంప్రెషర్
ABN , First Publish Date - 2020-11-14T04:32:45+05:30 IST
మండలంలోని చినకాకాని ఎన్నారై ఆసుపత్రిలో శుక్రవారం ప్రమాదవశాత్తూ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి.
టెక్నీషియన్ మృతి.. మరో ముగ్గురికి గాయాలు
ఇద్దరి పరిస్థితి విషమం
మంగళగిరి క్రైమ్, నవంబరు 13: మండలంలోని చినకాకాని ఎన్నారై ఆసుపత్రిలో శుక్రవారం ప్రమాదవశాత్తూ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మంగళగిరి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆసుపత్రిలోని గైనకాలజీ వార్డు వెనుక ఏసీ మరమ్మతులు చేస్తుండగా కంప్రెషర్ అకస్మాత్తుగా పేలిపోయింది. ఈ ఘటనలో మంగళగిరి ఇస్లాంపేటకు చెందిన సయ్యద్ అలీ (32) తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆలీకి సహాయకులుగా ఉన్న మల్లికార్జునరావు, ఎస్‌కే సుభానీలతో పాటు అదే సమయంలో వార్డులో పారిశుధ్య పనులు నిర్వహిస్తున్న గోవిందమ్మ అనే మహిళకు గ్యాస్ కంప్రెషర్ శకలాలు తగలడంతో గాయాలయ్యాయి. పేలుడు ధాటికి ఆసుపత్రి సెంట్రల్ హాలులో మంటలు వ్యాపించి ఫర్నీచర్ సైతం దగ్ధమైంది. సమాచారం అందుకున్న మంగళగిరి రూరల్ సీఐ పి.శేషగిరిరావు, ఎస్‌ఐ శ్రీనివాసరెడ్డి తమ సిబ్బందితో ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. పేలుడు సంభవించడానికి గల కారణాలపై విచారణ చేపట్టి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.