ఆడపిల్లలపై వివక్ష వద్దు: కలెక్టర్‌ ఆనంద్‌కుమార్

ABN , First Publish Date - 2020-10-12T15:34:24+05:30 IST

ఆడపిల్లలపై వివక్ష లేకుండా తల్లిదండ్రులు బాలురుతో పాటు బాలికలను అన్ని రంగాల్లో..

ఆడపిల్లలపై వివక్ష వద్దు: కలెక్టర్‌ ఆనంద్‌కుమార్

గుంటూరు(ఆంధ్రజ్యోతి): ఆడపిల్లలపై వివక్ష లేకుండా తల్లిదండ్రులు బాలురుతో పాటు బాలికలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని కలెక్టర్‌ ఆనంద్‌కుమార్‌ తెలిపారు.  జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన అంతర్జాతీయ బాలిక దినోత్సవం సభలో ఆయన ప్రసంగించారు. ఈ ఏడాది బాలికలకు అందరితో సమానమైన భవిష్యత్తు కావాలి అనే అంశంపై వేడుకలను జరుపుకుంటున్నామన్నారు. సమాజంలో ఆడపిల్లలపై ఉన్న అసమానతలు, లింగవివక్ష వల్ల తల్లులు సైతం మగపిల్లలు పుట్టాలనే పరిస్థితుల్లో ఉన్నారని చెప్పారు. ఆడపిల్ల పుడితే పండగ చేసుకునే రోజులు రావాలని కలెక్టర్‌ ఆకాంక్షించారు. గ్రామాల్లో ఆడపిల్లలను కన్న తల్లులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత మేళతాళాలు, ఊరేగింపుగా ఇంటికి తీసుకొచ్చే కార్యక్రమాన్ని అంగన్‌వాడీ కార్యకర్తలు నిర్వహించాలన్నారు. జేసీ ప్రశాంతి మాట్లాడుతూ మహిళలపై వివక్ష తగ్గాలన్నా, పురుషులతో పాటు సమానంగా హక్కులు కల్పించాలన్నా తల్లిదండ్రులు, సమాజం అందుకు అవసరమైన వాతావరణం సృష్టించేందుకు ముందుకు రావాలన్నారు.  


బాలిక కరీమూన్‌ని సన్మానించిన కలెక్టర్‌

ఇటీవల నాదెండ్లలో సైకో మహిళ నుంచి చెల్లిని, తమ్ముడిని సమయస్ఫూర్తితో ఇంట్లోకి తీసుకెళ్లి తలుపులు వేసి వారి ప్రాణాలను రక్షించిన సాహస బాలిక కరీమూన్‌ని కలెక్టర్‌ సన్మానించారు. కరీమూన్‌ చూపించిన తెగువ ఎంతోమందికి స్ఫూర్తిని కలిగించిందన్నారు. వెల్‌బేబీ షోలో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పీడీ మనోరంజని, ఏడీ వసంతబాల, అదనపు డీఎంహెచ్‌వో డాక్టర్‌ శోభారాణి, డీఎస్‌వో పద్మజ, డీసీపీవో నాగ కోటేశ్వరరావు, చైల్డ్‌లైన్‌ కో-ఆర్డినేటర్‌ సమీర్‌, క్రాప్‌ ఆర్గనైజేషన్‌ నిర్వాహకులు వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-10-12T15:34:24+05:30 IST