హోరాహోరీగా కోడిపోరు

ABN , First Publish Date - 2020-12-17T06:26:50+05:30 IST

పల్నాటి వీరారాధన ఉత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన కోడిపోరును బుధవారం వీర్లదేవాలయ ప్రాంగణంలో తిలకించడానికి పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు.

హోరాహోరీగా కోడిపోరు
కోడిపోరులో ఎమ్మెల్యే పీఆర్కే

బ్రహ్మనాయుడు కోడిని చేపట్టిన ఎమ్మెల్యే పీఆర్కే



కారంపూడి, డిసెంబరు 16: పల్నాటి వీరారాధన ఉత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన కోడిపోరును బుధవారం వీర్లదేవాలయ ప్రాంగణంలో తిలకించడానికి పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు. ప్రభుత్వ విప్‌, మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రహ్మనాయుడు కోడిన చేపట్టగా, వైసీపీ కన్వీనర్‌ కొంగర సుబ్రహ్మణ్యం నాయకురాలు నాగమ్మ కోడిని చేపట్టారు. దేవాలయ ప్రాంగణంలో  బారికేడ్లు ఏర్పాటు చేసి కోడిపందాల నిర్వహణకు గురజాల రూరల్‌ సీఐ ఉమేష్‌కుమార్‌, నలుగురు ఎస్‌ఐలు బందోబస్తు ఏర్పాటు చేసినా ప్రజల తాకిడిని నిరోధించడం కష్టమైంది. పీఠాధిపతి తరుణ్‌ చెన్నకేశవ అయ్యవారు వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన కొణతములతో కోడిపోరు ఘట్టం ప్రదేశానికి చేరుకున్నారు. వీరవిద్యావంతులు కోడిపోరు ఘట్టాన్ని గానంచేయగా, బ్రహ్మనాయుడు కోడి చిట్టిమల్లును, నాగమ్మ కోడిని తొలి పందెం వేశారు. తొలి, మలి పందాలలో బ్రహ్మనాయుడు కోడి గెలువగా, మూడో పందెంలో నాగమ్మ కోడి గెలిచినట్లు నాటకీయంగా నిర్వహించారు. అనంతరం పీఠాధిపతిని ఎమ్మెల్యే పీఆర్కే సన్మానించారు.  కార్యక్రమంలో వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, తురకా కిషోర్‌, గ్రామ పెద్దలు నరసరావుపేట ప్రముఖ వైద్యుడు సుధీర్‌ భార్గవరెడ్డి, మాజీ ఎంపీపీ పంగులూరి వెంకట నరసయ్య, సొసైటీ చైర్మన్‌ బొమ్మిన అల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-17T06:26:50+05:30 IST