డీపీవో రాంబాబుపై వేటు
ABN , First Publish Date - 2020-06-11T09:12:17+05:30 IST
కల్తీ బ్లీచింగ్ కుంభకోణంలో ప్రధాన అధికారిపైనే వేటు పడింది. జిల్లాల్లో పంచాయతీలకు పంపిణీ చేసిన బ్లీచింగ్ కల్తీది అని తేల్చారు. ఈ క్రమంలో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. దీంతో ..

కల్తీ బ్లీచింగ్‌పై ప్రభుత్వం చర్యలు
సస్పెండ్ చేసినట్లు ప్రకటించిన మంత్రి పెద్దిరెడ్డి
గుంటూరు, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): కల్తీ బ్లీచింగ్ కుంభకోణంలో ప్రధాన అధికారిపైనే వేటు పడింది. జిల్లాల్లో పంచాయతీలకు పంపిణీ చేసిన బ్లీచింగ్ కల్తీది అని తేల్చారు. ఈ క్రమంలో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. దీంతో జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) దాసరి రాంబాబును సస్పెండ్ చేసినట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం విజయవాడలో ప్రకటించారు. జిల్లాల్లో సుమారు రూ.8 కోట్ల బ్లీచింగ్‌ను పంచాయతీలకు సరఫరా చేశారు. కల్తీ బ్లీచింగ్ తయారు చేసి పిడుగురాళ్లలో తయారవుతున్నట్లు బిల్లులు సృష్టించి పెద్ద ఎత్తున నిధుల స్వాహాకు రంగం సిద్ధం చేశారు. దీనిపై ఆంధ్రజ్యోతి ప్రధాన, జిల్లా సంచికల్లో ప్రత్యేక కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో బ్లీచింగ్ కుంభకోణంపై కలెక్టర్ ఆనంద్‌కుమార్ ముగ్గురు ఉన్నతాధికారులతో దర్యాప్తు బృందాన్ని నియమించారు.
ఈ బృందం జిల్లాల్లో పలు ప్రాంతాల్లో పర్యటించి బ్లీచింగ్‌లో అవకతవకలు జరిగినట్లు, దీనికి అధికారులే సూత్రధారులని నివేదిక అందజేసింది. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సచివాలయాల జేసీ ప్రశాంతి బుధవారం దర్యాప్తు ప్రారంభించారు. జేసీ విచారణ జరుగుతుండగానే, ముగ్గురు ఉన్నతాధికారులు అందజేసిన నివేదిక ఆధారంగా డీపీవోను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కల్తీ బ్లీచింగ్ సరఫరా చేసిన కంపెనీలు, కాంట్రాక్టర్లపైనా కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చినట్లు అధికారులు తెలిపారు. బిల్లులు చెల్లించి ఉంటే ఆ నగదును కాంట్రాక్టర్లు, వారిని ప్రోత్సహించిన అధికారుల నుంచి రికవరీ చేసి పంచాయతీలకు జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిపారు. దాసరి రాంబాబుపై గతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. స్వాహా అయిన ఉపాధి హామీ నిధుల రికవరీ కేసు ఆయనపై పెండింగ్‌లో ఉంది.