-
-
Home » Andhra Pradesh » Guntur » kotappakonda
-
రేపు త్రికోటేశ్వరుని ఆరుద్రోత్సవం
ABN , First Publish Date - 2020-12-28T05:35:19+05:30 IST
ప్రసిద్ధ శైవక్షేత్రం కోటప్పకొండ శ్రీత్రికోటేశ్వరస్వామి ఆరుద్రోత్సవం 29న మంగళవారం వైభవంగా జరగనుంది. ఇందుకోసం దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తోది. కోటయ్య స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించనున్నారు.

విశేష అభిషేకాలకు విస్తృత ఏర్పాట్లు
కోటప్పకొండకు తరలి రానున్న మాల ధారణ స్వాములు
నరసరావుపేట, డిసెంబరు 27: ప్రసిద్ధ శైవక్షేత్రం కోటప్పకొండ శ్రీత్రికోటేశ్వరస్వామి ఆరుద్రోత్సవం 29న మంగళవారం వైభవంగా జరగనుంది. ఇందుకోసం దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తోది. కోటయ్య స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించనున్నారు. వివిధ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో మేథా దక్షిణామూర్తి మాలధారణ స్వాములు ఆరుద్రోత్సవానికి తరలి రానున్నారు. అర్థరాత్రి 12 గంటలకు భక్తులు జ్యోతి దర్శనం చేసుకుంటారు.
త్రికోటేశ్వర స్వామిని మేథా దక్షిణామూర్తిగా కూడా భక్తులు కొలుస్తారు. కోటి వరాల దీక్ష కోటప్పకొండ దీక్ష అనే సంకల్పంతో మేథాదక్షిణామూర్తి మాలను భక్తులు ధరిస్తారు. కోటప్పకొండలో 1981 నుంచి కోటయ్య స్వామి మాలధారణ ప్రారంభమైంది. జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు కోటప్పమాలను ధరించి 41 రోజులు మండల దీక్షను భక్తి శ్రద్ధలతో చేపడతారు. అర్థ మండల దీక్షతోపాటు 11 రోజుల మాలధారణ కూడా స్వాములు చేపడతారు. ఆరుద్రోత్సవం సందర్భంగా కోటయ్య స్వామికి స్వాములు ఇరుముడి సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇరుముడిని స్వాములు తలపై ధరించి నరసరావుపేట, చిలకలూరిపేట ప్రాంతాల నుంచి పాదయాత్రగా కోటప్పకొండ చేరుకుంటారు.
ఆరుద్రోత్సవం సందర్భంగా స్వామికి వివిధ ద్రవ్యాలతో విశేష అభిషేకాలు నిర్వహించారు. జ్యోతిదర్శనం అనంతరం త్రికోటేశ్వరస్వామికి మహన్యాస పూర్వక మహారుద్రాభిషేకం జరగనుంది. వీభూది, గంధం, కుంకం, పంచదార, వివిధ రకాల ఫలాలు, ఎండు ఫలాలు, ఆవు నెయ్యి, పెరుగు, తేనె, పాలు తదితర ద్రవ్యాలతో స్వామికి ఘనంగా అభిషేకాలు నిర్వహిస్తారు. తదుపరి స్వామికి అన్నాభిషేకం చేస్తారు. అర్థరాత్రి నుంచి తెల్లవార్లు ఆలయంలో మహన్యాస పూర్వక మహా రుద్రాభిషేకాలు ఘనంగా జరుగుతాయి. అభిషేకాల అనంతరం స్వాములు మాలాధారణలు విరమిస్తారు. బుధవారం ఉదయం 8 గంటలకు యాగశాలలో లక్ష్మీగణపతి, రుద్రహోమాలు జరగనున్నాయి.
మేథాదక్షిణామూర్తి స్వాములకు ప్రసాదం, భోజన సౌకర్యాలు ఆలయ ప్రాంగణంలో దాతల సహకారంతో ఏర్పాటు చేస్తున్నట్టు ఈవో రామ కోటిరెడ్డి తెలిపారు. దాతలు నరసరావుపేట స్వాతి మెడికల్ ఏజెన్సీస్ తాళ్ళ వెంకట కోటిరెడ్డి, సీకో బయోటిక్స్ విజయవాడ శీలం జయ రామిరెడ్డి, శీలం రామ సంజీవరెడ్డి, నరసరావుపేట శివశక్తి పోల్స్ ఇండస్ట్రీస్ అల్లు రమేష్ భోజన వసతి కల్పిస్తున్నారని చెప్పారు. ఆరుద్రోత్సవ పూజలు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించనున్నట్టు ఈవో తెలిపారు.