ఈ-నామ్‌.. సూపర్‌

ABN , First Publish Date - 2020-06-18T09:57:44+05:30 IST

ప్రభుత్వం విడుదల చేసిన 2019-20 సామాజిక ఆర్థిక సర్వేలో గుంటూరు మిర్చియార్డులో ఈనామ్‌ విధానం అమలుని

ఈ-నామ్‌.. సూపర్‌

గుంటూరు మిర్చియార్డుకు దేశంలోనే మొదటి స్థానం

రూ.11,344.93 కోట్ల ట్రేడింగ్‌తో రూ.122.69 కోట్ల  ఫీజు రాబడి

మైనార్టీ ఐటీఐ, స్కూల్‌ ఆఫ్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌కు ప్రతిపాదనలు

సామాజిక ఆర్థిక సర్వే గణాంకాలు విడుదల చేసిన ప్రభుత్వం


గుంటూరు, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం విడుదల చేసిన 2019-20  సామాజిక ఆర్థిక సర్వేలో గుంటూరు మిర్చియార్డులో ఈనామ్‌ విధానం అమలుని ప్రముఖంగా ప్రస్తావించింది. దేశంలోనే మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నది. ఇక్కడ   రూ.11,344.93 కోట్ల వ్యాపారం జరిగిందని, రైతులకు ఎంతో మేలు జరిగిందని సర్వేలో పొందుపరించింది.  మార్కెట్‌ కమిటీకి రూ.122.69 కోట్ల ఆదాయం సమకూరిందని తెలిపింది. ఇక్కడి నుంచి విదేశాలకు నాణ్యమైన మిర్చిని ఎగుమతి చేసేందుకు సోలార్‌ పాలీ డ్రయర్స్‌ని కూడా పంపిణీ చేసినట్లు పేర్కొన్నది. 


వ్యవసాయం: జిల్లాలో రూ.8,653 కోట్లు గత ఏడాది ఖరీఫ్‌ లక్ష్యం కాగా రూ.7,412 కోట్ల పంపిణీతో 82 శాతం లక్ష్యం మాత్రమే అధిగమించగలిగింది. రబీలో రూ.6,145 కోట్ల లక్ష్యం కాగా రూ.5,413 కోట్లు పంపిణీ చేసి 88 శాతం పురోగతిని సాధించింది. రుణ అర్హత కార్డులు 98,134 మందికి పంపిణీ చేసినా వారిలో 1,960 మంది మాత్రమే బ్యాంకుల నుంచి రుణం పొందగలిగారు. పంటల సేద్యం సర్టిఫికేట్‌ని 13,956 మందికి పంపిణీ చేయగా రూ.1,394 మంది రుణం పొందారు. రైతుభరోసా పథకం కింద జిల్లాలో 4,05,558 మంది రైతులు, 18,584 మంది కౌలుదారులకు లబ్ధి చేకూరింది. జిల్లాలో పాలు, మాంసం, చేపలు, రొయ్యల ఉత్పత్తులు ఆశాజనకంగా ఉన్నట్లు సర్వేలో ప్రభుత్వం పేర్కొన్నది.

 

మైనింగ్‌: జిల్లాలో అక్రమ మైనింగ్‌ని నిరోధించేందుకు పైలట్‌ ప్రాజెక్టుగా డ్రోన్‌ సర్వే చేపట్టినట్లు సర్వేలో పొందుపరిచింది. ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని, రాబోయే రోజుల్లో రాష్ట్రమంతటా డ్రోన్‌ సర్వే టెక్నాలజీని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 


ఐటీఐ, స్కూల్‌ ఆఫ్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌..

మైనార్టీ విద్యార్థుల కోసం 100 పడకల హాస్టల్‌ సౌకర్యంతో నరసరావుపేటలో ఐటీఐని నిర్మిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. జిల్లాలో స్కూల్‌ ఆఫ్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌ ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు చెప్పింది. బ్రెయిలీ ప్రెస్‌ని గుంటూరులో ఏర్పాటు చేసేందుకు రూ.1.29 కోట్లు విడుదల చేసినట్లు సర్వేలో ప్రస్తావించింది. గుంటూరు భూగర్భ మురుగునీటి పారుదల పథకాన్ని రూ.923.94 కోట్లతో చేపట్టామని 60 శాతం పని పూర్తి అయినట్లు తెలిపింది. 2020 మార్చి లోపే పూర్తి చేసేందుకు లక్ష్యం పెట్టుకున్నట్లు పేర్కొనడం అందరికి ఆశ్చర్యం కలిగిస్తోన్నది. 

Updated Date - 2020-06-18T09:57:44+05:30 IST