-
-
Home » Andhra Pradesh » Guntur » HOME TO HOME SURVEY FOR CORONA SUSPECTS
-
కరోనా అనుమానితుల కోసం ఇంటింటి సర్వే
ABN , First Publish Date - 2020-03-23T08:06:12+05:30 IST
కోవిడ్-19 ప్రపంచ మహమ్మారిగా రూపుదాల్చింది. కరోనా వైరస్ తీవ్రతను తొలిసారిగా సరిగ్గా అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎట్టకేలకు వ్యాధి నివారణకు కఠిన చర్యలకు...

- విదేశాల నుంచి వచ్చిన వారి ఇళ్లకు వైద్యాధికారులు
- జిల్లాలో ర్యాపిడ్ సర్వే నిర్వహించిన ఆరోగ్య శాఖ
- హోం క్వారంటైన్‌లో ఉన్న వారిని మూడు కేటగిరీలుగా గుర్తింపు
- రెండు, మూడు కేటగిరీల్లో ఉంటే ఐసొలేషన్ వార్డులకు తరలింపు
గుంటూరు (మెడికల్), మార్చి 22: కోవిడ్-19 ప్రపంచ మహమ్మారిగా రూపుదాల్చింది. కరోనా వైరస్ తీవ్రతను తొలిసారిగా సరిగ్గా అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎట్టకేలకు వ్యాధి నివారణకు కఠిన చర్యలకు దిగుతోంది. ఇప్పటి వరకు మన వరకు కరోనా వైరస్ పెద్దగా రాలేదని భావించిన ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా వైరస్ బాధితులను చూసి యుద్ధ ప్రాతిపదికన కట్టడి చర్యలకు దిగింది. ప్రధానంగా కరోనా వైరస్ విదేశాల నుంచి స్వస్థలాలకు వస్తున్న వారి ద్వారా రాష్ట్రంలో వెలుగు చూస్తోంది. ఇప్పటి వరకు ఇలా వచ్చిన వారిని కేవలం వారి ఇళ్లల్లోనే హోం ఐసొలేషన్‌లో ఉంచారు. వీరు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు. ఈ విషయం గతంలోనే ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. హోం క్వారంటైన్‌లో ఉన్న వారి వద్దకు వైద్య సిబ్బంది వెళ్లి స్వయంగా వారి ఆరోగ్య పరిస్థితి పరిశీలించాలని తీర్మానించారు. ఏమాత్రం కరోనా వైరస్ లక్షణాలు ఉన్నా వెంటనే వారిని దగ్గరలో ఉన్న కోవిడ్-19 ఐసొలేషన్ వార్డుకు తరలించాలని నిర్ణయించారు. బాధితులను పరీక్షించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా వైద్య బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కొక్క బృందంలో వైద్యాధికారి, ఎమ్మార్వో, ఎండీవో, ఎస్‌ఐ తదితరులు ఉంటారు. ఒక వైపు జనతా కర్ఫ్యూ జరుగుతు ఉండగానే, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ బృందాలు జిల్లావ్యాప్తంగా క్షేత్రస్ధాయిలో సర్వే నిర్వహించాయి. విదేశాల నుంచి వచ్చిన వారి ఆరోగ్య స్థితిని పరిశీలించాయి.
మూడు కేటగిరీలుగా విభజన...
ప్రధానంగా కోవిడ్-19 విదేశాల నుంచి వచ్చిన వారితో, విదేశీయుల నుంచి మన దేశంలో వ్యాప్తి చెందుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని కొద్ది రోజులుగా విదేశాల నుంచి స్వస్థలమైన జిల్లాకు వచ్చిన 1,032 మందిని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. వీరందరినీ వారి ఇళ్లల్లోనే గృహ నిర్బంధంలో ఉంచింది. ప్రతి రోజూ ఆరోగ్య సిబ్బంది వీరి ఇళ్లకు వెళ్లి స్వయంగా ఆరోగ్య పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. గృహ నిర్బంధంలో ఉన్న వారిలో 35 మందికి కరోనా అనుమానిత లక్షణాలు ఉండటంతో వైద్యులు వారిని ప్రాథమికంగా పరీక్షించి ఐదుగురిని గుంటూరు ప్రభుత్వ జ్వరాల ఆసుపత్రికి కరోనా వైరస్ నిర్ధారిత పరీక్షలకు పంపారు. ఇందులో నాలుగు నమూనాల్లో ఫలితాలు రాగా, నలుగురికీ కరోనా లేదని వెల్లడైంది. ఇక మరో 198 మందికి 28 రోజుల గృహ నిర్బంధం గడువు ముగిసింది. దీంతో వీరి నుంచి ఎటువంటి ఇబ్బంది లేదని అఽధికారులు గుర్తించారు. మిలిగిన 779 మంది ప్రస్తుతం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో హోం క్వారంటైన్‌లో ఉన్నారు.
గృహ నిర్బంధంలో ఉన్న వారిని ఏ,బీ,సీ అనే మూడు కేటగిరిలుగా విభజించాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది. మొదటి కేటగిరిలో కోవిడ్-19కు సంబంధించి ఎటువంటి లక్షణాలు లేని వారిని చేర్చారు. వీరిని ఇకపైనా గృహ నిర్బంధంలోనే ఉంచుతారు. ఇక వ్యాధి లక్షణాలు ఉన్న వారిని మిగిలిన రెండు కేటగిరీల్లో చేర్చి వారిని వెంటనే ఆంబులెన్స్‌ల ద్వారా ప్రభుత్వాస్పత్రుల్లో ఏర్పాటు చేసిన కోవిడ్-19 ఐసొలేషన్ వార్డులకు తరలిస్తారు.
కరోనా వార్డును సందర్శించిన కలెక్టర్...
గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రిలో ఏర్పాటు చేసిన కరోనా ఐసొలేషన్ వార్డును, కరోనా ఓపీ వార్డును ఆదివారం కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ పరిశీలించారు. ఓపీ మరీ దూరంగా ఉందని భావించిన ఆయన ఇన్‌పేషెంట్ వార్డుకు సమీపంలో కరోనా ఓపీని మార్చాలని సూపరింటెండెంట్ డాక్టర్ బాబులాల్‌ను ఆదేశించారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి కొద్ది మంది స్వయంగా వైద్య పరీక్షల కోసం కరోనా ఓపీకి వచ్చారని, వీరిలో వ్యాధి లక్షణాలు లేవని డాక్టర్ బాబులాల్ తెలిపారు. ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్స పొందుతున్న కోవిడ్-19 అనుమానిత రోగులు ఉంటే వారు వెంటనే జిల్లా వైద్యఆరోగ్య శాఖలోని కాల్ సెంటర్‌ను (ఫోన్ నెం.0863-2271492) సంప్రదించి తగిన సాయం పొందవచ్చని ఆయన తెలిపారు.