విద్యా వెలుగులతో చైతన్యాన్ని నింపాలి
ABN , First Publish Date - 2020-03-02T12:12:47+05:30 IST
మనిషిలో అజ్ఞానపు అంథకారాన్ని తొలగించి విద్యతో సమాజానికి వెలుగులు అందించాలని ఆంధ్రప్రదేశ్ జ్యూడిషియల్ ప్రిప్యూ న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్

- ఆంధ్రప్రదేశ్ జ్యూడిషియల్ ప్రిప్యూ న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ బీ శివశంకరరావు
గుంటూరు(విద్య): మనిషిలో అజ్ఞానపు అంథకారాన్ని తొలగించి విద్యతో సమాజానికి వెలుగులు అందించాలని ఆంధ్రప్రదేశ్ జ్యూడిషియల్ ప్రిప్యూ న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ బీ శివశంకరరావు తెలిపారు. గోరంట్లలోని భాష్యం విద్యాసంస్థలో ఆదివారం నిర్వహించిన 27వ వార్షికోత్సవంలో ఆయన ప్రసంగించారు. అలాంటి చైతన్యాన్ని నింపడమే విద్య పరమార్థమని, దీనిని అందించడమే విద్యాలయాల లక్ష్యం కావాలన్నారు. పిల్లలకు విద్యతోపాటు శీలం, సంస్కారం, సౌశీల్యం నేర్పించినప్పుడే అవి దేవాలయాలుగా విరాజిల్లుతాయని తెలిపారు. రాతిలో దాగి ఉన్న రూపాన్ని వెలికితీయడానికి శిల్పకారుడు ఎంత శ్రమిస్తాడో అదే విధంగా విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసి వారిని సన్మామార్గం వైపు పయనించే పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ డాక్టర్ కొనిరెడ్డి హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ ఉన్నత లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నప్పుడే విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తారని చెప్పారు. చదువుతోపాటు ప్రాథమిక స్థాయి నుంచే జీవన నైపుణ్యాలను పెంపొందిం చుకోవాలని, ఇందుకు ఉపాధ్యాయులు దిశానిర్ధేశం చేయాలని సూచించారు.
భవిష్యత్తు కోసం తపన చెందాలి : సినీ నటులు తనికెళ్ల భరణి
తనికెళ్ల భరణి మాట్లాడుతూ విద్యార్థులు రాబోయే భవిష్యత్తు కోసం తపన పడాలన్నారు. తల్లిదండ్రులు ఎన్నో ఆశయాలతో, కష్ట నష్టాలకోర్చి చదివిస్తున్నారని వారి కష్టాన్ని వృఽథాగా పోనివ్వరాదని సూచించారు. భాష్యం చైర్మన్ భాష్యం రామకృష్ణ మాట్లాడుతూ విద్యాసంస్థల్ని స్థాపించన దగ్గర నుంచి తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహం మరువలేనిదన్నారు.
ఘనంగా రామకృష్ణ జన్మదిన వేడుకలు
భాష్యం రామకృష్ణ జన్మదినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ కేక్ కట్ చేయగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో భాష్యం పూర్వ విద్యార్థి నల్గొండ జిల్లా దేవరకొండ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఉల్లం అజయ్, ప్రవచన కర్త మైలవరపు శ్రీనివాసరావు, భాష్యం డైరెక్టర్ భాష్యం హనుమంతరావు, సలహాదారు మైఖేల్‌రాజ్, వివిధ బ్రాంచ్‌ల ప్రిన్సిపల్స్, జడ్‌ఈవోలు, ఇన్‌చార్జిలు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు హోరెత్తించాయి.