వచ్చే నెల నుంచి పాల సేకరణ ధర పెంపు

ABN , First Publish Date - 2020-12-11T05:45:06+05:30 IST

వచ్చే నెల నుంచి జనవరి నుంచి పాల సేకరణ ధర పెంచాలని పాలకవర్గం నిర్ణయించిన్నట్లు సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ తెలిపారు.

వచ్చే నెల నుంచి పాల సేకరణ ధర పెంపు

ఇక నుంచి ప్రతి నెల సమీక్షించి ధరపై నిర్ణయం

సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌


చేబ్రోలు, డిసెంబరు 10: వచ్చే నెల నుంచి జనవరి నుంచి పాల సేకరణ ధర పెంచాలని పాలకవర్గం నిర్ణయించిన్నట్లు సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ తెలిపారు. మండలంలోని వడ్లమూడి సంగం డెయిరీలో గురువారం జరిగిన పాలకవర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. అనంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో చైర్మన్‌ మాట్లాడుతూ ప్రస్తుతం పది శాతం వెన్న వచ్చే పాల ధర రూ.62ను నూతన సంవత్సరం నుంచి రూ. 64కు పెంచి రైతులకు చెల్లించనున్నట్లు చెప్పారు. ఇక నుంచి ప్రతి నెల పాల ధరను సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా, వ్యాపార అవకాశాల పెంపుదల కోసం చిత్తూరు, నెల్లూరు జిల్లా మధ్య సంగం డెయిరీ ప్రాసెసింగ్‌, ప్యాకింగ్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రధాన రహదారి ఆనుకుని ప్యాకింగ్‌ ప్లాంటు ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రకటించారు.  ఈ ప్లాంట్‌ ద్వారా చెన్నై, కడప, అనంతపూర్‌ తదితర ప్రాంతాలోకి సంగం డెయిరీని విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. రైతుల కోసం ప్రకాశం జిల్లా అద్దంకిలో వంద ఎకరాల్లో సైలేజ్‌ తయారీకి రైతులతో అంగీకారం కుదుర్చుకున్నామని తెలిపారు. రొంపిచర్ల వద్ద కొండమూడు గ్రామంలోని చిల్లింగ్‌ సెంటర్‌ను బ్యాంక్‌ వేలంలో కొన్నుగోలు చేశామన్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో మరో చిల్లింగ్‌ సెంటర్‌ను కొన్నుగోలు చేసినట్లు  తెలిపారు. వీటిని త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో కొత్త చిల్లింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు పాలకవర్గం ఆమోదించిందన్నారు. డెయిరీలో మహిళా ఉద్యోగులు పెరుగుతునందున వారి సంరక్షణ, భద్రత కోసం ప్రత్యేక పాలసీని అమలులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. సమావేశంలో ఎండీ పీ గోపాల్‌కృష్ణన్‌, పాలకవర్గ సభ్యులు, వివిధ విభాగాల సీనియర్‌ మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-11T05:45:06+05:30 IST