-
-
Home » Andhra Pradesh » Guntur » lock down in guntur
-
గుంటూరు.. లాక్
ABN , First Publish Date - 2020-04-07T10:02:51+05:30 IST
రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టం చేసేందుకు అధికార

నేటి నుంచి రాకపోకలు పూర్తిగా నిషేధం
గుంటూరు నలువైపులా శాశ్వత బారికేడ్‌లు
మూడు మార్గాల్లోనే నిత్యావసరాల వాహనాలకు అనుమతి
మరో రెండు పాజిటివ్ కేసులతో యంత్రాంగం అప్రమత్తం
గుంటూరు, ఏప్రిల్ 6: రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టం చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. దీనిలో భాగంగా గుంటూరు నగరాన్ని అష్టదిగ్బంధం చేస్తున్నారు. మంగళవారం నుంచి గుంటూరుతో బాహ్య ప్రపంచానికి భౌతిక సంబంధం లేకుండా కట్టడి చేస్తున్నారు. గుంటూరు నగరంలోకి రాకపోకలను పూర్తిగా నిషేధించారు. నిత్యావసర సరుకులు, పాలు, కూరగాయలు, మందులు వంటి వాహనాలకు మాత్రం మూడు మార్గాల్లో అనుమతి ఇవ్వనున్నారు.
జాతీయ రహదారి వైపు నుంచి వచ్చే ఎమర్జెన్సీ వాహనాలను పెదకాకాని వై జంక్షన్ మీద నుంచి గుంటూరులోకి పంపనున్నారు. సత్తెనపల్లి, నరసరావుపేట మీదగా వచ్చే వాహనాలను పేరేచర్ల వైపుగా, అమరావతి, తాడికొండ నుంచి వచ్చే వాహనాలను అమరావతి వైపు నుంచి అనుమతించనున్నారు. ఆస్పత్రులకు వెళ్లాల్సిన రోగులను కూడా ఈ మూడు మార్గాల్లోనే అనుమతించనున్నట్లు అర్బన్ పోలీస్ అధికారి, డీఐజీ రామకృష్ణ తెలిపారు.
సన్నిహితులకూ... వైరస్
ఇప్పటి వరకు ఢిల్లీ వెళ్లి వచ్చిన వారికి, కుటుంబ సభ్యులకు సోకిన వైరస్ తాజాగా వారితో సన్నిహితంగా ఉన్న వారికి సోకడంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. దీంతో మరింత కఠినంగా నిబంధనలు అమలు చేయకుంటే వైరస్‌ను కట్టడి చేయలేమంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు, వారి కుటుంబ సభ్యులు ఇంత వరకు ఎవరెవరితో సన్నిహితంగా ఉన్నారో వారంతా వైద్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. గుంటూరులో మంగళవారం మరో రెండు పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఆనందపేటకు చెందిన ముస్లిం మత పెద్ద ఢిల్లీ నిజాముద్దీన్‌కు వెళ్లక పోయినా పాజిటివ్ వచ్చింది. ఇతను ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిని కలిసినట్లు పోలీసులు గుర్తించారు.
దీంతో ఆ మత పెద్దతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్ చేశారు. ఆర్టీసీ కాలనీలో ఓ ఆర్‌ఎంపీ ఢిల్లీ వెళ్లలేదు. అయితే ఢిల్లీ వెళ్లి వచ్చిన ఇద్దరు ఆయనకు విందు ఇచ్చినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో వారి ద్వారానే ఆయనకు వైరస్ వచ్చి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్ చేశారు. బుచ్చయ్యతోటకు చెందిన మరొకరికి కూడా కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. ఢిల్లీ వెళ్లి వచ్చిన ఓ వ్యక్తి ఆయన ఇంటిలోనే అద్దెకు ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఆ నలుగురు పోలీసులకు నెగిటివ్
పాజిటివ్ వచ్చిన వ్యక్తితో విధి నిర్వహణలో భాగంగా మాట్లాడిన, కలిసి తిరిగిన నలుగురు పోలీసులకు కరోనా నెగిటివ్ వచ్చింది. దీంతో పోలీస్ యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. ఢిల్లీ వెళ్లి వచ్చిన శ్రీనివాసరావుతోటకు చెందిన ఓ లారీ యజమాని తన లారీలో దొంగతనం జరిగిందని ఈ నెల 18న నల్లపాడు స్టేషన్ సీఐ, రిసెప్షెనిస్ట్, ఏఎస్‌ఐతో మాట్లాడారు. క్లినర్‌పై అనుమానం వ్యక్తం చేయగా హెడ్ కానిస్టేబుల్ ఆయన వాహనంపై వెళ్లారు. ఆ తర్వాత నాలుగు రోజుల క్రితం ఆ లారీ యజమానికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలడంతో పోలీసులు ఉలిక్కి పడ్డారు. ఆ నలుగురు హోం క్వారంటైన్‌కు వెళ్లారు. వారి నమూనాలను పరీక్షలకు పంపగా నలుగురికి వ్యాధి సోకలేదని నెగిటివ్ వచ్చింది. దీంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.