వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే హత్య

ABN , First Publish Date - 2020-12-17T06:28:46+05:30 IST

వివాహేతర సంబందానికి అడ్డుగా ఉన్నాడనే కారణంగా ప్రియుడితో కలసి కట్టుకున్న భర్తను కడతేర్చిన కేసులో రాజీవ్‌గాంధీనగర్‌ 6/2కు చెందిన పీకె మరియమ్మ, వేమూరు మండలం పెరవలికి చెందిన గుంటూరు అనిల్‌బాబులను అరెస్టుచేశారు.

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే హత్య
విలేకరులతో మాట్లాడుతున్న వెస్ట్‌ డీఎస్పీ సుప్రజ, అరండల్‌పేట సీఐ శ్రీనివాసరావు, ఎస్సై తరంగణి

భార్య, ప్రియుడు అరెస్టు

గుంటూరు, డిసెంబరు 16: వివాహేతర సంబందానికి అడ్డుగా ఉన్నాడనే కారణంగా ప్రియుడితో కలసి కట్టుకున్న భర్తను కడతేర్చిన కేసులో రాజీవ్‌గాంధీనగర్‌ 6/2కు చెందిన పీకె మరియమ్మ, వేమూరు మండలం పెరవలికి చెందిన గుంటూరు అనిల్‌బాబులను అరెస్టుచేశారు. బుధవారం  పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వెస్ట్‌ డీఎస్పీ కె.సుప్రజ వివరాలు వెల్లడించారు. రాజీవ్‌గాంధీనగర్‌ 6/2కు చెందిన పీటా మరియదాసు, మరియమ్మ దంపతులకు కుమారుడు, కుమార్తె సంతానం. మరియదాసు కూలిపనులు చేస్తుంటాడు. కూతురును వేమూరు మండలం పెరవలికి చెందిన యువకుడికి ఇచ్చి వివాహం జరిపించారు. కూతురును చూసేందుకు వెళ్ళే క్రమంలో తల్లి మరియమ్మ అక్కడ ఆటోఎక్కేది. ఈ క్రమంలో ఆటోడ్రైవర్‌ అయిన గుంటూరు అనిల్‌తో పరిచయం ఏర్పడింది.  ఆ పరిచయం వారి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది.  ఈ విషయం తెలిసిన భర్త నిలదీయడంతో దంపతుల మధ్య కొంతకాలంగా  గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 7న కుమారుడు పనికి వెళ్ళగా భర్త మద్యం తాగి వచ్చి పడుకోగా అదే అదునుగా భావించి అర్ధరాత్రి దాటిన తరువాత మరియమ్మ, ప్రియుడు అనిల్‌ కలసి మరియదాసు గొంతుకు తాడు బిగించి, రోకలి బండతో తలపై మోది చంపేశారు. తరువాత మరియమ్మ కుమారుడికి ఫోన్‌చేసి నాన్న మద్యం సేవించి ఎవరితోనో గొడవపడి కొట్టించుకొని వచ్చాడని, తలకు గాయమైందని చెప్పి నమ్మించే ప్రయత్నం చేసింది. అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు విచారించగా హత్య జరిగినట్లు తేలింది.అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి ఆదేశాల మేరకు వెస్ట్‌ డిఎస్పీ సుప్రజ ఆధ్వర్యంలో అరండల్‌పేట సీఐ బత్తుల శ్రీనివాసరావు, ఎస్‌ఐ తరంగణి గాలిస్తుండగా విషయం తెలుసుకున్న నిందితులు బుదవారం స్థానిక వార్డు వలంటీర్‌ ద్వారా పోలీసులకు లొంగిపోయారు. వారి నుంచి రెండు సెల్‌ఫోన్‌లు, ఆటో, రోకలిబండ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ సుప్రజ తెలిపారు. విలేకరుల సమావేశంలో సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ తరంగణి పాల్గొన్నారు.


Updated Date - 2020-12-17T06:28:46+05:30 IST