-
-
Home » Andhra Pradesh » Guntur » No corona cases
-
కరోనా కేసులు లేవు
ABN , First Publish Date - 2020-03-25T09:24:15+05:30 IST
జిల్లాలో ఇప్పటి వరకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాలేదని డీఎంహెచ్‌వో డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్ తెలిపారు.

నలుగురికి నెగిటివ్ ఫలితాలు
మరో 12 మంది నుంచి నమూనాల సేకరణ
పెరుగుతున్న కోవిడ్-19 అనుమానితల సంఖ్య
జిల్లాలో నాలుగు ప్రైవేటు క్వారంటైన్ కేంద్రాల ఎంపిక
హోంక్వారంటైన్ వ్యక్తులను ఈ కేంద్రాలకు తరలించే యోచన
గుంటూరు(మెడికల్), మార్చి 24: జిల్లాలో ఇప్పటి వరకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాలేదని డీఎంహెచ్‌వో డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్ తెలిపారు. దుష్ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ఓ ప్రకటనలో తెలిపారు. గుంటూరు ప్రభుత్వ జ్వరాల ఆసుపత్రిలో సోమవారం నలుగురి నమూనాలు సేకరించి వైరస్ నిర్ధారణకు ల్యాబ్‌కు పంపగా మంగళవారం విడుదలైన ఫలితాల్లో వారికి కోవిడ్-19 లేదనే నెగెటివ్ ఫలితాలు వచ్చాయి. మంగళవారం కరోనా అనుమానిత లక్షణాలతో గుంటూరు ప్రభుత్వాస్పత్రికి 35 మంది రాగా, వీరిలో ఏడుగురిని ఇన్‌పేషెంట్‌లుగా చేర్చుకున్నారు. మిగిలిన వారు హోం క్వారంటైన్‌లోనే ఉండాలని తెలిపారు.
గోరంట్లలోని ప్రభుత్వ జ్వరాల ఆసుపత్రికి కూడా పెద్ద సంఖ్యలో కరోనా అనుమానిత రోగుల వచ్చారు. ఐడీహెచ్‌లో పడకలు నిండిపోవడంతో అక్కడకు వచ్చిన రోగులను జీజీహెచ్‌కు పంపారు. మంగళవారం ఐడీహెచ్, జీజీహెచ్‌లో ఐసోలేషన్ వార్డుల్లో చికిత్సలు పొందుతున్న 12 మంది నుంచి నమూనాలు సేకరించి స్విమ్స్‌కు పరీక్షకు పంపారు. ఈ ఫలితాలు బుధవారం వెలువడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు జిల్లాలో కరోనా అనుమానిత లక్షణాలతో వచ్చిన 21 మంది రోగుల నుంచి నమూనాలు తీసి పంపగా, 9 మందిలో నెగెటివ్ ఫలితాలు వచ్చాయి. గుంటూరు ప్రభుత్వాస్పత్రి ఐసోలేషన్ వార్డులో సోమవారం చేరి చికిత్స పొందుతున్న గుంటూరు శ్రీనివాసరావుపేటకు చెందిన ఎం ఆదినారాయణ(64) మంగళవారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందాడు. ఇతడు చేరిన సమయంలో ఊపరితిత్తుల సమస్య ఉండటం, ఆయాసంగా ఉండటంతో కరోనా వైరస్ అనుమానితుడిగా భావించి నమూనా సేకరించి పరీక్షకు పంపారు. ఇంకా ఫలితం రావాల్సి ఉంది. ఈలోపు ఆదినారాయణ మృతి చెందాడు.
హోం క్వారంటైన్‌లో 2431 మంది....
విదేశాల నుంచి జిల్లాకు తిరిగొచ్చిన వారి సంఖ్య 2431కు చేరింది. వీరందరిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. అయితే కొంత మంది ఇళ్లల్లో ఒకటి, రెండు గదులు మాత్రమే ఉండటం, క్వారంటైన్‌లో ఉంచినా మిగిలిన కుటుంబ సభ్యులకు రిస్క్ ఉందని భావించిన కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ వీరిని ఐసోలేషన్ వార్డులకు తరలించాలని భావిస్తున్నారు. మంగళవారం జిల్లాలో ఐదు ప్రాంతాల్లో క్వారంటైన్ హోమ్స్‌ను ఎంపిక చేశారు.
బాపట్లలోని హెచ్‌ఆర్‌డీ భవనం, గుంటూరు శివార్లలోని రీజనల్ ట్రైనింగ్ సెంటర్ (ఫీమేల్) భవనం, తాడికొండ ఆర్‌హెచ్‌సీ భవనం, చినకాకానిలోని ఎన్నారై కాలేజీ హాస్టల్ , కోటప్పకొండలోని డీఆర్‌డీఏ భవనాలను ఎంపిక చేశారు. బుధవారం హోం క్వారంటైన్‌లో ఉన్న వారిని ఈ ఐదు కేంద్రాలకు తరలించే అవకాశం ఉన్నట్లు అదికార వర్గాలు తెలిపాయి. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ పరిధిలోని ప్రైవేటు ఆసుపత్రి వైద్యులకు, సిబ్బందికి ఆరోగ్య శాఖ కరోనా వైరస్ వ్యాధిపై అవగాహన కల్పించింది.