-
-
Home » Andhra Pradesh » Guntur » muncipal commissionar
-
కాలుష్య నియంత్రణ మార్గదర్శకాలు పాటించాలి
ABN , First Publish Date - 2020-11-27T05:48:22+05:30 IST
నగరాల్లో వాయు కాలుష్యం పెరిగిపోతోన్న దృష్ట్యా ముందు జాగ్రత్తగా కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన మార్గదర్శకాలను పాటించాలని నగర కమిషనర్ చల్లా అనురాధ తెలిపారు.

నగర కమిషనర్ చల్లా అనురాధ
గుంటూరు(కార్పొరేషన్), నవంబరు 26: నగరాల్లో వాయు కాలుష్యం పెరిగిపోతోన్న దృష్ట్యా ముందు జాగ్రత్తగా కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన మార్గదర్శకాలను పాటించాలని నగర కమిషనర్ చల్లా అనురాధ తెలిపారు. కౌన్సిల్ సమావేశ మందిరంలో గురువారం జరిగిన సమావేశంలో ఆమె ప్రసంగించారు. వాయు కాలుష్య శాతం తెలుసుకునేందుకు అవసరమైన పరికరాలను ఏర్పాటు చేయాలన్నారు. అపార్ట్‌మెంట్లు, లేఅవుట్ల వద్ద విధిగా మొక్కలు పెంపకం చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. నివర్ తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
ఖాళీ స్థలాలకు పన్ను విధించాలి
నగరంలోని ఖాళీ స్థలాలకు పన్ను విధించాలని కమిషనర్ అనురాధ అధికారులను ఆదేశించారు. పెద్దఎత్తున ఉన్న ఖాళీ స్థలాల్లో ఉన్న పిచ్చి మొక్కలు, మురుగు వ్యాధులకు కారణమవుతున్నాయన్నారు. ఖాళీ స్థలాలు శుభ్రం చేసుకోవాలని లేకుంటే నగరపాలక సంస్థ స్వాధీనం చేసుకుని క్లస్టర్ కంపోస్ట్ యూనిట్ పెడుతుందని యజమానులకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. ఆయా సమావేశాల్లో డీసీలు డీ శ్రీనివాసరావు, బీ శ్రీనివాసరావు, వెంకటకృష్ణయ్య, ఎస్‌ఈ రవికృష్ణరాజు, ఎంహెచ్‌వో వెంకట రమణ, ఈఈ సాయినాథ్, డీసీపీ సత్యనారాయణ, ఆర్‌వోలు ప్రసాద్, వేణు, రవికుమార్, బాలాజీ, బాషా, రవికిరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వ్యర్థాలను తడి పొడి చెత్తలుగా విభజించాలి
ప్రజలు వారి ఇళ్లలోని వ్యర్థాలను తడి పొడి చెత్తలుగా విభజించి పారిశుధ్య సిబ్బందికి అందజేయాలని నోడల్ అధికారులు తెలిపారు. హోం కంపోస్ట్ నిర్వహణపై గురువారం గుజ్జనగుళ్లలో అవగాహన ర్యాలీ నిర్వహించి, మానవహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ భానుకుమార్ తదితరులు పాల్గొన్నారు.