రెండేళ్ళలో జేఎన్‌టీయూ నిర్మాణం

ABN , First Publish Date - 2020-08-18T13:08:54+05:30 IST

నరసరావుపేట జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాల భవనాల నిర్మాణాన్ని..

రెండేళ్ళలో జేఎన్‌టీయూ నిర్మాణం

యుద్ధప్రాతిపదికన భవనాలను పూర్తి చేస్తాం

నరసరావుపేట కళాశాలకు రూ.140 కోట్లు మంజూరు

వర్చ్యువల్‌ విధానంలో శంకుస్థాపన చేసిన సీఎం జగన్‌


నరసరావుపేట(గుంటూరు): నరసరావుపేట జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాల భవనాల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన రెండేళ్లలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. కళాశాల భవనాల నిర్మాణానికి ఆయన వర్చువల్‌ విధానంలో తాడేపల్లిలోని  క్యాంపు కార్యాలయం నుంచి సోమవారం శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నరసరావుపేట జేఎన్‌టీయూ భవనాల నిర్మాణానికి రూ.140 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు.   కళాశాలలో 2016లో మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయని, ఇప్పుడు వారు చివరి సంవత్సరానికి వచ్చినా ఇప్పటి వరకు భవనాలను నిర్మించాలని ఆలోచన చేయలేదన్నారు. 


పీజీ కోర్సులు ఏర్పాటు చేయాలి : చెరుకువాడ

నరసరావుపేటలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఇన్‌చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ కళాశాలలో ఇంజనీరింగ్‌ పీజీ కోర్సులు కూడా ఏర్పాటు చేయాలని కోరారు. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ కళాశాలలో ఫ్యాకల్టీ 80 మందికి 30 మంది మాత్రమే ఉన్నారని, మిగిలిన పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఫైనలీయర్‌ విద్యార్థులందరూ క్యాంపస్‌ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలు సాధించారని చెప్పారు. ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కళాశాలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసినా భవనాలు నిర్మించకుండా ఐదేళ్లు కాలయాపన చేసిందన్నారు.


నరసరావుపేట జిల్లాకు ఈ కళాశాల ఆణిముత్యంలా నిలుస్తోందన్నారు. ఇక్కడే ఇంజనీరింగ్‌ యూనివర్సిటీ కూడా మంజూరు చేయాలని కోరారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వీవీ సుబ్బారావు, విద్యార్థులు తన్వీర్‌ రహమాన్‌, మల్లిరెడ్డి ధరణి ప్రసంగించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ఆనందకుమార్‌, ఎమ్మెల్యేలు కాసు మహేష్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, విడదల రజని, ఆర్డీవో ఎం వెంకటేశ్వర్లు, మునిసిపల్‌ కమిషనర్‌ డాక్టర్‌ వెంకటేశ్వరరావు, డీఎస్పీ వీరారెడ్డి, ఎన్‌ఈసీ విద్యా సంస్థల చైర్మన్‌ మిట్టపల్లి వెంకటకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-08-18T13:08:54+05:30 IST