‘దణ్ణం పెట్టి అడుగుతున్నాం.. మా మొర ఆలకించండి’

ABN , First Publish Date - 2020-03-19T07:54:52+05:30 IST

మా ఓట్లతో అధికారంలోకి వచ్చి..

‘దణ్ణం పెట్టి అడుగుతున్నాం.. మా మొర ఆలకించండి’

రాజకీయ క్రీడలో పావులను చేయొద్దు

మా ప్రాంతం శ్మశానం కాదు, ఏపీ అభివృద్ధికి పునాది


గుంటూరు(ఆంధ్రజ్యోతి): ‘మా ఓట్లతో అధికారంలోకి వచ్చి మా జీవితాలపై స్వారీచేస్తూ మీ రాజకీయ క్రీడలో మమ్మల్ని పావులు చేస్తున్నారు’ అంటూ అమరావతి ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని కోరుతూ వరుసగా 92వ రోజు బుధవారం ఆందోళనలు కొనసాగాయి. తుళ్లూరు, మందడం, వెలగపూడి, పెనుమాక, ఉండవల్లి, యర్రబాలెం, కృష్ణాయపాలెం, నవులూరు, రాయపూడి, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డు వద్ద ఆందోళనలు కొనసాగించారు. 


దణ్ణంపెట్టి అడుగుతున్నాం!

రాజధాని అమరావతి కోసం ప్రభుత్వాన్ని నమ్మి ఉన్నదంతా ఇచ్చేశాం.. ఇప్పుడు రాజధానిని మార్చాలని చూస్తే మాకు ఉరే శరణ్యమని రాయపూడి రైతులు, మహిళలు ఉరితాళ్లు మెడకు తగిలించుకొని నిరసన తెలిపారు. ‘దండం పెట్టి అడుగుతున్నాం... మా మొర ఆలకించండి’ అంటూ తుళ్లూరు రైతులు, మహిళలు చేతులు జోడించి సీఎం జగన్‌ను వేడుకున్నారు. 


అరెస్టులతో ఆపలేరు

జీవితంలో ఎన్నడూ అనుకోనివిధంగా పోలీసుస్టేషన్లు,  కోర్టులు, జైళ్లు చూశాం... లాఠీదెబ్బలు తిన్నాం... ఒక్కొక్కరిపై రెండు, మూడేసి కేసులు పెట్టారు... భూములు ఇచ్చి న్యాయమడగటమే మేం చేసిన నేరమా? అంటూ మందడం రైతులు, మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రోన్‌ కేసులో బెయిల్‌పై విడుదలైన జేఏసీ కన్వీనర్‌ పువ్వాడ సుధాకర్‌తోపాటు పలువురు రైతులు మందడం దీక్షాశిబిరానికి వచ్చారు. వారికి రైతులు జై జై నినాదాలు పలికారు. అమరావతిపై స్పష్టమైన ప్రకటన వచ్చేవరకు తాడోపేడో తెల్చుకుంటా’మని రైతులు, మహిళలు ముక్తకంఠంతో నినదించారు. 


మండుటెండలో వడియాలు పెట్టి నిరసన

రాజధాని తరలింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తుళ్లూరు మహిళలు వినూత్న ప్రదర్శన నిర్వహించారు. మండుటెండలో జై అమరావతి అంటూ వడియాలు పెట్టి నిరసన తెలిపారు. 92రోజులుగా పిల్లాపాపలతో ఇంటిల్లిపాది రోడ్డునపడి ఆందోళన చేస్తుంటే కనీసం ఇటువైపు చూసిన నాథుడేలేడని మండిపడ్డారు. తమ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే నాలుగు నెలలుగా కనపడటం లేదన్నారు. తమ ప్రాంతం శ్మశానం కాదని రాష్ట్రాభివృద్ధికి పునాది అని మహిళలు పునరుద్ఘాటించారు. మహిళా జేఏసీ నేత డాక్టర్‌ రాయపాటి శైలజ... ప్రమాదకారి అయిన కరోనా వైరస్‌పై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మహిళలు, రైతులకు వివరించారు. అనంతరం కొందరు వైద్యులు హోమియా మందులు పంపిణీ చేయగా... టీవీ 5 ఛానల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బీఆర్‌ నాయుడు రైతుల చేస్తున్న ఆందోళనలకు మద్దతు తెలిపారు. 

Updated Date - 2020-03-19T07:54:52+05:30 IST