నారీ భేరి!

ABN , First Publish Date - 2020-03-08T08:51:58+05:30 IST

అమరావతి ఆందోళనల్లో ఎన్నడూ ఇంటి నుంచి బయటకు రాని మహిళలే ఉద్యమకారులు..! ఏ దీక్ష శిబిరాన్ని సందర్శించినా కనిపించేది మూడొంతులు వారే...

నారీ భేరి!

  • ఉద్యమ పథంలో రాజధాని మహిళలు 
  • అమరావతి ఆందోళనల్లో వారే  కీలకం
  • పోరాటం నేర్పిన రాజధాని మార్పు ప్రకటన 
  • వంట చేసి, నేరుగా దీక్షా శిబిరాలకే..
  • 81వ రోజు కొనసాగిన రైతులు, మహిళల ఆందోళనలు


గుంటూరు, తుళ్లూరు, మంగళగిరి, తాడికొండ, మార్చి 7(ఆంధ్రజ్యోతి): అమరావతి ఆందోళనల్లో ఎన్నడూ ఇంటి నుంచి బయటకు రాని మహిళలే ఉద్యమకారులు..! ఏ దీక్ష శిబిరాన్ని సందర్శించినా కనిపించేది మూడొంతులు వారే.  ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించేదీ.. తమకు అన్యాయం చేయవద్దని వేడుకునేదీ మహిళా రైతులే..! పసిబిడ్డలను తోడ్కొని ఉద్యమంలో పాల్గొంటున్న మహిళామణులకు.. మహిళా దినోత్సవ సందర్భంగా.. ఉద్యమాభివందనాలు.....!


కొనసాగిన ఆందోళనలు

తుళ్లూరు, మందడంలో మహాధర్నా నిర్వహించగా, వెలగపూడి, రాయపూడి, కృష్ణాయపాలెం, యర్రబాలెం, గుంటూరు కలెక్టరేట్‌ ఎదురు, తాడికొండ అడ్డరోడ్డు, పెదపరిమి, తాడేపల్లి తదితర ప్రాంతాల్లో రిలే నిరాహార దీక్షలు, ఆందోళనలు కొనసాగించారు. నమ్మి ఓట్లేస్తే జగన్‌ తమను ముంచారని రాయపూడి రైతులు, మైనార్టీ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. చెవిలో పూలతో నిరసన తెలిపారు.  


వెంకన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు

అమరావతి గ్రామాల్లోని అనంతవరంలో కొలువై ఉన్న వెంకన్న ఆలయంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో జరగుతున్న ఉత్సవాలకు హాజరై అమరావతిని ఏపీ ఏకైక రాజధానిగా కొనసాగించేలా చూడాలని పొంగళ్లుపెట్టి, ముడుపులు కట్టారు. అలానే శాఖమూరు తానపతి చెరువు వద్ద ఉన్న సమ్మక్క, సారలమ్మ ఆలయంలో అమరావతి ప్రాంత రైతులు, మహిళలు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దీనికోసం తూళ్లురు నుంచి  ఉదయం 9 గంటలకు రైతులు, రైతుకూలీలు, మహిళలు భారీఎత్తున ఉరేగింపుగా పాదయాత్ర నిర్వహించి సమ్మక్క, సారలమ్మ ఆలయంకు వెళ్లాలని జేఏసీ నేతలు తలపెట్టారు.

Updated Date - 2020-03-08T08:51:58+05:30 IST