జగన్‌ది అనుభవరాహిత్యం
ABN , First Publish Date - 2020-03-02T12:17:48+05:30 IST
అహంకారంతో, అనుభవరాహిత్యంతో ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేశారని మాజీమంత్రి నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు.

- మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు ధ్వజం
గుంటూరు(తూర్పు): అహంకారంతో, అనుభవరాహిత్యంతో ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేశారని మాజీమంత్రి నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. రాజధాని తరలింపునకు నిరసనగా అమరావతి పరిరక్షణసమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట జేఏసీ నేతలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం 64 వరోజుకు చేరుకున్నాయి. దీక్షలను ప్రారంభించిన ఆనందబాబు మాట్లాడుతూ రాజధాని మార్పు నిర్ణయం రాష్ట్రానికి శాపంగా మారిందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన 8 నెలలకే ముఖ్యమంత్రి రూ 46,500 కోట్లు అప్పు చేయడమేగాక, రూ.34,700 కోట్లు రెవెన్యూ లోటులోకి రాష్ట్రంను తీసుకువెళ్ళారని ఆరోపించారు. పాదయాత్ర సమయంలో ధరలు పెంచనని చెప్పి, ఇప్పుడు మాత్రం విద్యుత్, బస్ ఛార్జీలు పెంచి పేదోడి నడ్డివిరుస్తున్నారని మండిపడ్డారు. గతంలో తన తండ్రి మరణానికి అంబానీయే కారణమన్న జగన్ ఇప్పుడు ఏం ఆశించి ఆయనతో చేతులు కలుపుతున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, మాకినేని రత్తయ్య, మన్నవ సుబ్బారావు, పీఆర్ మోహన్, మద్దిరాల మ్యానీ తదతరులు పాల్గొన్నారు. దీక్షలలో ఘంటసాల సోమశేఖర్, మన్నవ వంశీకృష్ణ, నిమ్మగడ్డ శ్రీనివాసరావు, సూరె శ్రీనివాసరావు, ధర్మతేజ, చిన్నా, మోదీన్, సాంబయ్య, రజాక్, శౌరి, శ్రీనివాసు, కోటేశ్వరరావు, మల్లికార్జునరావు, సురేష్ ఇతర జేఏసి నేతలు పాల్గొన్నారు.