పిడుగురాళ్ల, మంగళగిరిలో కలకలం
ABN , First Publish Date - 2020-04-28T09:47:16+05:30 IST
పిడుగురాళ్ల, మంగళగిరి ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు వెలుగుచూసినట్లు స్థానికంగా కలకలం రేగింది.

పిడుగురాళ్ల, మంగళగిరి టౌన్: పిడుగురాళ్ల, మంగళగిరి ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు వెలుగుచూసినట్లు స్థానికంగా కలకలం రేగింది. దాచేపల్లికి చెందిన ఓ వ్యక్తి 15 రోజుల క్రితం అనారోగ్య లక్షణాలు కనిపించాయి. పది కేసులతో దాచేపల్లిని రెడ్‌జోన్ చేయడంతో అతడు పిడుగురాళ్లలోని అత్తగారి ఇంటికి వెళ్లాడు. పట్టణంలోని ఓ వైద్యశాలలో చికిత్స పొందుతున్నా ఫలితం లేక పోవడంతో 16న వైద్యాధికారులు క్వారంటైన్‌కు తరలించారు.
వైద్య పరీక్షలు చేయగా పాజిటివ్‌గా రావడంతో అతడి అత్తావారి ఇంట్లో ఉన్న కుటుంబసభ్యులను సోమవారం అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. అతడి కుటుంబసభ్యులతో ఇటీవల కాంటాక్ట్ అయిన వారి వివరాల సేకరణతో పాటు సమీపంలోని వారికి వైద్య పరీక్షలు చేపట్టారు. అతడి నివాస ప్రాంతంలో ప్రత్యేక పారిశుధ్య చర్యలు తీసుకుని బారీకేడ్లు ఏర్పాటు చేశారు. ఈ చర్యలను ఆర్డీవో పార్థసారఽథి, తహసీల్దార్ భాస్కరరావు, కమిషనర్ వెంకటేశ్వర్లు, సీఐ రత్తయ్య పరిశీలించారు.
మంగళగిరి ఆటోనగర్‌లోని ఏపీఎంఎస్‌ఐడీసీ కార్యాలయంలో ఓ డ్రైవర్‌కు కరోనా లక్షణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిసింది. గత శుక్రవారం కార్యాలయ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించగా వీరిలో ఓ డ్రైవరుకు పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. ఆ డ్రైవరు విజయవాడకు చెందిన వ్యక్తి కావడంతో కృష్ణాజిల్లా వైద్య యంత్రాంగానికి అప్పగించారు. మిగిలిప సిబ్బందికి నెగెటివ్ రావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతానికి ఏపీఎంఎస్‌ఐడీసీ కార్యాలయాన్ని పూర్తిగా మూసివేశారు.