రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి
ABN , First Publish Date - 2020-12-02T05:08:55+05:30 IST
నివర్ తుఫాన్ ప్రభావంతో పంట కోల్పోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు.

ఎంపీ గల్లా జయదేవ్
చేబ్రోలు, డిసెంబరు1: నివర్ తుఫాన్ ప్రభావంతో పంట కోల్పోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. నారాకోడూరు, వేజండ్ల, సుద్దపల్లి, వడ్లమూడి, చేబ్రోలు, మంచాల గ్రామాల్లో మంగళవారం ఆయన మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడును ఎంపీ జయదేవ్ ముందు వెల్లబోసుకున్నారు. నేటి వరకు ఒక్క అధికారి కూడా తమ వద్దకు రాలేదని లేదని వాపోయారు. పర్యటన అనంతరం విలేకర్ల సమావేశంలో జయదేవ్ మాట్లాడుతూ తుఫాన్ వల్ల జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని స్పష్టం చేశారు. రైతులకు అందించాల్సిన నష్టపరిహారంపై పోరాడతామన్నారు. దూళిపాళ్ళ నరేంద్రకుమార్ మాట్లాడుతూ పంట నష్టపోయి రైతులు విల విల్లాడుతుంటే ప్రభుత్వం వారికి ఆదుకోకుండా ప్రతిపక్షంపై విషం కక్కుతుందన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై పోరాడుతుందన్నారు. కార్యక్రమంలో పార్లమెంటు తెలుగు మహిళా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం హరిబాబు, మాజీ ఎంపీపీ ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు.