ఇళ్లపట్టాల పంపిణీకి సన్నాహాలు

ABN , First Publish Date - 2020-03-19T07:35:12+05:30 IST

సుప్రీంకోర్టు తీర్పు తో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలక్షన్‌ కోడ్‌ని ఉపసంహరిం చడంతో జిల్లాలో ఉగాది పండగ రోజున పేదలందరికీ ఇళ్లు పథకం కింద నివేశన స్థలాల పట్టాలు పంపిణీ చేసేందుకు

ఇళ్లపట్టాల పంపిణీకి సన్నాహాలు

గుంటూరు, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు తీర్పు తో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలక్షన్‌ కోడ్‌ని ఉపసంహరిం చడంతో జిల్లాలో ఉగాది పండగ రోజున పేదలందరికీ ఇళ్లు పథకం కింద నివేశన స్థలాల పట్టాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదివరకే జిల్లాకు కేటా యించిన రూ.450 కోట్లని తాజాగా ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో రైతుల వద్ద సేకరిస్తున్న భూములకు నష్టపరిహారం చెల్లింపునకు అడ్డంకులు తొలగిపోయాయి. అయితే కేవలం మరో వారం వ్యవధి మాత్రమే ఉన్న నేపథ్యంలో ఆ రోజు కల్లా లేఅవుట్లలో ప్లాట్ల అభివృద్ధి, రిజిస్ట్రేషన్‌లు పూర్తి అవుతాయో, లేదోనన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇదే సమయంలో ఉగాది రోజున లాంఛనంగా కొద్దిమందికి పట్టా లు ఇచ్చి ఆ తర్వాత విడతల వారీగా మిగతా లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేస్తారన్న చర్చ కూడా రెవెన్యూవర్గాల్లో జరుగుతోన్నది. 


వైఎస్‌ఆర్‌ నవశకంలో భాగంగా పేదలందరికీ ఇళ్ల పట్టాలను ఈ నెల 25న పంపిణీ చేయనున్నట్లు ఇదివరకే ప్రభుత్వం ప్రకటించింది. ఆ దిశగా అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల్లో లేఅవుట్‌లు వేసి ప్లాట్లుగా విభజించి, అంతర్గత రోడ్లతో అభివృద్ధి పనులు కూడా ప్రారంభించారు. జిల్లాలో 2.60 లక్షలకు అర్హులైన లబ్ధిదారుల సంఖ్య చేరుకోవడంతో ప్రైవేటు భూముల సేకరణని కూడా అధికార యంత్రాంగం చేపట్టింది. కొన్నిచోట్ల రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి భూములు ఇవ్వగా చాలాచోట్ల అసైన్డ్‌ భూములు కావడంతో వాటి అనుభవదారుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఈలోపు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రావడం, ఉగాది రోజున పేదలకు ఇళ్ల పట్టాలపంపిణీని నిలుపుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఆదేశించారు. దాంతో గత 10 రోజుల నుంచి ఇళ్లపట్టాలకు సంబంధించి ఎలాంటి పనులు జరగడం లేదు. అయితే ఎన్నికల కోడ్‌ని బుధవారం సాయంత్రం ఎస్‌ఈసీ ఉపసంహరించడంతో ప్రభుత్వం తిరిగి ఈ పథకం అమలు పై దృష్టి పెట్టింది. మళ్లీ కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, ఆర్డీవో లు, తహసీల్దార్లు, మునిసిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవో లను పరుగులు పెట్టించడం ప్రారంభించింది. ఒకవేళ ఆరువారాల తరువాత ఎన్నికలు జరిగితే ఈ పథకం తమకు మరింత లబ్ధిచేకూరుస్తుందన్న భావనలో అధికార పార్టీ ఉన్నది. దీని దృష్ట్యా ఉగాది రోజున గరిష్టంగా లబ్ధిదారుల చేతికి ఇళ్ల పట్టాలు అందజేయాలని భావిస్తోన్నది. 


మరోవైపు ఎన్నికల కోడ్‌ కారణంగా జిల్లాలో బియ్యం కార్డుల పంపిణీ నిలిచిపోయింది. అప్పటికే ఎనిమిది లక్షల వరకు కార్డులను పంపిణీ చేశారు. మరో ఐదు లక్షలకు పైగా కార్డులను సచివాలయాలకు పంపించి ఉన్నారు. చివరి విడతగా 40వేల కార్డులను పౌరసరఫరాల శాఖ ముద్రించి బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రానికి పంపించింది. వాటన్నింటిని కలిపి గురువారం నుంచి వలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు పంపిణీని పునరుద్ధరిస్తారు. కార్డులతోపాటు ఎక్విటెన్స్‌ ఫారాలను కూడా ప్రభుత్వం పౌరసరఫరాల కార్యా లయానికి పంపించింది. ఇదేరీతిన విద్యాదీవెన, వసతి దీవెన కార్డులు కూడా పంపిణీ చేసేందుకు ఆయాశాఖలు ఏర్పాట్లు చేసుకొంటున్నాయి. 

Updated Date - 2020-03-19T07:35:12+05:30 IST