మహిమాన్విత క్షేత్రం... కోటప్పకొండ

ABN , First Publish Date - 2020-02-19T08:05:04+05:30 IST

హర హర చేదుకో కోటయ్యా... చేదుకోవయ్యా... అని భక్తి సమ్మిళిత ఆర్తితో పిలవగానే కాలకూటంలాంటి పాపాలనెన్నింటినైనా హరించి భక్తులకు ఇహ, పర సౌఖ్యాలను

మహిమాన్విత క్షేత్రం... కోటప్పకొండ

  • 21న త్రికోటేశ్వరస్వామి తిరునాళ్ళ
  • శ్రీ ఓం నమః ప్రణవార్ధాయ శుద్ధ జ్ఞానైక మూర్త్తయే 
  • నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః 


హర హర చేదుకో కోటయ్యా... చేదుకోవయ్యా... అని భక్తి సమ్మిళిత ఆర్తితో పిలవగానే కాలకూటంలాంటి పాపాలనెన్నింటినైనా హరించి భక్తులకు ఇహ, పర సౌఖ్యాలను ప్రసాదించే ప్రత్యక్షదైవం త్రికోటేశ్వరస్వామి. భక్తులకు కోటయ్యస్వామి కొంగుబంగారం. ఎందరో యోగులకు, దేవతలకు జ్ఞ్ఞానోపదేశం చేసిన మహిమాన్విత క్షేత్రమే కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి సన్నిధి. 


కోటప్పకొండ (నరసరావుపేట), ఫిబ్రవరి 18: కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి సన్నిధిలో మహాశివరాత్రినాడు భక్తజనుల జాగరణతో దేదీప్యమాన విద్యుత్‌కాంతులు, ప్రభలతో కనులపండువగా సాగే కోటయ్య తిరునాళ్ళ దేశప్రసిద్ధి గాంచింది. ఈనెల 21న (శుక్రవారం) త్రికోటేశ్వరస్వామి తిరునాళ్ళ అత్యంతవైభవంగా జరగనున్నది. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి.

                    

క్షేత్ర పురాణం...

 సర్వచరాచర సృష్టికి లయకారుడైన పరమేశ్వరుడు దక్ష యజ్ఞ విధ్వంసం అనంతరం శాంతించి దక్షణామూర్తి స్వరూపంలో కోటప్పకొండపై అవతరించాడు. శివుడు 12 ఏళ్ళ వటువుగా మారి బ్రహ్మచర్యానికి పూనుకొని కైలాసంలో సమాధి నిష్టుడైవున్న తరుణంలో బ్రహ్మాదులు ఆ దక్షిణామూర్తిని బ్రహ్మోపదేశం చేయమని కోరారు. ఇందుకు పరమేశ్వరుడు సమ్మతించి త్రికూటాద్రి వచ్చి బ్రహ్మోపదేశం చేసినందున కోటప్పకొండ మహాపుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్నది. కోటప్పకొండ మూడుశిఖరాలు కలిగి ఉండటంతో త్రికూట పర్వతమని, ఇక్కడ స్వామిని త్రికోటేశ్వరుడని పిలుస్తారు. బ్రహ్మ, విష్ణు, రుద్ర శిఖరాలే ఈ మూడు కూఠాలు. రుద్ర శిఖరం మీద దక్షిణామూర్తి యోగ నిష్టతో బ్రహ్మాదులకు బ్రహ్మోపదేశం చేశారు. అక్కడే పాత కోటేశ్వర ఆలయం ఉంది. పక్కన ఉన్న విష్ణుశిఖరం మీద విష్ణువు శివుని గురించి తపస్సు చేయగా శివుడు ప్రసన్నుడై త్రిశూలంతో రాతి పై పొడవగా జలం ఉద్భవించిన చోట పాప వినాశేశ్వరస్వామి ఆలయం నిర్మించారు. రుద్రశిఖరానికి కింద నైరుతీభాగంలో బ్రహ్మశిఖరం ఉంది. బ్రహ్మ శివుడు గురించి తపస్సు చేయగా పరమేశ్వరుడు జ్యోతిర్లింగంగా వెలసిన చోట ప్రస్తుత కోటేశ్వర ఆలయం రూపుదిద్దుకుంది. కోటప్పకొండకు ఉత్తరంగా యలమందల గ్రామంలో మునులు గుంపులుగా ఉండేవారు. అందువల్ల యలమంద కోటేశ్వరుడు అని కూడా అంటారు. కోటప్పకొండ ఎత్తు 1587 అడుగులు. కాగా ఆరు వందల అడుగుల ఎత్తులో త్రికోటేశ్వరస్వామి దేవాలయం ఉంది. 


కల్యాణోత్సవాలు జరగవు...ధ్వజస్తంభం ఉండదు 

సదాశివుని అనుగ్రహానికి బ్రహ్మ, విష్ణు, సకల దేవతలు, ఋషులు స్వామికటాక్షం కొరకు కొండపై తపమాచరించి ప్రసన్నునిగా స్వామిని దర్శించుకొని జ్ఞానదీక్ష పొందినటు వంటి మహాక్షేత్రం కోటప్పకొండ. అందువల్లే ఈ క్షేత్రం మహాపుణ్యక్షేత్రమైంది. బ్రహ్మచారి అయిన దక్షిణామూర్తి క్షేత్రం కావటం వలన ఇక్కడ కల్యాణోత్సవాలు జరగవు. ధ్వజస్తంభం కూడా వుండదు. మూడు శిఖరాలకు బ్రహ్మ, విష్ణు, రుద్ర శిఖరాలు అని పిలుస్తారు. బ్రహ్మ శిఖరం పై బ్రహ్మ నివశించాడని ప్రతీతి. జ్యోతిర్లింగం ఈ ప్రాంతంలో లేకపోవటంచేత బ్రహ్మ ఈశ్వరుని గురించి తపస్సు చేయగా అప్పుడు స్వామి ప్రత్యక్షమై బ్రహ్మ కోరిక తీర్చేందుకు జ్యోతిర్లింగంగా ఈశ్వరుడు వెలిశాడు. ఆ జ్యోతిర్లింగమే భక్తుల పూజలందుకుంటున్న కోటేశ్వర లింగం. 


యలమందల నివాసి సాలంకయ్య అనే భక్తుడు రుద్ర శిఖరంమీద ఉన్న శివలింగానికి పూజలు చేసేవాడు. ఒకనాడు ఓ జంగమ దేవర ప్రత్యక్షమై సాలంకయ్య ఇంటికి వెళ్ళాడు. కొన్నాళ్ళు ఉండి జంగమదేవర హఠాత్తుగా మాయం కావటంతో చింతించిన సాలంకయ్య అన్నపానాలు మాని వేశాడు. కోటప్పకొండకు దక్షిణంగా ఉన్న కొండకావూరు ఆనందవల్లి అనే గొల్లభామ జన్మించిన నాటినుంచి ఆ ఇంట్లో సిరులు పండాయి. ఆమె పరమశివ భక్తురాలై విభూది రుద్రాక్షలు ధరించి శివస్తోత్రం జపిస్తూ పాతకోటేశ్వరుని కొండ మీద స్వామిని పూజించింది. ఒక మహాశివరాత్రి నాడు ఓగేరు నదిలో స్నానంచేసి రుద్రశిఖరంలోని బిల్వవనంలో దక్షిణామూర్తి రూపంలో ఉన్న కోటయ్యస్వామిని ఆమె పూజించి తపం ఆచరించింది. అంతట జంగమయ్య ప్రతక్ష్యం కావటంతో నిత్యపూజలు చేయటం ప్రారంభించింది. ఈ వృత్తాంతం సాలంకయ్యకు తెలిసి అక్కడికివెళ్ళగా జంగమయ్య మౌనం వహించటం జరిగింది. వేసవిలో కూడా ఆనందవల్లి పూజలు ఆపకుండా పాప వినాశన దోన వద్దకు వెళ్ళి తీర్ధం రుద్రశిఖరానికి తెచ్చి జంగమయ్యకు అభిషేకాధి పూజలు చేసింది. 

               

కాకులు సంచరించని కొండ... కోటప్పకొండ 

ఒకనాడు తీర్థం తెచ్చి పెట్టి మారేడు దళాల కోసం వెళ్ళగా కాకి ఒకటి ఆ తీర్థాన్ని నేలపాలు చేసింది. అంతట కోపగించిన గొల్లభామ శపించిన కారణంగా కొండపై కాకులు వాలవు. అప్పటినుంచి కొండ ప్రాంతంలో కాకుల సంచారం లేకుండా పోయింది. ఆనందవల్లిని పరీక్షించేందుకు ఆ జంగమయ్య ఎన్నివిధాలా కష్టపెట్టినప్పటికి పూజలు మాననందున మీ ఇంటికి వస్తాను. అక్కడే వ్రతం ఆచరించమని జంగమయ్య ఆమె వెనుక బయలుదేరాడు. ఎలాంటి పరిస్థితుల్లో వెనుదిరిగి చూడవద్దని చెప్పగా అలాగేనంటూ ఆమె బయలు దేరింది. ప్రళయధ్వనులకు తాళలేక బ్రహ్మశిఖరం వద్ద ఆమె నిబ్బరం కోల్పోయి వెనుదిరిగి చూడటంతో జంగమయ్య అక్కడే శిలగా మారాడు. ఆనందవల్లి కూడా శిలగా మారి పోయింది. జంగమయ్య శిలగా మారినచోటే త్రికోటేశ్వర స్వామి ఆలయం ఉంది. త్రికోటేశ్వరస్వామి, గొల్లభామ ఆలయాన్ని సాలంకయ్య నిర్మించినట్టు పురాణం తెలియ జేస్తుంది. 


త్రికోటేశ్వరస్వామి దేవాలయానికి కొంచెం దిగువన ఆనందవల్లి గుడి ఉంది. భక్తకోటి ముందుగా గొల్లభామను దర్శించి ఆ తరువాత కోటయ్యస్వామిని పూజిస్తుంటారు. శ్రావణమాసంలో రుద్రశిఖరం పైన, కార్తీకమాసంలో విష్ణు శిఖరంపైన మహాలింగార్చనచేసి ప్రభలు కట్టి వేడుకలు జరిపి అన్నదానం చేసినవారికి మోక్షం సిద్ధిస్తుందని స్థల పురాణంలో ఉంది. 11వ శతాబ్దినాటికే ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టు పురాతనశాసనాలు తెలియజేస్తున్నాయి. ఈ క్షేత్రం చోళరాజులకు పూర్వంనుంచి ప్రసిద్ధికెక్కి ఉండటంతో వెయ్యి ఏళ్ళకు పైగా చరిత్ర ఉందని భావిస్తున్నారు. కొండ దిగువన ఉన్న బొచ్చు కోటేశ్వరస్వామి ఆలయంలో మొక్కుబడులు ఉన్నవారు తలనీలాలు సమర్పిస్తారు. కొండకింద ప్రసన్న కోటేశ్వరుడు, నీలకంటేశ్వరస్వామి ఆలయాలు ఉన్నాయి. సోపానమార్గం గాలిగోపురం పక్కన విఘ్నేశ్వరస్వామి ఆలయం ఉంది. ఘాట్‌రోడ్డు నిర్మాణంతో ఈ క్షేత్రానికి వచ్చే భక్తులసంఖ్య నానాటికి పెరుగుతున్నది. కోటప్పకొండ నరసరావుపేట పట్టణానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. నరసరావుపేట, చిలకలూరిపేట పట్టణాల నుంచి కోటప్పకొండకు మార్గాలు ఉన్నాయి. 

Updated Date - 2020-02-19T08:05:04+05:30 IST