-
-
Home » Andhra Pradesh » Guntur » nivar
-
వర్షార్పణం
ABN , First Publish Date - 2020-11-27T05:47:55+05:30 IST
డెల్టాలో 4.98 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. కాలువకు ఎగువున ఉన్న మంగళగిరి, దుగ్గిరాల, తెనాలి, కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు, అమృతలూరు, చుండూరు, రేపల్లె, నగరం, పి.వి.పాలెం, కర్లపాలెం, పొన్నూరు మండలాల్లో ఇప్పటికే వరి కోతలు మొదలయ్యాయి.

నిన్న కృష్ణా వరదలు వాణిజ్య పంటలను తుడిచి పెట్టేస్తే.. నివర్ తుపాన్ ఖరీఫ్ వరి రైతును నిలువునా ముంచేసింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందివచ్చే తరుణంలో నీటిపై తేలియాడుతుంటే రైతు కన్నీరుమున్నీరవుతున్నాడు. దీనికి ఈదురు గాలులు కూడా తోడవటంతో కోత కోయని చేలన్నీ నేలపై చాపలా పరచుకున్నాయి. మరోపక్క లోతట్టు ప్రాంతాలు, శివారు కాలనీలు వర్షపు నీటిలో మునిగిపోయాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం రోజంతా వదలకుండా వర్షం పడుతూనే ఉండటంతో జనం కూడా బయటకు అడుగు పెట్టేందుకు ధైర్యం చేయలేదు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.
నిలువునా ముంచిన నివర్
వర్షపు నీటిలో సుమారు 36వేల ఎకరాలు ఖరీఫ్ రైతు ఆశలపై తుపాను బీభత్సం
వరి ఓదెలు నీటి ముంపులోనే..
చాపలా పరచుకున్న వరి చేలు
లబోదిబోమంటున్న రైతులు
గుంటూరులో 74.22 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం
తెనాలి, నరసరావుపేట, గుంటూరు, నవంబర్ 26, (ఆంధ్రజ్యోతి): డెల్టాలో 4.98 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. కాలువకు ఎగువున ఉన్న మంగళగిరి, దుగ్గిరాల, తెనాలి, కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు, అమృతలూరు, చుండూరు, రేపల్లె, నగరం, పి.వి.పాలెం, కర్లపాలెం, పొన్నూరు మండలాల్లో ఇప్పటికే వరి కోతలు మొదలయ్యాయి. సుమారు 36వేల ఎకరాల్లో వరి కోతలు కోసి ఓదెలన్నీ చేలపైనే ఉండటంతో విడువకుండా కురిసిన వర్షానికి వాన నీటిలో తేలియాడుతున్నాయి. తుపానుకు ముందు నేలవాలిన వరి కంకుల నుంచి మొలకలు కూడా వస్తున్నాయి. మరో రెండ్రోజులు ఇదే పరిస్థితి ఉంటే నిలువుపై ఉన్న వరి కంకులుకూడా పనికిరావని, నల్లగా మారిపోతాయని రైతులు వాపోతున్నారు. అరటి, పసుపు పంటలకు పాక్షిక నష్టం కలుగుతోంది. మినుము మొక్క దశలో ఉండటంతో నీరు నిల్వ ఉండి మొక్క చనిపోతోందని రైతులు వాపోతున్నారు. ఈసారి మెట్ట రైతులపై ప్రకృతి దెబ్బమీద దెబ్బ తీస్తోందని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తుపాను తీవ్రత పెరిగితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిందిగా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ అధికారులను ఆదేశించారు.
భారీ వర్షం...
గురువారం సాయంత్రం వరకు తెనాలి డివిజన్‌లో భారీ వర్షపాతం నమోదయింది. 18 మండలాల్లో సగటున 10.28 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదయింది. అత్యధికంగా బాపట్ల మండలంలో 8 సెం.మీటర్లు వర్షం కురిసింది. నగరంలో 7.5, దుగ్గిరాలలో 7 సెం.మీటర్ల వర్షపాతం నమోదయింది. రేపల్లె, వేమూరు, చుండూరు, నిజాంపట్నం, కాకుమాను, భట్టిప్రోలు, అమృతలూరు మండలాల్లో 6 సెం.మీటర్లపైనే వర్షం పడింది. అత్యల్పంగా తెనాలిలో 3.08, కొల్లిపరలో 3.72 సెం.మీటర్ల వర్షమే కురిసింది. బాపట్ల, దుగ్గిరాల, నగరం మండలాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తెనాలి, పొన్నూరు పట్టణాల్లో వీధులన్నీ వాన నీటితో నిండిపోయి ఉన్నాయి.
బాపట్ల మండలంలోని పిన్నిబోయినవారిపాలెం, పూండ్ల, గోపాపురం, ఈతేరు, చుండూరుపల్లి, భర్తిపూడి, గుడిపూడి, హైదర్‌పేట తదితర గ్రామాల్లో సుమారు 21వేల ఎకరాలలో పంటనష్టం జరిగినట్లు వ్యవసాయాధికారులు అంచనా వేశారు. బాపట్ల డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు, రూరల్ ఎస్‌ఐ కిరణ్‌లు సిబ్బందితో కలిసి తీరాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. భారీ వర్షాలకు రెంటచింతల మండలంలోని దశబంఽధ కాలువకు గండిపడింది. బుగ్గవాగు డ్యాం అధికారులు తక్షణమే స్పందించి నీటిని కట్టడి చేయాలని పలువురు కోరుతున్నారు.

నివర్ తుఫాన్ ప్రభావంతో సాగర్ ఆయకట్టు ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 22 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. చలిగాలులు వీస్తున్నాయి. నివర్ పత్తి, వరి పంటలకు తీవ్ర నష్టం కలిగించింది. వరి కంకి, కోత దశలో ఉండటంతో పంట వాలిపోయింది. కంకులు నీటిలో నానుతున్నాయి. దిగుబడులు పడిపోయే ప్రమాదం ఉంది. పత్తి కోత దశలో ఉంది దీంతో పత్తి తడిచి ముద్దవుతున్నది. పల్లపు ప్రాంతాలలో పొలాల్లో నీరు నిలిచి పత్తి, మిరప పంటలు ఉరకెత్తుతున్నాయి. చేతి కొచ్చిన పంటలు వర్షానికి దెబ్బతింటుండతంతో అన్నదాతలు తీవ్ర అవేదన చెందుతున్నారు. వర్షాలు కొనసాగితే పంటలకు అపార నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షం వలన వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గి నెమ్ముశాతం పెరుగుతోంది. దీంతో మిర్చికి తెల్లదోమ వైరస్ వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలోని పోలిరెడ్డిపాలెం సమీపంలో చిలకలూరిపేట- నరసరావుపేట మార్గంలో వర్షాలకు ఓ భారీ చెట్టు రోడ్డుకు అడ్డంగా పడింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
రైతులు అప్రమత్తంగా ఉండండి
నివర్ తుపాన్ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వరి చేలల్లో పంటను కాపాడుకునేందుకు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యవసాయశాఖ అధికారులు అందించే సూచనలను తప్పకుండా పాటిస్తే నష్ట తీవ్రత నుంచి కొంతవరకైనా బయటపడే అవకాశం ఉంటుంది. చేల ముంపు నుంచి కాపాడేందుకు నీటిని వెంటనే బయటకు తీసేందుకు ప్రయత్నం చేయాలి. పంట కాల్వల్లో నీటి విడుదల నిలుపుదల చెయ్యాలని ఆదేశించాం.
- మయూర్ అశోక్, సబ్ కలెక్టర్, తెనాలి
