పెళ్లికా.. చూద్దాంలే!

ABN , First Publish Date - 2020-03-18T11:14:55+05:30 IST

‘నేను ఫలానా కల్యాణ మండపంలో ఫలానా రోజున పెళ్లి భోజనం ఆర్డర్‌ ఇచ్చిన వాళ్ళం... మరేమి లేదుకానీ... కరోనా అని ఎక్కువమంది బంధువులు రావడం

పెళ్లికా.. చూద్దాంలే!

పెళ్లి వేడుకలకు వెనుకాడుతున్న బంధువులు

వివాహ భోజనాల ఆర్డర్లలో భారీగా కోతలు

క్యాటరింగ్‌ వ్యాపారుల దిగాలు...

నిలిచిపోతున్న విదేశీ సంబంధ వివాహాలు

తెలంగాణ సంబంధాలతో మొదలైన పేచీలు

ఖర్చుతగ్గిందంటూ కొందరి ఆనందాలు


గుంటూరు (సంగడిగుంట), మార్చి 17: ‘నేను ఫలానా కల్యాణ మండపంలో ఫలానా రోజున పెళ్లి భోజనం ఆర్డర్‌ ఇచ్చిన వాళ్ళం... మరేమి లేదుకానీ... కరోనా అని ఎక్కువమంది బంధువులు రావడం లేదని సమాచారం ఇస్తున్నారు. వృధా అవ్వడం ఎందుకు.. వెయ్యిమందికి ఆర్డర్‌ ఇచ్చాం.. 500 మందికి సరిపోతుందిలే.. అంతగా తగ్గితే అప్పుడు చూసుకుందాం...’ అనే ఫోను రాని కేటరింగ్‌ యజమాని సోమ, మంగళవారాల్లో లేరంటే ఆశ్చర్యం లేదు..! కరోనా ప్రభావం పెళ్లి భోజనాలపైనా పడింది. ఈ నెలాఖరు వరకు శుభఘడియలు, వివాహాలు ఉన్నాయి. కల్యాణ మండపాలు అన్ని కళకళలాడుతున్నాయి.


అయితే ఊహించని విధంగా కరోనా ప్రభావంతో పరిస్థితులు తారుమారు అయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువమంది వివాహాలకు వచ్చేందుకు మక్కువ చూపడం లేదు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు రైళ్ళు, బస్సుల్లో వచ్చేటప్పుడు ఎక్కడ కరోనా ప్రభావానికి గురి కావాల్సి వస్తుందేమోనన్న ఆందోళనలో అన్ని రద్దు చేసుకున్నారు.  


విదేశీ వివాహాలు రద్దు..

విదేశాల్లో వరుడు లేదా వధువు లేదా ఇద్దరు ఉండి మన రాష్ట్రంలో వివాహాలు చేసుకోవాలనుకునే వారి పూర్తిగా రద్దయిపోయాయి. వివాహ సమయానికి 4 లేదా వారం రోజుల ముందు మాత్రమే అక్కడ నుంచి వస్తారు. ప్రస్తుతం వచ్చే పరిస్థితి లేదు.. ఒక వేళ వచ్చినా 14 రోజుల పాటు ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచడంతో వివాహ ముహూర్త సమయానికి కుదరదు. దీంతో ఏప్రిల్‌ 15 లోపు విదేశీయులతో వివాహ ముహూర్తాలు పెట్టుకున్న వారంతా రద్దు చేసుకుంటున్నారు. దీంతో అనేక కేటరింగ్‌, డెకరేషన్‌, వివాహ సంబంధ ఆర్డర్లు అన్ని రద్దు అయ్యాయి. 


తెలంగాణ వారితో మొదలైన పేచీ 

తెలంగాణ ప్రభుత్వం మార్చి 31 లోపు పెళ్ళిళ్ళపై ఆంక్షలు విధించింది. మార్చి 31 తరువాత వివాహాలను పూర్తిగా రద్దు చేసుకోవాలని కోరింది. కొందరు ఏపీలో వివాహం చేసుకుంటామని తెలంగాణ వారినే తరలిరమ్మని ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఓ పక్క కేంద్రం ఆదేశాలు, మరో పక్క మన సరిహద్దు రాష్ట్రాలన్నింటిలోను సెలవులు, నిషేధాలు కొనసాగడంతో ఏ క్షణానైన మన రాష్ట్రంలో కూడా నిషేదాజ్ఞలు విధించవచ్చని అప్పుడు మరలా పరిస్థితి మొదటికి వస్తుందని భావిస్తున్నారు. కొందరు కేవలం 50 మందితో ఏదైనా హోటల్‌లో వివాహ కార్యక్రమం ముగించుకుని పూర్తిగా కరోనా ప్రభావం తగ్గిన తరువాత భారీగా రిసెప్షన్‌ ఆలోచనలో ఉన్నారు. 


క్యాటరింగ్‌ వ్యాపారుల దిగాలు..

ప్రస్తుతం ముహూర్తాలు పూర్తిగా పుంజుకుని పుష్కలంగా ఆర్డర్లు పొందిన వేళ రద్దవుతున్న ఆర్డర్లతో క్యాటరింగ్‌ వ్యాపారులు నిరాశలోకి వెళ్లిపోతున్నారు.  కేవలం క్యాటరింగ్‌ ఒక్కటే కాదు.. పూలు, ట్రావెల్స్‌ వ్యాపారం పైన కూడా కరోనా ప్రభావం పడింది. ముందుగా బుక్‌ చేసుకున్న వారు కూడా రద్దు కోరడంతో అడ్వాన్స్‌లు ఇవ్వలేక అలాగని యజమానులతో గొడవలు పెట్టుకోలేక సతమతమవుతున్నారు. 


కొందరి ఆనందాలు..

మధ్య తరగతి కుటుంబాల్లో వివాహం అనేది భారమే.. అయినా తప్పనిసరి పరిస్ధితుల్లో ఆడంబరం చేస్తున్నారు.  ప్రస్తుతం వారికి కరోనా ప్రచారం కారణంగా ఖర్చు తగ్గుతోంది.

Updated Date - 2020-03-18T11:14:55+05:30 IST