గుంటూరు కార్పొరేషన్‌ కార్యాలయంలో కలకలం

ABN , First Publish Date - 2020-07-08T16:42:46+05:30 IST

కరోనా కట్టడి కావడంలేదు. రోజురోజుకు కరోనా ఉధృతి పెరిగిపోతోంది..

గుంటూరు కార్పొరేషన్‌ కార్యాలయంలో కలకలం

విజృంభిస్తోన్న.. కరోనా

కొత్తకొత్త ప్రాంతాల్లోనూ వైరస్‌

జిల్లాలో తాజాగా 236 మందికి పాజిటివ్‌

నగర పాలక సంస్థ పరిధిలో 139 మందికి

నరసరావుపేటలో 287కు చేరిన కరోనా కేసులు


గుంటూరు(ఆంధ్రజ్యోతి): కరోనా కట్టడి కావడంలేదు. రోజురోజుకు కరోనా ఉధృతి పెరిగిపోతోంది. కొత్తకొత్త ప్రాంతాలను కూడా చుట్టేస్తోంది. గుంటూరు నగర పరిధిలో కూడా పలు ప్రాంతాల్లో వైరస్‌ కనిపిస్తోంది. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కేసులు పెరిగిపోతుండటంతో రెడ్‌జోన్‌, కంటైన్మెంట్‌ జోన్లు కూడా పెరిగిపోతున్నాయి. జిల్లాలో మంగళవారం 236 కరోనా కేసులు వచ్చాయి. గుంటూరు నగర పరిధిలో 139 వచ్చాయి. సత్తెనపల్లిలో ఓ ప్రభుత్వ ఉద్యోగికి పాజిటివ్‌ గుర్తించిన 24 గంటల్లోనే మృతి చెందడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.


ఇక గుంటూరు నగరపాలక సంస్థలో కరోనా వైరస్‌ కలకలం రేపింది. నగరపాలక సంస్థ కమిషనర్‌ చాంబర్‌లోని ఉద్యోగికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు కమిషనర్‌ చాంబర్‌ మొత్తాన్ని శానిటైజింగ్‌ చేశారు. ఇక నగరంలోని విద్యుత్‌ కార్యాలయంలో పలువురు ఉద్యోగులకు కరోనా లక్షణాలతో పాటు ఓ జూనియర్‌ ఇంజనీర్‌కు కరోనా సోకటంతో విద్యుత్‌శాఖ యంత్రాంగం అప్రమత్తమైంది. గుంటూరు సంగడిగుంటలో ఉన్న విద్యుత్‌భవన్‌లోని ఉద్యోగులు, అధికారులకు కొవిడ్‌-19 పరీక్షలను చేపట్టారు. ఇప్పటికే విద్యుత్‌ భవన్‌ను శానిటైజేషన్‌తో కొవిడ్‌-19 నివారణ చర్యలను తీసుకుంటున్నట్లు ఎస్‌ఈ ఎం విజయకుమార్‌ తెలిపారు. ఉద్యోగులకు శానిటైజర్లు, మాస్కులు, ఫేస్‌ షీల్డ్‌లను అందజేశామన్నారు. విద్యుత్‌ బిల్లుల వసూలు కేంద్రాలతో పాటు రీడింగ్‌ సమయాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.  


భట్టిప్రోలు మండలం ఐలవరంలో ఓ వృద్ధుడికి పాజిటివ్‌గా నిర్ధారించినట్లు వైద్యాధికారి సీతాకుమారి తెలిపారు. ఆ వ్యక్తి నివాస ప్రాంతాన్ని బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు, రేపల్లె రూరల్‌ సీఐ శ్రీనివాసరావు, తహసీల్దార్‌ ఎంఎల్‌ శ్రావణ్‌కుమార్‌, ఎంపీడీవో బాబూరావు, ఎస్‌ఐ శామ్యూల్‌ రాజీవ్‌కుమార్‌ పరిశీలించి బారీకేడ్లు ఏర్పాట్లు చేశారు. 


దాచేపల్లి మండలంలో ఏడు కేసులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దాచేపల్లిలో ఒకరు, నారాయణపురంలో ఓ అపార్ట్‌మెంట్‌ వాచ్‌మన్‌కు, గామాలపాడులో ఒకే కుటుంబంలో నలుగురికి, తంగెడలో పదేళ్ల బాలుడికి పాజిటివ్‌గా గుర్తించారు. 


రొంపిచర్ల మండలం దాసరిపాలెం, తుంగపాడు గ్రామాల్లో రెండు కేసులు నమోదైనట్లు వైద్యాధికారిస్వాతి తెలిపారు. తుంగపాడులో హైదరాబాద్‌ నుంచి ఈ నెల 2న వచ్చిన మహిళకు పాజిటివ్‌గా అధికారులు గుర్తించారు. గుంటూరులో చికిత్స పొందుతూ రెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని దాసరిపాలేనికి చెందిన ఓ మహిళ మృతి చెందగా ఆమెకు పాజిటివ్‌గా అధికారులు ప్రకటించారు. దీంతో అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఆందోళన నెలకొంది.  


మంగళగిరిలో మూడు కేసులు నమోదైనట్టు కొవిడ్‌-19 వైద్యులు అంబటి వెంకటరావు తెలిపారు. టిప్పర్ల బజారులో రెండు, పాత మంగళగిరిలో ఒక్క కేసు నమోదయ్యాయని, ప్రైమరీ, సెకెండరీ కాంటాక్టులను గుర్తించి క్వారంటైన్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.


తాడేపల్లి పరిధిలో మంగళవారం 24 కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. వీరిలో మహానాడుకు చెందిన 20 మందికి, ప్రాతూరు అడ్డరోడ్డు సమీపంలోని ఓ అపార్టుమెంటులో నలుగురికి పాజిటివ్‌ వచ్చింది. మండలంలోని ఉండవల్లి గ్రామంలో 230 మందికి మంగళవారం మొబైల్‌ స్వాబ్‌ టెస్టులు నిర్వహించారు. స్థానిక జామాయిల్‌ తోట బజార్‌లో ఒక కేసు నమోదైనట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి రాధాకృష్ణకుమారి తెలిపారు.


ఈపూరు మండలం కొండ్రముట్ల గ్రామంలో భార్యాభర్తలకు పాజిటివ్‌ వచ్చినట్లు పీహెచ్‌సీ వైద్యుడు నాగేంద్రబాబు తెలిపారు. గ్రామంలో వారు నివసించే ప్రాంతాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించినట్లు ఎస్‌ఐ సింగయ్య తెలిపారు. 


కర్లపాలెం మండలం యాజలి గ్రామపంచాయతీ పరిధిలో ఓ వ్యక్తికి పాజిటివ్‌ నమోదైనట్లు వైద్యాధికారి డాక్టర్‌ సుహానాబేగం తెలిపారు. అతడితో ప్రైమరీ కాంటాక్ట్‌ ఉన్న 17 మంది, సెకండరి కాంటాక్ట్‌ ఉన్న ఏడుగురిని అధికారులు గుర్తించారు. తహసీల్దార్‌ మోహనరావు, ఎంపీడీవో టి.ఉషారాణి, ఎస్‌ఐ వాగల శ్రీహరి గ్రామాన్ని సందర్శించారు. 


రాజుపాలెం పీహెచ్‌సీ పరిధిలో పనిచేసే ఓ హెల్త్‌ అసిస్టెంట్‌కు పాజిటివ్‌ వచ్చింది. ఆమె పిడుగురాళ్లలోని బెల్లంకొండ డొంకప్రాంతంలో నివసిస్తుండటంతో  అధికారులు ఆ ప్రాంతంలో పారిశుధ్య చర్యలు చేపట్టారు. 


పెదకూరపాడు మండలంలో ఓ మహిళకు పాజిటివ్‌ వచ్చినట్టు వైద్యాధికారి డాక్టర్‌ ప్రియాంక తెలిపారు. ఈమె  జూన్‌ 30న హైదరాబాద్‌ నుంచి గ్రామానికి రాగా పరీక్షలు నిర్వహించగా కరోనాగా నిర్ధారించారు.  


పెదనందిపాడు మండలం అన్నవరం గ్రామానికి చెందిన ఓ గర్భిణికి పాజిటివ్‌గా నిర్ధారించారు. హైదరాబాద్‌ నుంచి ఈమె ఈ నెల 1న గ్రామానికి రాగా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది.  


వినుకొండలో ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధారించారు.  పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాలను గుర్తించిన అధికారులు రెడ్‌జోన్‌గా ప్రకటించారు.


సత్తెనపల్లి రఘురాంనగర్‌ ప్రాంతంలో నివసించే ఓ ప్రభుత్వ ఉద్యోగి కరోనాతో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. సోమవారం ప్రకటించిన ఐదు కేసుల్లో ఇతడు కూడా ఉన్నాడు. ఇతడు నాలుగు రోజులుగా జ్వరం, శ్వాస సమస్యలతో అస్వస్థతకు గురికాగా సోమవారం నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. ఆయన భార్యకు కూడా పాజిటివ్‌. దీంతో అతడు నివసించే ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు. వడ్డవల్లికి చెందిన ఓ యువకుడికి కూడా పాజిటివ్‌ వచ్చినట్లు తెలుస్తుంది. 


అమరావతి మండలంలో 14 కేసులు నమోదు కావడంతో మంగళవారం శ్రీరామకృష్ణ హిందూహైస్కూల్‌లో 157 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారి శ్రీజ్యోతి తెలిపారు. పెదనందిపాడులోని ఆరోగ్య కేంద్రంలో పెదనందినాడు, కాకుమాను మండలాలకు చెందిన 155 మందికి కరోనా నిర్థారణా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారులు నందకుమార్‌, వైదేహి తెలిపారు.


వందకు చేరువలో తెనాలి

తెనాలి పట్టణంలో కరోనా వైరస్‌ రోజురోజుకు తీవ్రమవుతోంది. మంగళవారం 21 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో పట్టణంలో 98 కేసులు ఉన్నాయి. మారీసుపేటలో 18 కేసులు నమోదు కాగా, ఇవన్నీ ప్రైమరీ కాంటాక్టు కారణంగానే వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో ఇద్దరు వార్డు వలంటీర్లు, తాడేపల్లి మహానాడులో పని చేసే కానిస్టేబుల్‌, గుంటూరు కార్పొరేషన్‌లో పని చేసే ఓ ఉద్యోగి ఉన్నారు. ఇస్లాంపేట, సాలీపేట, సుల్తానాబాద్‌లో ఒక్కొక్క కేసు నమోదు అయ్యాయి. రూరల్‌ మండల గ్రామాల్లో నమోదైన కేసులు 29గా ఉన్నాయి.


లక్ష దాటిన కరోనా పరీక్షలు 

కరోనా పరీక్షల నిర్వహణలో జిల్లా రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు లక్షా 2 వేల మందికి పైగా టెస్టులు నిర్వహించింది. ఇందులో 2,679 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. దీనిని పరిగణనలోకి తీసుకుంటే సేకరించిన శాంపిల్స్‌లో 2.50 శాతం మందికి పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. దాదాపుగా 1573 మంది ప్రస్తుతం కొవిడ్‌ ఆస్పత్రులు, క్వారంటైన్‌ కేంద్రాలు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లు, హోం ఐసోలేషన్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. 1,078 మంది డిశ్చార్జి అయ్యారు. 28 మంది(1.14 శాతం) చనిపోయారు. గుంటూరు నగరపాలకసంస్థ పరిధిలో ఇప్పటికే 1,200 కేసులు నమోదు కాగా వారిలో 663 మంది మాత్రమే డిశ్చార్జి అయ్యారు. 
నరసరావుపేటలో కరోనా జైలు

జైళ్ళలో శిక్ష అనుభవిస్తున్న, రిమాండ్‌లో ఉన్న ఖైదీలను కరోనా నుంచి కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందుకుగాను జిల్లాకో స్పెషల్‌ జైలును సిద్ధం చేశారు. ఇందులో భాగంగా జిల్లాకు సంబంధించి నరసరావుపేట సబ్‌ జైలులో స్పెషల్‌ జైలును ఏర్పాటు చేశారు. జిల్లాలో ఆయా కేసుల్లో రిమాండ్‌ విధించే ఖైదీలను ఇక నుంచి ఆ జైలుకు తరలించనున్నారు. అక్కడకు తరలించాక కొవిడ్‌ పరీక్షలు చేసి నెగిటివ్‌ వస్తే ఆయా ఖైదీలను సంబంధిత జైలుకు తరలిస్తారు. ఒక వేళ పాజిటివ్‌ వస్తే వెంటనే సంబంధిత ఆసుపత్రికి తరలిస్తారు. ఇక నుంచి రిమాండ్‌ ఖైదీలను ముందుగా నరసరావుపేట జైలుకు తరలించనున్నారు.

Updated Date - 2020-07-08T16:42:46+05:30 IST