ఎగిరిపోతున్న ఎర్రబంగారం..
ABN , First Publish Date - 2020-04-12T08:55:45+05:30 IST
చైనా, మలేషియా, తైవాన్, సింగపూర్, కొలంబో నుంచి మిర్చి దిగుమతి ఆర్డర్స్ రావడం... అందుకు ఊతంగా నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు తెరుచుకోవడం...

శీతల గిడ్డంగుల నుంచి నేరుగా కృష్ణపట్నం పోర్టుకు...
జీరో బిజినెస్‌లో తరలిపోతున్న మిర్చి టిక్కీలు
గ్రామాల్లోనూ కొనుగోలు చేస్తోన్న ఎక్స్‌పోర్టర్లు
మిర్చియార్డు ఆదాయాన్ని కన్నం
గుంటూరు, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): చైనా, మలేషియా, తైవాన్, సింగపూర్, కొలంబో నుంచి మిర్చి దిగుమతి ఆర్డర్స్ రావడం... అందుకు ఊతంగా నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు తెరుచుకోవడం... వేరే రాష్ట్రాల సరిహద్దులను లారీలు దాటాల్సిన పరిస్థితి లేకపోవడంతో మిర్చి ఎగుమతులు జోరందుకొన్నాయి. ఒకవైపు మిర్చియార్డు కరోన వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా నెలాఖరు వరకు లాక్‌డౌన్ కాగా శీతలగిడ్డంగులు, గ్రామాల నుంచి జీరోలో భారీగా మిర్చి ఎగుమతులు జరుగుతున్నాయి. చెక్‌పోస్టుల వద్ద అంతంత మాత్రంగానే నిఘా ఉండటం వలన వేల మిర్చి టిక్కీలు తరలిపోతున్నాయి. దీని వలన ఇటు మిర్చియార్డుకు, అటు మార్కెట్ కమిటీల ఆదాయానికి గండి పడుతోంది.
క్లస్టర్ కంటైన్‌మెంట్ జోన్ కారణంగా చూపిస్తూ మిర్చియార్డుకు ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. అయితే ఇదే సమయంలో మొన్నటివరకు నిలిచిన ఎగుమతుల ఆర్డర్స్ వచ్చాయి. వాటిని వదులుకోవడానికి ఇష్టపడని ఎక్స్‌పోర్టర్లు జీరో బిజినెస్‌కు తెరలేపారు. పైగా గతంలో ఎక్స్‌పోర్టు చేసినందుకు ఇన్‌పుట్ రూపంలో కేంద్రం 5 శాతం ఇచ్చే సబ్సిడీని తాజాగా 6.75 శాతానికి పెంచింది. ఇది ఎక్స్‌పోర్ట్స్‌లకు మరింత ఊతమిస్తోంది. కోటి రూపాయల సరుకు ఎక్స్‌పోర్టు చేస్తే రూ.6.75 లక్షలు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా వస్తుంది. దీంతో కొంచెం ధర ఎక్కువ పెట్టి అయినా మిర్చిని ఎగుమతిదారులు కొనుగోలు చేస్తున్నారు.
లాక్‌డౌన్‌కి ముందు మిర్చియార్డులో మేలిమి రకాలు క్వింటాలు రూ.13 వేలకు లభించేవి. నేడు రైతుల వద్దకు వెళ్లి తేజ వెరైటీ మిర్చిని రూ.15,200కు కొనుగోలు చేస్తున్నారు. అలానే బ్యాడిగి రూ.15 వేలు, నెంబరు.334 రూ.13 వేలకు కొనుగోలు చేస్తున్నారు. రైతు కల్లాల వద్దనే కొనుగోళ్లు జరుగుతున్నాయి. దీంతో రైతుకు లోడింగ్, అన్‌లోడింగ్, లారీ కిరాయి, యార్డులో కమీషన్ ఛార్జీలు లేకుండా పోవడంతో రైతు కూడా తన వద్ద ఉన్న సరుకుని విక్రయింస్తున్నారు. కొంతమంది తొందరపడి శీతలగిడ్డంగుల్లో నిల్వ చేశారు. ఇప్పుడు వారంతా సరుకుని బయటకు తీసి ఎగుమతిదారులకు విక్రయిస్తున్నారు. అయితే ఇదంతా జీరో రూపంలో లావాదేవీలు జరుగుతున్నాయి. నిత్యం లారీలు, కంటైనర్ల ద్వారా లోడింగ్ చేసి కృష్ణపట్నం పోర్టుకు తరలిస్తున్నారు. ఆ పోర్టు నెల్లూరులో ఉండటం, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఎలాంటి ఆటంకాలు కలిగించొద్దని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడం వ్యాపారస్థులకు కలిసొచ్చింది. జీరో బిజినెస్ వలన మిర్చియార్డుకు ఎట్టలేదన్నా రూ.4 కోట్లు ఆదాయం కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది.