రూ.వెయ్యి సాయం.. వారికి లేనట్లే!

ABN , First Publish Date - 2020-04-08T16:06:13+05:30 IST

రేషన్‌ సరుకులను తెల్ల కార్డులు కలిగిన కుటుంబాలన్నింటికి పంపిణీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యి నగదు సాయం విషయానికి వచ్చేసరికి ప్లేటు ఫిరాయించింది. కేవలం బియ్యం కార్డులు కలిగిన కుటుంబాలకు మాత్రమే నగదుని జిల్లాకు పంపించింది.

రూ.వెయ్యి సాయం..  వారికి లేనట్లే!

బియ్యం కార్డు ఉన్న వారికే రూ.వెయ్యి నగదు

మిగిలిన లక్షా 66 వేల 333 కుటుంబాలకు అందని సాయం 


గుంటూరు (ఆంధ్రజ్యోతి): రేషన్‌ సరుకులను తెల్ల కార్డులు కలిగిన కుటుంబాలన్నింటికి పంపిణీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యి నగదు సాయం విషయానికి వచ్చేసరికి ప్లేటు ఫిరాయించింది. కేవలం బియ్యం కార్డులు కలిగిన కుటుంబాలకు మాత్రమే నగదుని జిల్లాకు పంపించింది. దీంతో జిల్లాలో లక్షా 66 వేల 333 కుటుంబాలకు ఈ నగదు అందే పరిస్థితి లేదు. ఈ విషయం ఆలస్యంగా బయటకు రావడంతో తెల్లరంగు రేషన్‌కార్డు కలిగిన కుటుంబాలు ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోన్నాయి. బియ్యం కార్డు మంజూరుకు సంబంధించి తమ క్లెయిమ్‌లను న్యాయబద్ధంగా పరిష్కరించకుండా ఏకపక్షంగా అనర్హుల జాబితాలో పెట్టి ఇలా విపత్తు సమయంలో తమకు అందాల్సిన రూ.వెయ్యి నగదు ఇవ్వకపోవడంపై ఆవేదన చెందుతున్నారు.


వైఎస్‌ఆర్‌ నవశకం సర్వే పేరుతో జిల్లాలో ఉన్న తెల్లరేషన్‌కార్డుల స్థానంలో రైస్‌కార్డులు తీసుకొచ్చిన ప్రభుత్వం వాటి సంఖ్యని భారీగా తగ్గించింది. లక్షా 66 వేల 333 కుటుంబాలకు రైస్‌కార్డులు ఇవ్వలేదు. తొలుత వీరికే రేషన్‌సరుకులు పంపిణీ చేస్తామని చెప్పింది. అయితే ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో చివరి నిమిషంలో తెల్లకార్డులందరికీ రేషన్‌ సరుకులని పునరుద్ధరించింది. నగదు విషయంలో మాత్రం రైస్‌కార్డుల లబ్ధిదారులకే విడుదల చేసింది. 


ఈ నెల నాల్గో తేదీ నుంచి వలంటీర్లు తమ పరిధిలోని ఇళ్లకు వెళ్లి కుటుంబ పెద్ద ఫొటోని తీసి నగదుని పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకు 11 లక్షల 98 వేల 167 మందికి నగదు పంపిణీ చేసినట్లు నివేదించారు. అయితే జిల్లాలో చాలామంది తమకు ఇంకా నగదు చేతికందలేదని చెబుతున్నారు. పెండింగ్‌లో కేవలం లక్షా 24 వేల 939 కుటుంబాలు మాత్రమే చూపిస్తున్నారు. నగదు పంపిణీ సమయంలో తీసిన కుటుంబ పెద్ద ఫొటోని తప్పనిసరిగా అప్‌లోడింగ్‌ చేయాలి. అయితే జిల్లాలో ఇప్పటివరకు కేవలం 2 లక్షల 28 వేల 936 కుటుంబాల ఫోటోలే అప్‌లోడింగ్‌ చేశారు. ఇంకా 9 లక్షల 19 వేల 242 పెండింగ్‌లో ఉన్నాయి. అయితే వేలిముద్రల అథెంటికేషన్‌ లేకపోవడం వలన శాశ్వతంగా వలస వెళ్లిపోయిన వారి రైస్‌కార్డులు, చనిపోయిన వారికి బదులు వేరే వాళ్ల ఫోటోలు అప్‌లోడింగ్‌ చేసి నగదు డ్రా చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తుండటంతో ఏ ఎంక్వయిరీలకు దారి తీస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. 


జిల్లాలో ప్రభుత్వ రూ.వెయ్యి సాయం ఇలా..

జిల్లాలో మొత్తం తెల్లరేషన్‌ కార్డుల సంఖ్య: 14,89,439

7వ తేదీకి రేషన్‌సరుకులు తీసుకెళ్లిన వారి సంఖ్య: 13,15,367

బియ్యం కార్డుల సంఖ్య: 13,23,106

రూ. వెయ్యి నగదు చేతికందిన వారి సంఖ్య: 11,98,167

ఇంకా నగదు పొందాల్సిన వారి సంఖ్య: 1,24,939

నగదు తీసుకొన్న వారి ఫొటోలు అప్‌లోడింగ్‌: 2,78,936

 పెండింగ్‌లో ఉన్న ఫోటోల అప్‌లోడింగ్‌: 9,19,242

Updated Date - 2020-04-08T16:06:13+05:30 IST