ఆ‘గని’.. మైనింగ్‌

ABN , First Publish Date - 2020-04-21T07:04:22+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌ చర్యల్లో అధికారులు నిమగ్నమై ..

ఆ‘గని’.. మైనింగ్‌

  • లాక్‌డౌన్‌లోనూ యథేచ్ఛగా అక్రమాలు
  • రాత్రింబవళ్లు చెలరేగుతున్న మాఫియా
  • పట్టీపట్టనట్లుగా అధికారుల వైఖరి

రాజుపాలెం(గుంటూరు): కరోనా లాక్‌డౌన్‌ చర్యల్లో అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఇదే అవకాశంగా అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. గుంటూరు జిల్లా రాజుపాలెం మండలంలోని కొండమోడు సమీపంలో ఎటువంటి అనుమతులు లేకుండా మైనింగ్‌ చేస్తున్నారు. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా లైమ్‌స్టోన్‌ తవ్వి తరలించేస్తున్నారు. ప్రభుత్వానికి రూపాయి చెల్లించకుండా తరలిపోతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. గతంలో పత్రికల్లో వార్తలు ప్రచురితమైనప్పుడు తూతూమంత్రంగా మైనింగ్‌ అధికారులు చర్యలు తీసుకుని చేతులు దులుపుకున్నారు. ప్రస్తుతం సుమారు నెల నుంచి జిల్లావ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వివిధశాఖల అధికారులు కరోనాపైనే దృష్టి సారించి ఉన్నారు. ఇదే అవకాశంగా మైనింగ్‌ మాఫియా కొండమోడు గ్రామంలో మైనింగ్‌ రాత్రింబవళ్లు నిర్వహిస్తున్నది.


రోజుకు 300 నుంచి 400 ట్రాక్టర్లలో లైమ్‌స్టోన్‌ను తవ్వి అక్రమంగా రవాణా చేస్తున్నారు. ప్రతి శనివారం సాయంత్రం మాఫియాకు చెందిన వ్యక్తులు కొండమోడు వచ్చి నగదు సేకరించుకు వెళ్తుంటారు. పగలు ట్రాక్టర్లను తిప్పేందుకు గతంలో పిడుగురాళ్లకి చెందిన వారు తీసుకున్న అనుమతి పత్రాల ఆధారంగా ప్రస్తుతం లైమ్‌స్టోన్‌ను యథేచ్ఛగా తరలిస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో సాధారణ వాహనాలు తిరగరాదు. అయితే లైమ్‌స్టోన్‌తో వెళ్లే ట్రాక్టర్లకు మాత్రం ఎటువంటి అడ్డంకులు చెప్పకపోవడంలో అధికారుల వైఖరిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొండమోడు సమీపంలో రాత్రింబవళ్లు అక్రమ మైనింగ్‌ జరుగుతుందని కోటనెమలిపురి  గ్రామానికి చెందిన పప్పుల శ్రీనివాసరెడ్డి తదితరులు రూరల్‌ ఎస్పీ విజయరావుకు గత నెల 31న ఫిర్యాదు చేశారు. అయినా అక్రమ మైనింగ్‌ కొనసాగుతోందని శ్రీనివాసరెడ్డి తెలిపాడు.


చర్యలు తీసుకోండని పోలీసులకు ఆదేశాలు: ఏడీఏ రవి

కొండమోడు సమీపంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై ఏడీఏ రవిని వివరణ కోరగా 22 నుంచి క్వారైంటన్‌ విధుల్లో ఉన్నట్లు చెప్పారు. ఇటీవల కొందరు ఫోన్‌ చేసి అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు చేశారన్నారు. ఈ క్రమంలో పది రోజులు అక్కడ సిబ్బందిని ఉంచి పరిశీలించామన్నారు. అక్రమ మైనింగ్‌పై మళ్లీ తనకు ఫొటోలు ఆధారంగా ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీంతో ఆ  ఫిర్యాదులపై చర్యలు తీసుకోండని రాజుపాలెం పోలీసులకు సమాచారమిచ్చినట్లు ఏడీఏ తెలిపారు.


Updated Date - 2020-04-21T07:04:22+05:30 IST