పాజిటివ్‌లను పట్టేద్దాం

ABN , First Publish Date - 2020-04-15T09:38:55+05:30 IST

కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని జిల్లాలో భారీగా పెంచేందుకు అధికార

పాజిటివ్‌లను పట్టేద్దాం

కరోనా నిర్ధారణ పరీక్షల పెంపుదలపై యంత్రాంగం దృష్టి

గుంటూరులో ఆర్‌టీపీసీఆర్‌తో పాటు ట్రూనాట్‌ పరికరాలు 

రోజుకు సుమారు 3,800 వేల మందికి కరోనా వైరస్‌ పరీక్షలు 

ర్యాపిడ్‌ డయాగ్నస్టిక్‌ కిట్స్‌ వస్తే ఇంకా ఎక్కువగా ఫలితాలు వెల్లడి


గుంటూరు, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌  నిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని జిల్లాలో భారీగా పెంచేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు రియల్‌టైం పాలీమర్స్‌ చైన్‌ రియాక్షన్‌(ఆర్‌టీ పీసీఆర్‌) కిట్స్‌ ద్వారా రోజుకు 200 మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు జరుగుతోండగా దీనిని ట్రూ నాట్‌ పరికరాల ద్వారా 3,600 కలిపి 3,800 వేలకు చేర్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ట్రూనాట్‌లో పాజిటివ్‌ వస్తే వారికి మళ్లీ ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్ష నిర్వహించి వైరస్‌ నిర్ధారణ చేయాల్సి ఉంది. వీటికి అదనంగా ర్యాపిడ్‌ డయాగ్నస్టిక్‌ కిట్స్‌ తెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోన్నట్లు కలెక్టర్‌ ఇందుపల్లి శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ తెలిపారు. పరీక్షల నిర్వహణ సామర్థ్యం పెరిగితే పెండింగ్‌ రిపోర్టులు ఉండవని ఆయన స్పష్టం చేశారు.


కరోనా వైరస్‌ వ్యాప్తి చెందడం ప్రారంభించినప్పుడు జిల్లాలో ఒక్క ఆర్‌టీ పీసీఆర్‌ కిట్‌ కూడా లేదు. దీంతో ఇక్కడి నుంచి నిర్ధారణ కోసం విజయవాడ, తిరుపతి, విశాఖపట్టణం ల్యాబ్‌లకు పంపేవారు. అంతేకాకుండా పూణేలో ఉన్న ల్యాబ్‌కి కూడా పంపించి నిర్ధారించేవారు. అయితే వైరస్‌ వ్యాప్తి వేగవంతంగా జరుగుతోండటంతో స్థానికంగానే పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా ఆర్‌టీ పీసీఆర్‌ పరికరాన్ని తెప్పించారు. వీటిపై రోజుకు 200 మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయొచ్చు.


అయితే పాజిటివ్‌ కేసులు 109కి చేరుకోవడం వల్ల వారి కాంటాక్ట్స్‌ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వారిని గుర్తించి అందరికీ పరీక్షలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ట్రూ నాట్‌ కిట్‌లు 18 జిల్లాకు తెప్పించారు. వీటిని గుంటూరు, తెనాలి, నరసరావుపేట, మాచర్లలో అందుబాటులో ఉంచి ఒక్కొక్క దానిపై రోజుకు 200 మందికి పరీక్ష చేసేందుకు నిర్ణయించారు. దీని వలన వ్యాధి నిర్ధారణ త్వరితగతిన జరుగుతుంది. ట్రూనాట్‌ పరీక్షల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తే వారికి పీసీఆర్‌ పరీక్ష నిర్వహించి నిర్ధారిస్తారు.


ట్రూనాట్‌లో నెగెటివ్‌ వస్తే వారికి పీసీఆర్‌ పరీక్ష నిర్వహించాల్సి అవసరం ఉండదు. దీని వల్ల క్వారంటైన్‌లో ఉన్న వందల మందికి వేగవంతంగా పరీక్షలు నిర్వహించి ఫలితాలు విశ్లేషించవచ్చు. అనుమానితులకు 28 రోజుల వ్యవధిలో నాలుగుసార్లు పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ అయిన దృష్ట్యా ట్రూనాట్‌ కిట్‌లు ఉపయోగపడతాయని అధికారవర్గాలు భావిస్తోన్నాయి. ర్యాపిడ్‌ డయాగ్నస్టిక్‌ కిట్స్‌ వస్తే పరీక్షల నిర్వహణలో జాప్యం అనేది లేకుండా పోతుందని చెబుతోన్నాయి. 

Updated Date - 2020-04-15T09:38:55+05:30 IST