నేతన్న నేస్తంలో.. కోతలు!

ABN , First Publish Date - 2020-06-22T10:04:56+05:30 IST

చేనేతలకు ప్రభుత్వం అందించే నేతన్న నేస్తం పథకంలో గతేడాది 1,921 మంది అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం జిల్లాలో

నేతన్న నేస్తంలో.. కోతలు!

గతేడాది లబ్ధిదారుల్లో 235 మంది తొలగింపు

2295 నూతన దరఖాస్తుదారుల్లో 113 మందికే అర్హత

సచివాలయాల్లో కనిపించని అర్హుల జాబితాలు


చేనేతకు చేయూత కొందరికే అందుతోంది.. జిల్లాలో చేనేత కార్మికులకు నేతన్ననేస్తం ద్వారా అందించే సాయంలో రెండోవిడత అర్హుల జాబితా చూస్తుంటే ఇదే విషయం స్పష్టమవుతోంది. జియోట్యాగింగ్‌ వంటి నిబంధనలతో కొంతమంది దూరంకాగా, కొత్త దరఖాస్తుల పరిశీలన ఆలస్యం కావడంతో మరికొంత మంది ఈ పథకానికి ఈ విడత దూరమయ్యారు.

 

గుంటూరు (తూర్పు), జూన్‌ 21: చేనేతలకు ప్రభుత్వం అందించే నేతన్న నేస్తం పథకంలో గతేడాది 1,921 మంది అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం జిల్లాలో షెడ్డుల్లో, ఇళ్ళ వద్ద ఉన్న దాదాపు 4వేల మగ్గాల్లో అధికారులు మరోసారి సర్వే నిర్వహించారు. షెడ్డు కార్మికులకు ఈ పఽథకం వర్తించకపోవడం, తండ్రీకొడుకులకు చేరోమగ్గం ఉండటం, జియోట్యాగింగ్‌ నిబంధనలు వంటి వివిధ కారణాలతో  235 మంది లబ్ధిదారులు పేర్లు  జాబితా నుంచి తొలిగించారు.  దీంతో ఈ విడత జాబితాలో 1,686 మంది మాత్రమే మిగిలారు. 


 కొత్తగా 113మంది..

 ఇదిలావుండగా ఈ సంవత్సరం  నేతన్న నేస్తం పథకానికి జిల్లాలో 2,295మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా అధికారులు దరఖాస్తులను పరీశీలించి 113మందిని  అర్హులుగా గుర్తించారు. దీంతో పాతవారిని కలుపుకొని మొత్తం 1,799మంది లబ్ధిదారులుగా ఎంపికయ్యారు. నూతన దరఖాస్తుల పరిశీలనలో జాప్యంతో ఎక్కువమంది ఈ పథకానికి దూరమయ్యారని, లేదంటే మరికొంతమందికి సాయం అందేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

  

20శాతం పైగా తొలగించడం అన్యాయం

 చేనేతకు గుర్తింపు తీసుకువచ్చిన జిల్లాలో నిబంధనల పేరిట దాదాపు 20శాతం మందికి పైగా కార్మికులను తొలగించడం అన్యాయం. ఇప్పటికే నిజమైన అర్హులుగా భావించే షెడ్డు కార్మికులను ఈ పఽథకం నుంచి తొలగించారు. ఇప్పడేమే జియోట్యాగింగ్‌ పేరిట మిగతావారిని కూడా తొలగిస్తున్నారు. దీనికితోడు చేనేతకు ప్రోత్సాహకంగా బడ్జెట్‌లో కేటాయింపులు జరపకపోవడం, నూతన దరఖాస్తులను పరిశీలించకపోవడం  వంటి నిర్ణయాలు నేత కార్మికుని మనుగడ ప్రశ్నార్ధకంగా మారుస్తున్నాయి.

 - పిల్లలమర్రి బాలకృష్ణ, రాష్ట్రప్రధాన కార్యదర్శి, చేనేత కార్మిక సంఘం 

Updated Date - 2020-06-22T10:04:56+05:30 IST