మమకారం.. మరిచారు

ABN , First Publish Date - 2020-12-31T05:27:23+05:30 IST

నలుగురు సంతానం.. 15 ఎకరాల ఆసామి.. అయినా ఇలా దిక్కులేకుండా చావుబతుకుల మధ్య కొట్టిమిట్టాడుతున్నాడు.

మమకారం.. మరిచారు
ఆశ్రమంలో అచేతనస్థితిలో ఉన్న గొల్లపూడి అంకమ్మ

ఆస్తులు పంచి అనాథగా మారిన తండ్రి 

అనారోగ్యంతో ఉన్నాడన్నా కనికరించని కుమారులు

చావుబతుకుల మధ్య మూడు నెలలుగా అనాథాశ్రమంలో ఆశ్రయం 

ప్రత్తిపాడు, డిశంబరు 30: నలుగురు సంతానం.. 15 ఎకరాల ఆసామి.. అయినా ఇలా దిక్కులేకుండా చావుబతుకుల మధ్య కొట్టిమిట్టాడుతున్నాడు. అయినా కుమారులుకాని, కుమార్తెలుకాని కనికరించడంలేదు. తండ్రి అనారోగ్యంతో ఉన్నాడన్నా మమకారం మరిచారు. ఎంతో ఉన్నతంగా బతికాడు. ఎందరో అభిమానాన్ని పొందిన ఆయన ప్రస్తుతం అనాథ  ఆశ్రమంలో చావు బతుకుల మధ్య కొట్టిమిట్టాడుతున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలు.. మండలంలోని బొర్రావారిపాలెం గ్రామానికి చెందిన గొల్లపూడి అంకమ్మ(94)కు ఇద్దరు మగ, ఇద్దరు ఆడపిల్లలు సంతానం. ప్రత్తిపాడు ప్రాంతంలో ఆయన తెలియని వారు లేరు. పూర్వీకులు నుంచి వచ్చిన రెండు ఎకరాలకుగాను రెక్కల కష్టంతో మరో 15 ఎకరాలు సంపాదించాడు. పిల్లలందరికీ పెళ్లిళ్లు చేసి వారికి ఆస్తి పంచి ఇచ్చాడు. ఇద్దరు కుమారులు గ్రామంలో ఉంటుండగా, కుమార్తెలు పక్క గ్రామాల్లో  ఉంటున్నారు. ఆస్తి పంచిన తర్వాత నుంచి కుమారులు పట్టించుకోలేదు. దీంతో ఆయన గుంటూరులోని మిత్రుడి కుమారులను ఆశ్రయించగా వారు ఓ గదిని ఇవ్వడంతో అక్కడే చాలాకాలం ఉన్నారు. అయితే కొంతకాలం క్రితం ఆయనకు ఆరోగ్యం దెబ్బతింది. దీంతో స్వగ్రామంలోని పిల్లల వద్దకు వచ్చారు.  రెండు రోజుల తరువాత తండ్రిని చూసే విషయంలో ఇద్దరు కుమారులు గొడవలు పడ్డారు. చివరకు గ్రామంలోని వృద్ధాశ్రమంలో తండ్రిని వదిలేశారు. రెండు రోజులని చెప్పి వెళ్లిన కుమారులకు  మూడు నెలలైనా తండ్రి విషయం గుర్తుకు రాలేదు. కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో ఆయన్ను వైద్యశాలలో చేర్పించి చికిత్స అందించాలని కుమారులకు  ఆశ్రమం నిర్వాహకుడు పొనకల శ్రీనివాస్‌ సూచించారు. అయినా వారు పట్టించుకోలేదు. ఆశ్రమంలో తోటి వృద్ధులే ఆయనకు సపర్యలు చేశారు. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా విషమించడంతో  ఆందోళన చెందుతున్నారు. ఇరుగుపొరుగు అయ్యో అంటున్నా.. రక్తం పంచుకుని పుట్టిన పిల్లలు తండ్రిని పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-12-31T05:27:23+05:30 IST