గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో.. కుర్చీలాట...!

ABN , First Publish Date - 2020-09-18T14:16:52+05:30 IST

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ ఇన్‌చార్జి పదవి పోరు ఒకే ఒరలో..

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో.. కుర్చీలాట...!

పశ్చిమ ఇన్‌చార్జి పదవి కోసం నేతల మధ్య కోల్డ్‌వార్‌

ఆసరా సభలో నినాదాలతో బహిర్గతం 

అధిష్ఠానం వద్ద తేల్చుకునేందుకు ఓ వర్గం యత్నం


గుంటూరు(ఆంధ్రజ్యోతి): గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ ఇన్‌చార్జి పదవి పోరు ఒకే ఒరలో రెండు కత్తుల సామెతను తలపిస్తోంది. గత ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి పోటీ చేసిన వారు ఒకరైతే... ఇటీవల పార్టీలో చేరిన వారు మరొక రు...! వీరిద్దరి మధ్య  పోరు పార్టీ కేడర్‌లో గందరగోళానికి గురిచేస్తోంది. ఈ పోరు కొంతకాలంగా సైలెంట్‌గా నడుస్తోండగా తాజాగా ఆసరా సభల్లో బహిర్గతమవుతోంది. నల్లచెరువులో బుధవారం జరిగిన సమావేశంలో ఏసురత్నమే ఇన్‌చార్జి అంటూ కొందరు కార్యకర్తలు నినాదాలు చేయటం మరింత ఆజ్యం పోసినట్లయింది. 


గత ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన చంద్రగిరి ఏసురత్నం, టీడీపీ అభ్యర్థి మద్దాళి గిరిధర్‌పై ఓటమి చెందాక పశ్చిమ వైసీపీ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. ఇటీవల ఏసురత్నం మార్కెట్‌యార్డు చైర్మన్‌గా నియమి తులయ్యాక కూడా పార్టీ బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. ఎన్నికల అనంతర పరి ణామాల నేపథ్యంలో పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌ కూడా అనధికారికంగా వైసీపీలో చేరా రు. అప్పటినుంచి మద్దాళి గిరిధర్‌ ఎమ్మెల్యేతో పాటు పశ్చిమ ఇన్‌చార్జి అని కూడా ఆయన అనుయాయులు ఫ్లెక్సీలలో ప్రదర్శిస్తున్నారు. దాంతో ఏసురత్నం వర్గీయుల్లో ఆగ్రహం తెప్పి స్తోంది. మొన్నటివరకు వారంతా పార్టీ కార్యక్రమాల్లో ఒకే వేదికపై ఉంటున్నా వారి మధ్య ఇన్‌చార్జి పదవిపై కోల్డ్‌వార్‌ నడు స్తున్నట్లు సమాచారం. 


రెండు గ్రూపులుగా కార్యకర్తలు..

పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ ఇన్‌చార్జి పదవిపై ఆ పార్టీ కార్యకర్తల్లో కొంతకాలంగా గందరగోళం నెలకొంటోంది. కొందరు డివిజన్‌ అధ్యక్షులు, కార్పొరేటర్‌ అభ్యర్థులు ఇప్పటికే రెండు గ్రూపులుగా విడిపోయారు. వైసీపీ నుంచి పోటీ చేసిన తమ నాయకుడే ఇన్‌చార్జి అవుతారని, ఎమ్మెల్యే తన స్వార్ధం కోసం పార్టీలో చేరారని, ఎన్నికల్లో వైసీపీని ఓడించిన ఆయన వద్దకు తాము ఎలా వెళతామంటూ కొందరు ద్వితీయశ్రేణి నాయకులు బాహా టంగానే ప్రశ్నిస్తున్నారు. ఇక అధిష్టాన వర్గమే ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకుందని ఆయనే ఇన్‌చార్జి అవుతారంటూ ఎమ్మెల్యే వర్గీయులు చెప్పుకొంటున్నారు. నేతల మధ్య కోల్డ్‌వార్‌తో కొందరు నాయకులు రెండు గ్రూపుల్లోనూ తిరగలేక తలలు పట్టుకుంటున్నారు. 


ఆసరా సభలో నినాదాలతో బహిర్గతం

ఆసరా సభల్లో భాగంగా బుధవారం నల్లచె రువులో జరిగిన సమావేశంలో మార్కెట్‌యార్డు చైర్మన్‌ ఏసురత్నం అంటూ నిర్వాహకులు సభలో ఆహ్వానం పలకగా కొందరు ఏసురత్నం వర్గీ యులు పశ్చిమ ఇన్‌చార్జి అంటూ నినాదాలు చేశా రు. అదే సభలో ఏసురత్నంతో పాటు ఎమ్మెల్యే గిరిధర్‌, వైసీపీ నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్‌ గాంధీ, కావటి మనోహర్‌నాయుడు, జీఎంసీ అధి కారులు ఉన్నారు. కార్యకర్తల నినాదాలతో ఒక్క సారిగా సభలో గందరగోళం నెలకొంది. నాయ కులు సర్ది చెప్పటంతో వివాదం సద్దుమణిగింది. ఆసరా సభల ప్రాంగణంలో ఏసురత్నం, మద్దాళి గిరిధర్‌ ఇద్దరి ఫ్లెక్సీల్లో వైసీపీ పశ్చిమ ఇన్‌చార్జి అంటూ ప్రదర్శించారు. 


తేల్చుకునేందుకు సిద్ధం..

ఇన్‌చార్జి పదవి ఎవరిదనే వివాదంపై అధిష్టానవర్గం వద్ద తేల్చుకునేందుకు ఓ వర్గం సిద్ధమవుతున్నట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లో జిల్లాలోని కీలక నేతలను సంప్రదించి అధిష్టాన పెద్దలను కలవాలని ఓ వర్గం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. 


Updated Date - 2020-09-18T14:16:52+05:30 IST