పొంచి ఉన్న కరోనా రెండో దశ

ABN , First Publish Date - 2020-11-26T04:52:34+05:30 IST

కరోనా కేసులు ప్రస్తుతం తగ్గుముఖం పట్టినా రెండో దశ ప్రమాదం పొంచి ఉందని కలెక్టర్‌ ఆనంద్‌కుమార్‌ తెలిపారు.

పొంచి ఉన్న కరోనా రెండో దశ
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

ప్రార్థన స్థలాల్లో అప్రమత్తంగా ఉండాలి

కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ ఆదేశాలు

గుంటూరు, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): కరోనా కేసులు ప్రస్తుతం తగ్గుముఖం పట్టినా రెండో దశ ప్రమాదం పొంచి ఉందని కలెక్టర్‌ ఆనంద్‌కుమార్‌ తెలిపారు. వైరస్‌ నివారణ, ముందస్తు జాగ్రత్తలపై మతపెద్దలతో బుధవారం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరిగిన సమావేశంలో కలెక్టర్‌ ప్రసంగించారు. ప్రస్తుతం అన్ని రంగాలు ప్రారంభించడం వల్ల రెండో దశ మొదటి దాని కంటే పది రెట్లు అధికంగా ఉండే ప్రమాదం ఉందన్నారు. అప్రమత్తంగా లేకపోతే కొవిడ్‌-19 వ్యాప్తిని అదుపు చేసే అవకాశం ఉండదన్నారు. ఈ నేపథ్యంలో ప్రతీఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. మాస్కులు, శరీర ఉష్ణోగ్రత తనిఖీ, చేతుల శానిటైజ్‌, భౌతికదూరం తదితర నిబంధనలను దేవాలయాలు, మసీదులు, చర్చిల నిర్వాహకులు పక్కాగా అమలు చేయాలన్నారు. కరోనా వైరస్‌ నిబంధనలను పాటించని ప్రార్థనా స్థలాల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో జేసీలు పీ ప్రశాంతి, కే శ్రీధర్‌రెడ్డి, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. 

 

Read more