-
-
Home » Andhra Pradesh » Guntur » gym at home online classes
-
హోం టూ.. జిమ్
ABN , First Publish Date - 2020-04-07T16:34:37+05:30 IST
కోవిడ్ -19 విజృంభిస్తున్న వేళ తమ కస్టమర్లకు దూరం కాకుండా..

ఫేస్‌బుక్‌లో జిమ్ పాఠాలు
వర్చ్యువల్ తరగతులకు రెడీ
నూతన విధానాన్ని ఎంచుకున్న జిమ్ నిర్వాహకులు
ప్రజల నుంచీ పెరుగుతున్న ఆదరణ
లాక్‌డౌన్ సమయంలో ఫిట్‌నెస్..
గుంటూరు(ఆంధ్రజ్యోతి): కోవిడ్ -19 విజృంభిస్తున్న వేళ తమ కస్టమర్లకు దూరం కాకుండా ఉండడంతోపాటు నూతన కస్టమర్లను చేరుకోవడానికి జిమ్ ట్రైనర్లు ఆన్‌లైన్ మార్గాన్ని ఎంచుకున్నారు. ఫేస్‌బుక్ లైవ్‌లో జిమ్ పాఠాలు నేర్పుతున్నారు. మీరు మాత్రమే అనుసరించడం కాదు.. వాచ్ పార్టీని మీ ఎఫ్‌బీ ప్రొఫైల్ నుంచి హోస్ట్ చేయడం ద్వారా మీ స్నేహితులను కూడా చేర్చుకోవచ్చంటూ ప్రచారం చేస్తున్నారు.
కోవిడ్ -19 మహమ్మారి విజృంభిస్తుండడంతో ప్రతి ఒక్కరూ తమ వినియోగదారులకు సేవలనందించడానికి కృషిచేస్తున్నారు. పలు ఫిట్‌నెస్, యోగా సెంటర్లు అందుకు మినహాయింపేమీ కాదు. జిమ్ ఇన్‌స్ట్రక్టర్లు తమ కస్టమర్లు అనే కాదు... ప్రజలు చురుగ్గా ఉండేందుకు ఇంట్లోనే ఏం చెయొచ్చనేది చెబుతున్నారు. ఇదే విషయమై యోగా అభ్యాసకుడు రాజు మాట్లాడుతూ ’ఇప్పుడు మీ ఇల్లే స్టూడియో..! నిన్నటివరకూ జిమ్ లేదంటే యోగాకు వెళ్లడం సాధ్యం కావడం లేదని అంటూ ఏదో ఒక కారణం చెప్పుకుని సంతృప్తి పడేవాళ్లకు ఇప్పుడు ఆ చాన్స్ లేదు. మనకు నచ్చిన టైమ్‌లో కాకపోయినా ఉదయం, సాయంత్రం వేళల్లో ఆన్‌లైన్‌లో నగరంలో కొంతమంది ఇన్‌స్ట్రక్టర్లు లైవ్ క్లాసెస్ నడుపుతున్నారు. మనం కోసం వారే అంతగా కష్టపడుతుంటే మన కోసం మనమెందుకు కష్టపడలేము’ అని ప్రశ్నిస్తున్నారు.
అలానే వివిధ యోగా, ఫిట్‌నెస్ సెంటర్లు ఇప్పుడు ఎఫ్‌బీ లైవ్‌లో క్లాస్‌లు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశాయి. ఇన్‌స్ట్రక్టర్లు లేరనే సాకుతో తమ రోటీన్ ఫిట్‌నెస్ వ్యాయామాలకు విరామం ప్రకటించకుండా చేసేందుకు ఫిట్‌నెస్ యాప్‌లు, లైవ్‌స్ట్రీమింగ్స్ ఎంతో తోడ్పడుతున్నాయని ఫిట్‌నెస్ నిపుణులు పేర్కొంటున్నారు. భారీ ఎక్విప్‌మెంట్ లేకుండా సింపుల్‌గా ఫిట్‌నెస్ ఎలా సాధించవచ్చో అందరూ తెలుపుతున్నారు. స్టూడియో ఫిట్‌నెస్ క్లాస్‌లతో పోలిస్తే లైవ్ స్ట్రీమింగ్ క్లాస్‌లకు ఖర్చు కూడా తక్కువగానే ఉంటుందన్నారు అనుభవజ్ఞులు.
పలు ఫిట్‌నెస్ స్టూడియోలు ఇప్పుడు యోగా, హిట్, జుంబా, బాడీ కంబాట్ వంటి అంశాలను లైవ్ స్ట్రీమింగ్‌లో ఫిట్‌నెస్ తరగతులు.. సాధ్యమా అని అంటే సాధ్యమే అంటున్నారు. ఫిట్‌నెస్ ప్రియులు జిమ్‌లో ఉన్నట్లే ఉంటుంది. కాకపోతే మన దగ్గర ఎక్విప్‌మెంట్ అంతగా ఉండదు.. అయినా సరే ఉన్న ఎక్విప్‌మెంట్‌తోనే ఎలా ఫిట్‌గా ఉండొచ్చో వీరు చెబుతున్నారు. రోజుకు 30 నిమిషాలు బాడీవెయిట్‌పై ట్రైనింగ్ చాలంటున్నారు. ఈ లాక్‌డౌన్ వేళ కండీషన్‌లో ఉండడానికి టోటల్ ఫిట్‌నెస్ అని కాదు కానీ ఫిట్‌నెస్‌తో ఉండడానికి ఇది మోటివేట్ చేస్తుందన్నారు నగర సోషలైట్ సుధ.
ఫిట్‌నెస్ లక్ష్యం.. కస్టమర్లే మార్గం...!
భౌతిక దూరం పాటించడం ద్వారా కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయొచ్చు. అయితే ఇంట్లో ఉండడం వల్ల ఫిట్‌నెస్ పోతుందే బాధ లేకుండా చెమటను చిందించవచ్చని అందరూ నమ్ముతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు పేరొందిన ఫిట్‌నెస్ నిపుణులు, జిమ్‌లు ప్రత్యక్ష తరగతులను ఆన్‌లైన్‌లో అందిస్తున్నాయి. అలానే నగరంలో ఓ ప్రముఖ యోగా ఇన్‌స్ట్రక్టర్ మాట్లాడుతూ ’ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది యోగా ప్రియులు యోగాను అనుసరిస్తున్నారు. కారణం, ఈ సంక్షోభ సమయంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాల్సిన అవశ్యకతను గుర్తిస్తున్నారు. యోగాను అందుకు ఓ మార్గంగా భావిస్తున్నారు. ఇది దృష్టిలో పెట్టుకుని వర్చ్యువల్ క్లాసెస్‌ను నిర్వహించడం ద్వారా వినియోగదారుల ఆరోగ్యం, ఫిట్‌నెస్ నిలుపుకొనేందుకు సహాయ పడుతున్నాం.. ముఖ్యంగా మానసిక ఒత్తిడిని తగ్గించుకునేలా క్లాసెస్ నిర్వహిస్తున్నామని’ తెలిపారు.