-
-
Home » Andhra Pradesh » Guntur » nivar
-
నివర్ నష్టం.. రూ. 399.56 కోట్లు
ABN , First Publish Date - 2020-12-19T05:57:32+05:30 IST
నివర్ తుపానుతో నష్టపోయిన రైతులను ఉదారంగా ఆదుకునేలా నివేదికలు ఇవ్వాలని కేంద్ర బృందాన్ని కలెక్టర్ ఆనంద్‌కుమార్ కోరారు.

కోత దశలో తుడిచిపెట్టుకుపోయిన పంటలు
రైతులకు కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందించాలి
కేంద్ర బృందానికి నివేదించిన కలెక్టర్ ఆనంద్‌కుమార్
గుంటూరు, పొన్నూరు టౌన్, బాపట్ల, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): నివర్ తుపానుతో నష్టపోయిన రైతులను ఉదారంగా ఆదుకునేలా నివేదికలు ఇవ్వాలని కేంద్ర బృందాన్ని కలెక్టర్ ఆనంద్‌కుమార్ కోరారు. జిల్లాలో తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను శుక్రవారం కేంద్ర బృందం పరిశీలించింది. బృందంలో మినిస్ట్రీ ఆఫ్ ఎగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పొన్ను స్వామి, మినీస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్టు రీజనల్ ఆఫీసర్ ప్రావన్‌కుమార్ సింగ్, రూరల్ డెవలప్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ మోతీరామ్ ఉన్నారు. తొలుత వారు కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్, పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ని పరిశీలించారు. జిల్లాలో మొత్తం 90,858.81 హెక్టార్లలో వరి, మినుము, కంది, వేరుశనగ, జొన్న, పొగాకు పంటలు దెబ్బతిన్నాయని కలెక్టర్ కేంద్రబృందానికి వివరించారు. లక్షా 58 వేల 650 మంది రైతులు నష్టపోయారని, పంట నష్టం అంచనా విలువ రూ.257.31 కోట్లుగా లెక్కించడం జరిగిందన్నారు. వీరికి ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.136.24 కోట్ల నిధులు అవసర మౌతాయని తెలిపారు. మిర్చి, పసుపు, అరటి, బొప్పాయి, కూరగాయలు, పండ్లు తోటలు 3,733.81 హెక్టార్లలో దెబ్బతి న్నాయన్నారు. 7,599 మంది రైతులు రూ.130.35 కోట్ల విలువ చేసే పంటని కోల్పోయారని చెప్పారు. వీరికి ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.5.37 కోట్ల నిధులు అవసరమౌతాయని నివేదించారు. దెబ్బతిన్న ఆర్‌అండ్‌బీ రోడ్లకు రూ.5.30 కోట్లు అవసరమౌ తాయని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో తాగునీటి పథకాలకు రూ. 6.25 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. ఈ విధంగా చూసుకుంటే తుపాను వల్ల 399.56 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.141.62 కోట్లు అవసరమౌతా యన్నారు. ముఖ్యంగా కోత దశలో పంటలు దెబ్బ తినడం వలన రైతుల కన్నీటి బాధలు చెప్పలేనివిగా ఉన్నాయన్నారు. కేంద్ర బృందం సభ్యుడు డాక్టర్ పొన్ను స్వామి మాట్లాడుతూ నష్టాలపై కేంద్ర ప్రభు త్వానికి నివేదిక అందించి పరిహారం అందేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్(రెవెన్యూ) ఏఎస్ దినేష్‌కుమార్, తెనాలి సబ్ కలెక్టర్ మయూర్ అశోక్, వ్యవసాయ శాఖ జేడీ విజయభారతి, పశుసంవర్థక శాఖ జేడీ డాక్టర్ కస్పారెడ్డి, ఉద్యాన శాఖ డీడీ సుజాత పాల్గొన్నారు.
పొన్నూరు, బాపట్లలో కేంద్ర బృందం పర్యటన
నివర్ తుపాను కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందం శుక్రవారం పొన్నూరు, చేబ్రోలు, బాపట్ల ప్రాం తాల్లో పర్యటిం చింది. తొలుత చేబ్రోలు మండలం మంచాల, పొన్నూరు మండలం వెల్లలూరు, మునిపల్లె గ్రామాలో కేంద్ర బృందం పర్యటించింది. ఆ తర్వాత బాపట్ల ప్రాంతంలోని ఈతేరు, అప్పికట్ల గ్రామాల్లోని పొలాలను పరిశీలించింది. ఆయా గ్రామాల్లో రైతులతో మాట్లాడి నష్ట వివరాలను సేకరిం చింది. రైతుల వెతలను కేంద్ర బృందం దృష్టికి తీసుకువెళ్లామని, సాధ్యమైనంత త్వరగా ఇన్‌పుట్ సబ్సిడీ అందిస్తామని ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య తెలిపారు.
ఎకరాకు.. రూ.30 వేలకుపైగా నష్టం
తుపానుతో పంట పూర్తిగా నష్టపోయామని ఆయా ప్రాంతాల్లో రైతులు కేంద్ర బృందం ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. బురదలో కూరుకుపోయిన పంటను కోసేందుకు కూలీలు ఎకరానికి రూ.10 వేలు డిమాండ్ చేస్తున్నారన్నారు. దెబ్బతిన్న పైరు తొలగించేందుకే ఎకరానికి రూ.20 వేలు పైగా ఖర్చు అవుతుందని వివరించారు. పంట సాగుకు పెట్టుబడి కింద ఇప్పటికే రూ.30 వేలకుపైగా వ్యయం చేశామని.. ఆదుకోవాలని పలువురు రైతులు కేంద్ర బృందం ఎదుట వాపోయారు.
కేంద్ర బృందాన్ని నిలువరించిన నరేంద్ర
రైతుల బాధలు పట్టించుకోకుండా వెళ్తారా అని నిలదీత
పంటలను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందాన్ని పొన్నూరు మం డలం వెల్లలూరు వద్ద మాజీ ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ అడ్డగించా రు. షెడ్యూల్ ప్రకారం మంచాల, వెల్లలూరులో దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించాలి. ఆ మేరకు అక్కడ ఏర్పాట్లు కూడా చేశారు. దాంతో రైతులు తమ బాధని చెప్పుకునేందుకు పెద్ద సంఖ్యలో రైతులు, టీడీపీ నాయకులు వచ్చారు. మంచాల గ్రామాన్ని సందర్శించిన కేంద్ర బృందంతో పాటు ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య కూడా చేరారు. ఈ క్రమంలో ఏమి జరిగిందో ఏమో వెల్లలూరులో కేంద్ర బృందం పరిశీలన కార్యక్రమానికి బయల్దేరారు. దీంతో కలెక్టర్, ఎమ్మెల్యే రోశయ్య వాహనాలు వెల్లలూరులో ఆగకుండా వెళ్లిపోయాయి. కేంద్ర బృందాన్ని దారి మళ్లించి వేరే ప్రాంతానికి తీసుకెళ్తుం డటాన్ని రైతులు అప్పటికే అక్కడకి వచ్చి ఉన్న నరేంద్రకు చెప్పారు. దీంతో ఆయన జీబీసీ రోడ్డుపైకి చేరుకుని రైతులు, టీడీపీ నాయకులతో కలిసి వాహన శ్రేణికి అడ్డుగా నిలిచారు. దీంతో పోలీసులు కాన్వాయ్‌ని ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించగా షెడ్యూల్‌లో ఉన్న కార్యక్రమాన్ని ఎలా తీసే స్తారని నరేంద్ర ప్రశ్నించారు. ఈలోపు విషయం తెలుసు కున్న కేంద్ర బృంద సభ్యులు వాహనాలు దిగి నరేంద్ర కుమార్ వద్దకు వచ్చి ఆయనతో కలిసి పంటలను పరిశీ లించారు. రైతుల తరపున కేంద్ర బృందానికి వినతిపత్రం అంద జేశారు. అనంతరం నరేంద్ర మాట్లాడుతూ పొన్నూరులో 30 శాతం పైగా పంట దెబ్బతిన్నదని, ధాన్యం కొనుగోళ్లకు నిబంధనలు సడలించాలన్నారు. ఎకరాకు ఇస్తోన్న రూ.6 వేల పంట నష్టపరిహారం ఏమాత్రం సరిపోదని, దానిని కనీసం రూ.15 వేలకు తగ్గకుండా చూడాలన్నారు. ఇంతలో కలెక్టర్ తన కారులో వెనక్కు వచ్చి రైతులతో మాట్లాడారు. కాగా కేవలం రైతుల తరుపున టీడీపీ మాజీ ఎమ్మెల్యే నరేంద్ర వచ్చారన్న విషయం తెలిసి అధికార పార్టీ నేతల ప్రోద్బలంతోనే వెల్లలూరు పర్యటనను షెడ్యూల్ నుంచి తొలగించే ప్రయత్నం చేశారని రైతులు ఆరోపించారు.