లే.. అవుట్!
ABN , First Publish Date - 2020-12-04T05:26:44+05:30 IST
నరసరావుపేటలో రియల్ అక్రమాలకు అధికారులు చెక్ పెడుతున్నారు.

నరసరావుపేటలో రియల్ అక్రమాలకు చెక్
అవి అక్రమ లేఅవుట్లు అంటూ బోర్డులు..
వెంచర్ వేసిన వారికి నోటీసులు జారీ
ఎట్టకేలకు చర్యలు చేపట్టిన రెవెన్యూ, పంచాయతీ అధికారులు
నరసరావుపేట, డిసెంబరు 3: నరసరావుపేటలో రియల్ అక్రమాలకు అధికారులు చెక్ పెడుతున్నారు. పైసలిచ్చుకో.. ప్లాట్లు వేసుకో అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో వెలువడిన కఽథనంపై సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్‌కుమార్ స్పందించారు. ఆమె ఆదేశాలతో రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు కదిలారు. ఇది అక్రమ లేఅవుట్ అని తెలియజేస్తూ లింగంగుంట పరిధిలోని రియల్ వెంచర్ల వద్ద గురువారం అఽధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు. ఇదే తరహాలో అన్ని ప్రాంతాల్లోని అనధికార వెంచర్లకు రెండ్రోజుల్లో బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పుష్పగిరి పీఠానికి సంబంధించిన భూముల్లో లింగంగుంట పంచాయతీ పరిధిలో లేఅవుట్ వేసి అక్రమాలకు పాల్పడుతున్నారు. అగ్రహారం భూముల్లో వేసిన లేఅవుట్లకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వబోదని అధికారులు స్పష్టంచేసినా, అప్పటికే ఈ భూముల్లో రియట్ వెంచర్లు వెలిశాయి. లింగంగుంట్ల, పాలపాడు రోడ్డు, రావిపాడు, ఇస్పపాలెం, ములకలూరు, అల్లూరివారిపాలెం, ఇక్కుర్రు, కేసానుపల్లి, పల్నాడు రోడ్లలో పెద్దఎత్తున అక్రమ లేఅవుట్లు ఏర్పాటయ్యాయి. వీటికి సంబంధించి భూమార్పిడి కూడా జరగలేదు. ఇష్టారాజ్యంగా వెంచర్లు ఏర్పాటు చేయడంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా ప్రహరీలు కూడా నిర్మించారు. కాగా పైసలిచ్చి అక్రమ లేఅవుట్లు వేసిన స్థిరాస్థి వ్యాపారులు ఈ బోర్డుల ఏర్పాటుతో కంగుతింటున్నారు. తమ వెంచర్లలో అటువంటి బోర్డులు పెట్టకుండా అడ్డుకునేందుకు అధికార పార్టీ ముఖ్యనేతలతో పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. వెంచర్ల ఏర్పాటుకు ఎకరాకు రూ.2 లక్షల వరకు లంచాలిచ్చామని ఇప్పుడు బోర్డులు ఎలా పెడతారని కొందరు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. లింగంగుంట గ్రామ సచివాలయంలో తహసీల్డారు ఆర్వీ రమణానాయక్ గురువారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ అక్రమ లేఅవుట్ వేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కొనుగోలుదారులు బ్రోకర్ల మాటలు విని మోసపోవద్దన్నారు. కన్వర్షన్ చేయని వ్వవసాయ భూముల్లో అనధికారిక లేఅవుట్లు వేయరాదన్నారు. వీటి పర్యవేక్షణకు వలంటీర్లతో నాలుగు బృందాలను నియమించినట్లు చెప్పారు.