వాయిదాపై వైసీపీ తీరు సిగ్గుచేటు

ABN , First Publish Date - 2020-03-16T07:21:44+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికలను కరోనావైరస్‌ ప్రభావంతో 6 వారాల పాటు వాయిదా వేసినట్లు ఎన్నికల కమిషనర్‌ రమేష్‌కుమార్‌ ప్రకటించటంతో వైసీపీ నాయకులు ఆ విషయాన్ని రాజకీయం చేయటం సిగ్గుచేటని, ఎన్నికల కమిషన్‌పైనే గౌరవంలేనివారు పాలన ఎలా సాగిస్తారని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ అన్నారు.

వాయిదాపై వైసీపీ తీరు సిగ్గుచేటు

ఎమ్మెల్యే అనగాని


రేపల్లె, మార్చి 15: స్థానిక సంస్థల ఎన్నికలను కరోనావైరస్‌ ప్రభావంతో 6 వారాల పాటు వాయిదా వేసినట్లు ఎన్నికల కమిషనర్‌  రమేష్‌కుమార్‌ ప్రకటించటంతో వైసీపీ నాయకులు ఆ విషయాన్ని రాజకీయం చేయటం సిగ్గుచేటని, ఎన్నికల కమిషన్‌పైనే గౌరవంలేనివారు పాలన ఎలా సాగిస్తారని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ అన్నారు.  స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిన్నటిదాకా ఎన్నికల కమిషన్‌ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నదని రాష్ట్రంలో శాంతియుతవాతావరణంలో ఎన్నికల నిర్వహణ జరుగుతోందని చెప్పిన వైసీపీ మంత్రులు ఒక్కసారిగా ఆయన సామాజిక కులాన్ని ఎత్తి మాట్లాడటం ప్రజలు గమనిస్తున్నారన్నారు. 


స్థానిక ఎన్నికల సందర్భంగా అల్లర్లు సృష్టించి టీడీపీ వర్గీయులపై పల్నాడు, కాళహస్తి, చిత్తూరు జిల్లాలో వైసీపీ నాయకులు దాడిచేస్తే నోరు విప్పని ముఖ్యమంత్రి ఒక్కసారిగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం చూస్తుంటే దాని వెనుక ఎంత కుట్రదాగి ఉందో అర్థమవుతోందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని పోలీసులే వైసీపీ నాయకులుగా ప్రవర్తిస్తూ సాక్ష్యాధారాలతో వీడియో ఫొటోలతో తెలిపినా వారిపై చర్యలు తీసుకోకపోవటం సిగ్గుచేటన్నారు. సమావేశంలో టీడీపీ జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావు, రాష్ట్ర చేనేత విభాగం కార్యదర్శి జీవీ నాగేశ్వరరావు, టీడీపీ న్యాయ సలహాదారు మేకా పూర్ణచంద్రరావు, ఏఎంసీ మాజీ చైర్మన్‌ పంతాని మురళీధరరావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-03-16T07:21:44+05:30 IST