కార్పొరేట్లకు కేంద్రం ఊడిగం
ABN , First Publish Date - 2020-12-13T05:44:32+05:30 IST
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు.

మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన వామపక్షాలు
ఢిల్లీలో రైతులు చేపట్టిన ఉద్యమానికి మద్దతు
కాజ టోల్‌ప్లాజా వద్ద ఆందోళన
మంగళగిరి క్రైమ్, డిసెంబరు 12: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి వ్యతిరేకంగా చేసిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో రైతులు చేస్తోన్న ఆందోళనకు మద్దతుగా శనివారం మంగళగిరి మండలం కాజ టోల్‌ప్లాజా జాతీయ రహదారిపై వామపక్షాలు, రైతు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో దిగ్బంధన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ కార్పొరేట్లకు వ్యవసాయాన్ని అప్పగించేందుకే కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ బిల్లులను తీసుకువచ్చిందన్నారు. గత 17 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ మోదీ ప్రభుత్వం పట్టించుకోకుండా నిరంకుశత్వంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రిలయన్స్, అదాని కంపెనీలకు లాభాలు చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయని, కరోనా కష్టకాలంలో కూడా కార్పొరేట్లకు ఆదాయాలు పెరిగిపోతుండటమే ఇందుకు నిదర్శనమన్నారు. దేశంలో ఉన్న రైతు సంఘాలన్నీ వ్యవసాయ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే రాష్ట్రంలోని వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీ విధానాలను బలపరుస్తున్నాయని చెప్పారు. ఇప్పటికైనా ఆ మూడు పార్టీలు తమ వైఖరిని మార్చుకుని రైతాంగ ఉద్యమానికి మద్దతు పలకాలని కోరారు. సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ మాట్లాడుతూ రైతులు చేస్తున్న ఆందోళనకు ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు, డి.ఉమామహేశ్వరరావు, రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.కృష్ణయ్య, సీపీఎం నాయకులు రామారావు, నేతాజీ, జేవీ రాఘవులు, ఎం.రవి, బి.కోటేశ్వరి, అప్పారావు, రైతు సంఘ నేతలు శివ సాంబిరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్, నాయకులు చిన్ని తిరుపతయ్య, వై.అంకినీడు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాగా కాజ టోల్‌గేట్ వద్ద రాస్తారోకో చేపట్టిన వామపక్ష పార్టీల నేతలు, రైతు, ప్రజా సంఘాల నాయకులను రూరల్ సీఐ శేషగిరిరావు ఆధ్వర్యంలో అరెస్ట్ చేసి రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించి అనంతరం విడుదల చేశారు.