మత్స్యకారులకు మరింత లాభం

ABN , First Publish Date - 2020-11-22T05:07:51+05:30 IST

నిజాంపట్నం ఫిషింగ్‌ హార్బర్‌ రెండో దశ పనులకు సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేశారు. శనివారం ఆయన తాడేపల్లిలో తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.

మత్స్యకారులకు మరింత లాభం
నిజాంపట్నం ఫిషింగ్‌ హార్బర్‌ రెండో దశ నిర్మాణానికి వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేస్తోన్న సీఎం జగన్‌

నిజాంపట్నం ఫిషింగ్‌ హార్బర్‌ రెండో దశ నిర్మాణానికి శంకుస్థాపన

వర్చువల్‌ విధానంలో కార్యక్రమం నిర్వహించిన సీఎం జగన్‌

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరైన ఇన్‌ఛార్జ్‌ మంత్రి, ఎమ్మెల్యేలు, అధికారులు


గుంటూరు, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): నిజాంపట్నం ఫిషింగ్‌ హార్బర్‌ రెండో దశ పనులకు సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేశారు. శనివారం ఆయన తాడేపల్లిలో తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. రిమోట్‌ ద్వారా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్‌ నుంచి ఇన్‌చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, శాసనమండలి చీఫ్‌విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 202 యాంత్రిక బోట్లు, 1,733 మోటారు పడవలకు సంబంధించి 8,300 మంది సంప్రదాయ మత్స్యకారులకు వేట నిషేధ కాలభృతి రూ.10 వేల చొప్పున రూ.8.83 కోట్లు వారి ఖాతాలకు జమ చేశామన్నారు. డీజిల్‌ సబ్సిడీకి సంబంధించి లీటర్‌కు రూ.9 చొప్పున ఇప్పటివరకు రూ.2.06 కోట్లు సబ్సిడీ విడుదల చేశామన్నారు. నిజాంపట్నం హార్బర్‌ని 1992లో 60 పడవలు నిలుపుకొనేందుకు నిర్మించారని ప్రస్తుతం అక్కడ 350 బోట్లు ఉన్నాయన్నారు. దీంతో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఫిషింగ్‌ హార్బర్‌ రెండో దశ నిర్మాణం పూర్తి అయితే మత్స్యకారులకు మరింత లాభం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా నిజాంపట్నంకు చెందిన మత్స్యకారుడు నడకుదిటి శివయ్య వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎంతో సంభాషించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మహమ్మద్‌ ముస్తఫా, విడదల రజని, బొల్లా బ్రహ్మనాయుడు, జేసీ(రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌, డీఆర్‌వో సి.చంద్రశేఖర్‌రెడ్డి, మత్స్యశాఖ జేడీ ఏవీ రాఘవరెడ్డి, డీడీ డాక్టర్‌ పి.సురేష్‌, వివిధ మత్స్యకార సంఘాల నాయకులు మోపిదేవి శ్రీనివాసరావు, సాదు వెంకటరమణ, రేవు వీర్రాజు, మోపిదేవి నాగరాజు, ఎండీ సంజయ్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-22T05:07:51+05:30 IST