ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి

ABN , First Publish Date - 2020-12-11T05:46:47+05:30 IST

వైసీపీ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరించాలని టీడీపీ నరసరావుపేట లోక్‌సభ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు.

ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి

ఏలూరు మృతులకు రూ.50 లక్షలు ఇవ్వాలి

టీడీపీ నరసరావుపేట లోక్‌సభ అధ్యక్షుడు జీవీ  


వినుకొండ, డిసెంబరు 10: వైసీపీ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరించాలని టీడీపీ నరసరావుపేట లోక్‌సభ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఏలూరులో ఇప్పటికే 500మందికి పైగా ఆసుపత్రిల్లో ఉండగా, ముగ్గురు మృతి చెందారన్నారు. మృతి చెందిన వారికి రూ.50 లక్షలు, బాధితులకు రూ.20 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నదన్నారు. ఇసుక కొరతతో వేలమంది కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. గ్రామాల్లో పారిశుధ్య, కలుషిత తాగునీటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.  స్థానిక ఎమ్మెల్యే ఎక్కడో కొండల్లో గుట్టల్లో తన సొంతపొలాన్ని సుమారు రూ.18 కోట్లకు ప్రభుత్వానికి అంటకట్టి, ఆయన మాత్రం వినుకొండ పసుపులేరు బ్రిడ్జి వద్ద 100 ఎకరాలు కొనుగోలు చేశారని ఆరోపించారు. వెల్లటూరు రోడ్డులో మోసం చేసి 10 ఎకరాలు కొన్నారని, తన భూమి అభివృద్ధి కోసం కొండపైకి ఘాట్‌రోడ్డు పనులను ఎంచుకున్నారన్నారు. గతంలో ఎన్‌ఎస్‌పీలో నివాసం ఉంటున్న నిరుపేదలకు అక్కడే ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారని, నేడు గెలిచిన తరువాత ఉన్నపళంగా ఖాళీ చేయమనడం ఎంతవరకు సమంజసమన్నారు. సమావేశంలో టీడీపీ  పట్టణ అధ్యక్షుడు సౌదాగర్‌ జానీబాషా, నాయకులు షమీమ్‌, మురళీకృష్ణయాదవ్‌, రొడ్డా వీరాంజనేయరెడ్డి, పల్లమీసాల దాసయ్య, గురవయ్య తదితరులు ఉన్నారు.  

Updated Date - 2020-12-11T05:46:47+05:30 IST