ప్రశాంత ఎన్నికలే ప్రథమ కర్తవ్యం
ABN , First Publish Date - 2020-03-08T08:42:59+05:30 IST
గుంటూరు రేంజ్ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పూర్తిచేయడమే ప్రస్తుతం తమ ముందు ఉన్న ప్రథమ కర్తవ్యమని...

- ఎన్నికల్లో డబ్బు, మద్యం కట్టడికి పకడ్బందీ చర్యలు
- మహిళలు, బాలికలపై నేరాల కట్టడికి దిశ చట్టం
- సౌత్ కోస్టల్ జోన్ ఐజీ ప్రభాకరరావు
గుంటూరు, మార్చి 7: గుంటూరు రేంజ్ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పూర్తిచేయడమే ప్రస్తుతం తమ ముందు ఉన్న ప్రథమ కర్తవ్యమని సౌత్ కోస్టల్ జోన్ ఐజీ జె.ప్రభాకరరావు స్పష్టంచేశారు. శనివారం ఐజీగా బాధ్యతలు చేపట్టిన ప్రభాకరరావు మీడియాతో మాట్లాడుతూ తన ప్రాధాన్యతలను వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో అవాం ఛనీయ ఘటనలు, అల్లర్లు వంటివి జరగకుండా ప్రశాంతంగా నిర్వహించేలా చూడడమే తమ ముందు ఉన్న లక్ష్యమన్నారు. సమయం తక్కువగా ఉండటంతో ఈ ఎన్నికల ప్రక్రియను ఛాలెంజ్‌గా తీసుకున్నామన్నారు. ముందుగా జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలతో పాటు రెండు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయన్నారు.
రేంజ్‌లో ముఖ్యంగా పల్నాడుతో పాటు ప్రకాశం జిల్లాలో కొంత ఫ్యాక్షన్ వాతావరణం ఉందన్నారు. ఆయా ప్రాంతాల్లోనూ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయబోతున్నామన్నారు. నెల రోజుల వ్యవధిలోనే ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కానుండటంతో పెద్ద ఎత్తున పోలీస్ బలగాలతో ముందుజాగ్రత్త చర్యలు చేపట్టనున్నామన్నారు. ముఖ్యంగా సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మకప్రాంతాలపై ప్రత్యేకదృష్టి సారిస్తామని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ప్రశాంత ఎన్నికలకు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం, ఇతర ప్రలోభాలకు గురికాకుం డా చూసేందుకు అన్నివిధాల చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం, డబ్బు పంపిణీని అరికట్టేందుకు కఠినచర్యలు తీసుకుంటామన్నారు.
మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. మహిళల సంరక్షణకు ప్రభు త్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. దీనిలో భాగంగానే దిశచట్టం తెచ్చారన్నారు. మహిళలు, బాలికలపై జరిగే నేరాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా దిశ యాప్‌ను రూపొందించారన్నారు. ఇప్పటి వరకు లక్ష 50వేల మంది మహిళలు, యువతులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారన్నారు. ఈ యాప్ ద్వారా సమా చారమిచ్చిన పది నిమిషాల్లోనే పోలీసులు అక్కడికి చేరుకుంటున్నారన్నారు. రానున్న రోజుల్లో మహిళల రక్షణకు, ప్రజల అవసరాలకనుగుణంగా పోలీస్ శాఖను ముందుకు తీసుకువెళతామన్నారు.
ఐజీగా బాధ్యతలు స్వీకరణ
శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 20మంది ఐపీఎస్ అధికారుల బదిలీ జరగ్గా అందులో సౌత్ కోస్టల్ జోన్ ఐజీగా ప్రభాకరరావును నియమించారు. స్థానికసంస్థల నోటిఫికేషన్ జారీకానున్న నేపథ్యంలో శనివారం ఉదయం 8 గంటలకే ఆయన బాధ్యతలు స్వీకరించారు.
ప్రకాశం జిల్లాకు చెందిన జె.ప్రభాకరరావు 1991లో గ్రూప్-1 ద్వారా డీఎస్పీగా ఎంపికయ్యా రు. డీఎస్పీగా నిజామాబాద్, మచిలీపట్నం, గుంటూరుతోపాటు రాజమహేంద్రవరంలో విధులు నిర్వహించారు. 1995లో రెండేళ్లపాటు గుంటూరు టౌన్ డీఎస్పీగా బాధ్యతలు నిర్వహిం చారు. అప్పట్లో ఇక్కడ రౌడీయిజం ఎక్కువగా ఉండేది. ఆయన రౌడీషీటర్లపై ఉక్కు పాదం మోపారు. అదనపు ఎస్పీగా ఖమ్మం, కర్నూలులలో పనిచేశారు. 2002లో ఎస్పీగా ఉద్యోగోన్నతి పొందారు. ఎస్పీగా విజిలెన్స్, గ్రేహౌండ్స్, వరంగల్, తిరుపతి అర్బన్, కృష్ణా జిల్లాల్లో పనిచేశారు. ఆ తరువాత డీఐజీగా ఉద్యోగోన్నతి పొందారు. 2016-18మధ్య అనంతపురం డీఐజీగా పనిచేశారు. 2018 అక్టోబర్ నుంచి సీఐడీ డీఐజీగా విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా ఐజీగా ఉద్యోగోన్నతి పొందిన ప్రభాకరరావు సౌత్ కోస్టల్ జోన్‌కు నియమితులయ్యారు.
ఐజీని కలిసిన ఎస్పీలు, అధికారులు
సౌత్ కోస్టల్ జోన్ ఐజీగా బాధ్యతలు చేపట్టిన ప్రభాకరరావును పలువురు ఐపీఎస్ అధికారులు, ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు మర్యాద పూర్వకంగా కలిశారు. శనివారం తన ఛాంబర్‌లో ఐజీ ప్రభాకర్‌రావును డీఐజీ పీహెచ్‌డీ రామకృష్ణ, రూరల్ ఎస్పీ విజయరావుతోపాటు అదనపు ఎస్పీలు గంగాధరం, చక్రవర్తి, ప్రసాద్, మూర్తి తదితరులు కలిసి పుష్పగుచ్చాలు అందించారు. డీఎస్పీలు బీవీ రామారావు, ఎం.బాలసుందరరావు, వీవీ రమణకుమార్, బి.సీతారామయ్య, ఎం.కమలాకరరావు, కె.ప్రకాశ్‌బాబు, సీఐలు, ఎస్‌ఐలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.