-
-
Home » Andhra Pradesh » Guntur » Lid of interstate and district boundaries
-
అంతర్ రాష్ట్ర, జిల్లా సరిహద్దుల మూత
ABN , First Publish Date - 2020-03-25T09:23:26+05:30 IST
కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌తో అంతర్ రాష్ట్ర, జిల్లా సరిహద్దులను పూర్తిగా మూసేశారు. అటు తెలంగాణ నుంచి, ఇటు జిల్లా సరిహద్దు ప్రాంతాల నుంచి రాకపోకలను పూర్తిగా నిషేధించారు.

ఇతర ప్రాంతాల నుంచి రాకపోకల నిషేధం
విజయపురిసౌత్, రేపల్లె, తాడేపల్లి టౌన్, మార్చి 24: కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌తో అంతర్ రాష్ట్ర, జిల్లా సరిహద్దులను పూర్తిగా మూసేశారు. అటు తెలంగాణ నుంచి, ఇటు జిల్లా సరిహద్దు ప్రాంతాల నుంచి రాకపోకలను పూర్తిగా నిషేధించారు. హైదరాబాద్ నుంచి సుమారు 200 బైకులు, 10 కార్లలో 500 మంది దాకా ప్రయాణికులు కరోనా వైరస్ దెబ్బకు బయపడి స్వగ్రామాలకు వచ్చేందుకు నాగార్జున సాగర్ విజయపురిసౌత్‌కు చేరుకున్నారు. వందలాది మంది ప్రయాణికులు ఒక్కసారిగా రావడంతో చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాలను నిలిపివేశారు. అనంతరం వారికి మాచర్ల రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి, తహసీల్దార్ వెంకయ్య, ఎస్‌ఐ పాల్ రవీందర్ తదితరులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంద్రవైపు పంపేది లేదని, హిల్‌కాలనీలోని తెలంగాణ చెక్‌పోస్టు వద్దకు పంపించారు.
అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ తిరిగి తెలంగాణ వైపు వెళ్లిపోయారు. కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలకు రాకపోకలకు అనుసంధానంగా ఉన్న పెనుమూడి- పులిగడ్డపై రాకపోకలను నిలిపివేశారు. అత్యవసర పరిస్థితులు ఉన్నవారికి మాత్రమే అనుమతించారు. రేపల్లె పట్టణ సీఐ ఎస్ సాంబశివరావు, ఎస్‌ఐ చరణ్‌లు కృష్ణా జిల్లా వైపు నుంచి వస్తున్న ప్రయాణికులకు అవగాహన కల్పించి తిప్పిపంపించారు. తాడేపల్లి ప్రాంతంలో ప్రకాశం బ్యారేజి, కనకదుర్గమ్మ వారధి వద్ద బ్యారికేడ్లు అడ్డుపెట్టి వాహన రాకపోకలను పోలీసులు నియంత్రిస్తున్నారు. అడపాదడపా పోలీసులకు, వాహనదారులకు మధ్య వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి.